మారుతున్న మోడీ.. జీ7 సదస్సులో కీలక పరిణామం..!
భారత్‌లో జరుగుతున్నవి `మతపరమైన ఎన్నికలు` అంటూ వాషింగ్టన్ పోస్టు సహా పాకిస్తాన్ పత్రికలు తీవ్రస్థాయిలో వార్తలు గుప్పించాయి.
By: Tupaki Desk | 14 Jun 2024 4:51 PM GMTమత పరంగా రాజకీయాలు చేయడం.. బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. తాజాగా ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లోనూ బీజేపీ ఈ పంథానే ఎంచుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పదే పదే మతపరమైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విపక్షాలు మండిపడినా ఆయన పట్టించుకోలేదు. మతపరంగా హిందూ వర్గాలను ఆయన ఆకర్షించే ప్రయత్నం చేశారు. అయితే.. ఇదే విషయంపై ప్రపంచ మీడియా కూడా ఎన్నికల సమయంలో మోడీని తప్పుబట్టింది. భారత్‌లో జరుగుతున్నవి `మతపరమైన ఎన్నికలు` అంటూ వాషింగ్టన్ పోస్టు సహా పాకిస్తాన్ పత్రికలు తీవ్రస్థాయిలో వార్తలు గుప్పించాయి.
అయినప్పటికీ మోడీ లెక్కచేయలేదు. మతపరమైన చీలిక ద్వారా.. బీజేపీకి 400 స్థానాలు వస్తాయని ఆయన నమ్మినట్టు ఉన్నారు. కానీ, ఫలితం వచ్చిన తర్వాత.. వాటి సంగతి ఏంటనేది ఆయనకు బీజేపీకి కూడా తెలిసివచ్చింది. 2019లో 303 స్థానా లు గెలిచిన బీజేపీ తాజా ఎన్నికల్లో 240 సీట్లకు పడిపోయింది. కూటమి పార్టీల దన్నుతో అధికారం దక్కించుకున్నారు కానీ.. మానసికంగామోడీ మాత్రం నలిగిపోయారు. దీంతో ఆయనలో మార్పు కనిపిస్తోంది. `ఇలానే ఉంటే..` ప్రపంచానికి విశ్వగురువు.. అన్న కీర్తి కూడా దక్కకపోవచ్చన్న సంకేతాలు వచ్చిన దరమిలా.. మోడీ మారుతున్నారు.
ఒకప్పుడు పక్కన పెట్టిన వారినే ఆయన ఆలింగనాలు చేసుకుంటున్నారు. 2014లో తొలి విజయం అందుకున్న మోడీ.. ఆ సమయంలో ఇటలీలో పర్యటించినప్పుడు.. అప్పటి పోప్ ఫ్రాన్సిస్‌ను కలుసుకునేందుకు ఇష్టపడలేదు. పర్యటనలో కనీసం పోప్ ప్రస్తావన కూడా లేకుండా మోడీ వ్యవహరించారు. ఎందుకంటే.. క్రిస్టియన్లకు ఆరాధ్యదైవం కావడంతో ఆయనను తాను కలిస్తే.. ప్రమాదమని భావించి ఉంటారు. కట్ చేస్తే.. 10 ఏళ్ల తర్వాత.. మరోసారి అదే ఇటలీలో మోడీ పర్యటించారు. ఈసారి గ్రూప్-7 దేశాల శిఖరాగ్ర సదస్సుకు మోడీ హాజరయ్యారు. సంప్రదాయం ప్రకారం ఇటలీలో ఏం జరిగినా పోప్‌కు ఆహ్వానం అందుతుంది.
అలానే ఇప్పుడు కూడా పోప్ ఫ్రాన్సిస్ హాజరయ్యారు. సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు. ఈనేపథ్యంలో సదస్సుకు వచ్చిన దేశాధ్యక్షులు, ప్రధానులకు ఆయన గ్రీటింగ్స్ తెలిపారు. ఈ సందర్భంగా పోప్‌ను ప్రధాని మోడీ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఈ దృశ్యం అందరినీ ఆకర్షించింది. సుమారు 1 నిమిషం పాటు ఇరువురు మాట్లాడుకున్నారు. అయితే.. ఇలా పోప్‌ను మోడీ ఆలింగనం చేసుకోవడం, ఆత్మీయంగా పలకరించడం వంటివి చర్చనీయాంశం అయ్యాయి. మారిన మోడీని చూడండంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.