మోడీ ధ్యానానికి ఆ ప్రాంతమే ఎందుకు? ఆ లెక్కేంది?
ఎవరేం చెబుతారు? మెజార్టీ వర్గాల మాటేమిటి? వారి అంచనాలు ఏమిటన్న దానిపై ఇప్పటికే బోలెడన్ని లెక్కలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 1 Jun 2024 5:00 AM GMTనరాలు తెగే ఉత్కంఠ వేళ.. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయని అందరూ అదే పనిగా మాట్లాడుకుంటూ.. తమ అంచనాల్లో నిజమెంతన్న విషయాన్ని వేరే వారితో క్రాస్ చేసుకోవటం కనిపిస్తూ ఉంటుంది. ఇక.. రాజకీయ నేతల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. వీరి సంగతే ఇలా ఉంటే.. వారందరిని నడిపించే రాజకీయ అధినేతల సంగతేంటి? వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? వారి ఆలోచనలు ఎలా ఉంటాయన్న విషయాన్ని ఆలోచిస్తేనే.. వారెంత ఒత్తిడికి గురి అవుతుంటారో ఇట్టే అర్థమవుతుంది. ఏడు దశల్లో సుదీర్ఘంగా సాగిన ఎన్నికల ప్రక్రియలో కీలకమైన పోలింగ్ దశ పూర్తి కావటంతో పాటు ఈ రోజు సాయంత్రం ఆరున్నర గంటల వేళలో జాతీయ మీడియా సంస్థలన్నీ తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించనున్న సంగతి తెలిసిందే.
ఎవరేం చెబుతారు? మెజార్టీ వర్గాల మాటేమిటి? వారి అంచనాలు ఏమిటన్న దానిపై ఇప్పటికే బోలెడన్ని లెక్కలు వినిపిస్తున్నాయి. ఇలాంటి వేళలో.. వీటన్నింటికి దూరంగా దాదాపు 48 గంటల పాటు ధ్యానంలో ఉండేందుకు వీలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవటం.. అందుకు తమిళనాడులోని ప్రసిద్ధ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ లో ధ్యానం చేసుకోనున్నట్లుగా పేర్కొని అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. అందరిలా వ్యవహరిస్తే ఆయన్ను నరేంద్ర మోడీ అని అనలేం. ఊహించని రీతిలో రియాక్టు కావటం ఆయనకు మొదట్నించి అలవాటే. ఇప్పుడు అదే ధోరణిని ప్రదర్శిస్తున్నారని చెప్పాలి.
ఎన్నికల ఫలితాలపై యావత్ దేశమే కాదు.. అంతర్జాతీయంగా కూడా బోలెడంత ఆసక్తి వ్యక్తమవుతోంది.రెండు దఫాలుగా అధికారాన్ని నిలుపుకున్న మోడీ.. ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా అధికారాన్ని చేబట్టనున్నారా? ఆయన ఈసారి లక్ష్యంగా పెట్టుకున్న 400 ప్లస్ సీట్లను సాధిస్తున్నారా? కనీసం 370 మార్క్ ను దాటతారా? అన్నది ఇప్పుడు ఇంట్రస్టింగ్ గా మారింది.
మిగిలిన వారి మాదిరి తనకు ఎన్నికల ఫలితాల మీద ఎలాంటి ఆందోళన లేదని చెప్పిన ఆయన.. ఫలితాల వెల్లడి రోజున తాను టీవీ చూడనని.. ఫోన్ ను కూడాచెక్ చేయనని చెప్పారు. మరేం చేస్తారని అడిగితే.. ధ్యానం చేయనున్నట్లుగా పేర్కొనటంతో అందరూ దాని గురించి మాట్లాడుకునేలా చేశారు. తన 48 గంటల నాన్ స్టాప్ ధ్యానానికి సంబంధించి ఆయన ఎంపిక చేసుకున్న వేదిక మీద ఇప్పుడు ఆసక్తికర చర్చ జరుగుతోంది. దేశంలో ఎన్నో ప్రాంతాలు ఉంటే.. మోడీ మాత్రం కన్యాకుమారిని ఎందుకు ఎంపిక చేసుకున్నారన్న విషయం వెనుక లెక్కలున్నట్లుగా చెబుతున్నారు.
ఇప్పుడు ప్రధాని మోడీ ఎక్కడైతే ధ్యానం చేస్తున్నారో.. 1892లో స్వామి వివేకానంద అక్కడే ధ్యానం చేశారు. అప్పట్లో స్వామి వివేకానందుడు ఒక రాయి మీద ధ్యానం చేశారు. మూడు రోజులు.. మూడు రాత్రుల పాటు ఆయన ధ్యానంలో ున్నారు. ఇక్కడ ధ్యానం చేసుకున్న తర్వాతే వివేకానందుడికి జ్ఞానోదయం అయిందని చెబుతారు. ఆయన తన సిద్ధాంతాలకు తుది రూపం తీసుకొచ్చింది కూడా ఇక్కడేనని చెబుతారు.
స్వామి వివేకానందుడు ధ్యానం చేసిన ప్రాంతాన్ని అందరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో 1963లో ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఏక్ నాత్ రనాదే ఒక స్మారక కట్టడాన్ని నిర్మించారు. అదే.. ‘వివేకానంద రాక్ మెమోరియల్’. 1970 నాటికి పూర్తైన ఈ నిర్మాణం ఇప్పటికే చక్కటి పర్యాటక ప్రాంతంగా పేరొందింది. అప్పటి రాష్ట్రపతి వీవీ గిరి దీన్ని ప్రారంభించారు. ఇంత స్పెషల్ అయిన ప్రాంతం కాబట్టే.. ప్రధానమంత్రి మోడీ ఇక్కడే ధ్యానం చేయాలని డిసైడ్ చేసినట్లుగా చెబుతారు.
మోడీ విషయానికి వస్తే ఆయన సంఘ్ పరివార్ మూలాలే కాదు.. రామక్రిష్ణ మిషన్ లోనూ సభ్యుడన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాను చేసుకునే ధ్యానం కోసం కన్యాకుమారిని ఎంపిక చేసుకోవటంలో రాజకీయంగా కూడా లెక్కలు ఉన్నాయని చెబుతారు. హ్యాట్రిక్ పీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత నుంచి ఫోకస్ సౌత్ ఆపరేషన్ ను మరింత బలంగా చేపడతారని చెబుతున్నారు.
మొత్తం 543 స్థానాలు ఉన్న లోక్ సభలో ఒక్క దక్షిణాదిలోనే 131 సీట్లు ఉండటం.. అందులో తమిళనాడులో అత్యధికంగా 39 ఎంపీ స్థానాలు ఉండటం తెలిసిందే. కరుణానిది.. జయలలితల శకం ముగిసి.. పొలిటికల్ స్పేస్ ఎక్కువగా ఉన్న ఆ రాష్ట్రంలోకి తాము విజయవంతంగా అడుగు పెట్టగలిగితే.. పార్టీ ఫ్యూచర్ కు మరింత మేలు జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. తాను చేసే ధ్యానంతో కన్యాకుమారిని మరింత ఫేమస్ చేయటంతో పాటు.. రానున్న రోజుల్లో భారీ ఎత్తున దేశీయ.. విదేశీ పర్యాటకులు పోటెత్తటం ఖాయమని చెబుతున్నారు. మోడీ ఇమేజ్ తమిళులకు మరింత పాజిటివ్ గా తెలిసేలా చేయనున్నట్లు చెప్పాలి.