Begin typing your search above and press return to search.

ఉక్రెయిన్ అధ్యక్షుడి భుజం మీద చెయ్యి వేసి భారత్ స్టాండ్ చెప్పేసిన మోడీ

జెలెన్ స్కీతో భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. వ్యవసాయం.. ఆరోగ్యం.. సంస్క్రతి.. మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   24 Aug 2024 3:46 AM GMT
ఉక్రెయిన్ అధ్యక్షుడి భుజం మీద చెయ్యి వేసి భారత్ స్టాండ్ చెప్పేసిన మోడీ
X

ఉక్రెయిన్ - రష్యా మధ్య చోటు చేసుకున్న పరిణామాలు.. యుద్ధం విషయంలో భారతదేశం స్టాండ్ ఏమిటి? ఈ పరిణామాల్ని భారత సర్కారు ఎలా చూస్తుందన్న దానిపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ఉక్రెయిన్ - రష్యా యుద్ధంలో భారత్ ఎప్పుడూ తటస్థంగా లేదని.. తాము ఎల్లప్పుడు శాంతి వైపే ఉన్నామన్నారు. చర్చలు.. సంభాషణల ద్వారానే వివాదాల్ని పరిష్కరించే ప్రయత్నాలకు భారత్ సమర్థిస్తుందన్న మోడీ.. ఉక్రెయిన్ అధ్యక్షుడితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

అంతకు ముందు.. జెలెన్ స్కీను కలిసిన సందర్భంగా అతడికి ఆత్మీయ ఆలింగనాన్ని చేసుకున్న మోడీ.. ఈ సందర్భంగా అతడి భుజం మీద చెయ్యి వేసిన తీరు ఆసక్తికరంగా మారింది. అతడితో తనకున్న చనువును చేతలతో చెప్పేసిన మోడీ.. మాటలతోనూ తానేం కోరుకుంటున్న విషయాన్ని చెప్పేశారు. ఉక్రెయిన్ లో యుద్ధాన్ని ముగించటానికి రష్యాతో చర్చలకు కూర్చోవాలన్న మోడీ.. ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పటానికి స్నేహితుడిలా వ్యవహరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

చర్చలు.. దౌత్యం ద్వారా మాత్రమే యుద్ధానికి పరిష్కార మార్గం కొనుగొనవచ్చన్న మోడీ.. "మనం సమయాన్ని వేస్టే చేయకుండా ఆ దిశలో ప్రయనించాలి. ఆ సంక్షోభం నుంచి బయటపడటానికి ఇరుపక్షాలు కూర్చొని కలిసి చర్చించాలి. శాంతిని నెలకొల్పే దిశగా జరిగే ఎలాంటి ప్రయత్నాల్లోనైనా క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారతదేశం సిద్ధంగా ఉంది. నేను మీకు హామీ ఇస్తున్నా. ఈ విషయంలో ఒక స్నేహితుడిగా నేను మీకు ఏం చేయాల్సి వచ్చినా అందుకు సిద్ధంగా ఉన్నానన్న భరోసా ఇవ్వాలనుకుంటున్నా" అని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ ఎదుర్కొన్న అతి పెద్ద సంక్షోబాల ఆనవాళ్లకు సంబంధించి ఏర్పాటు చేసిన మ్యూజియంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఇరువురు నేతలు వీక్షించారు. ఈ సందర్భంగా మోడీ గంభీరంగా ఉండిపోయారు. జెలెన్ స్కీను భారత్ కు రావాలని ప్రధాని మోడీ ఆహ్వానించారు.

జెలెన్ స్కీతో భేటీ సందర్భంగా ఇరు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు కుదిరాయి. వ్యవసాయం.. ఆరోగ్యం.. సంస్క్రతి.. మానవతా సాయం అంశాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం.. ఆర్థిక అంశాలు.. రక్షణ రంగం.. ఫార్మాస్యూటికల్స్.. వ్యవసాయం.. విద్య అంశాలపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు చెప్పిన భారత సర్కార్.. ఉక్రెయిన్ లో యుద్ధానికి సంబంధించిన అంశాలే ఎక్కువగా మాట్లాడుకున్నట్లుగా పేర్కొనటం గమనార్హం.

ఇదిలా ఉండగా.. మోడీ ఉక్రెయిన్ పర్యటన నేపథ్యంలో కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ముందు మోడీ ఆత్మీయ ఆలింగనంపై ప్రశ్నలు.. పుతిన్ ను హగ్ చేసుకోవటంపైనా ప్రశ్నలు వచ్చాయి.దీనిపై ఆయన కాసింత ఘాటుగా రియాక్టు అయ్యారు. మోడీ -పుతిన్ మధ్య స్నేహాన్ని ప్రాశ్చాత్య దేశాలు సరిగా అర్థం చేసుకోలేవన్న ఆయన.. కల్చర్ లో ఉన్న తేడానే దీనికి కారణంగా పేర్కొన్నారు. తమ ప్రాంతంలో ఒకరినొకరు కలిసేటప్పుడు ఆలింగనం చేసుకోవటం సహజమన్న జైశంకర్.. "ప్రజా సంబంధాల్లో ఇదో భాగం. ఇప్పుడు జెలెన్ స్కీ కూడా మోడీని అప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. ఇది మీ కల్చర్ లో భాగం కాకపోవచ్చు. ఈ విషయంలో మన మధ్య కల్చరల్ డిఫరెన్స్ ఉందని భావిస్తున్నా" అంటూ ప్రాశ్చాత్య మీడియా ప్రతినిధికి కాస్తంత ఘాటుగా బదులిచ్చారు.