Begin typing your search above and press return to search.

వెబ్ సిరీస్ పేరు చెప్పి మోడీ వెటకారం... కాంగ్రెస్ పై కౌంటర్స్!

అయినప్పటికీ ఆ పార్టీపై విమర్శలు ఆగడం లేదు. ఈ క్రమంలో తాజాగా తాజాగా ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు.

By:  Tupaki Desk   |   12 Dec 2023 12:45 PM GMT
వెబ్  సిరీస్  పేరు చెప్పి మోడీ వెటకారం... కాంగ్రెస్  పై కౌంటర్స్!
X

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ - కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఈ సమయంలో బ్లాక్ మనీ పేరు చెప్పి, విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్తల పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ.. మోడీని ఇరుకునపెడుతుంటే... తాజాగా వెలుగులోకి వచ్చిన రూ.351 కోట్ల నోట్ల గుట్టలతో మోడీ.. కాంగ్రెస్ పై సెటైర్లు వేస్తున్నారు. ఈ సందర్భంగా తాజాగా ఆన్ లైన్ వేదికగా మోడీ స్పందించారు. కాంగ్రెస్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

అవును... ఝార్ఖండ్‌ కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ సాహుకు సంబంధించిన ఆఫీసులపై ఐటీ శాఖ అధికారులు జరిపిన దాడుల్లో రూ.351 కోట్ల విలువైన నగదు దొరికిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నోట్ల కట్టలతో పాటు సుమారు మూడు కిలోల బంగారు ఆభరణాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారని కథనాలు వెలువడ్డాయి.

దీంతో ఈ వ్యవహారంపై ప్రత్యర్థులు మొదలుపెట్టకముందే రియాక్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ... ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తెలిపింది. అయినప్పటికీ ఆ పార్టీపై విమర్శలు ఆగడం లేదు. ఈ క్రమంలో తాజాగా తాజాగా ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఉండగా.. "మనీ హైస్ట్" అవసరం ఎవరికి ఉండదన్నారు. ఇదే సమయంలో మనీ హైస్ట్ పై బీజేపీ షేర్ చేసిన వీడియోని ఈ ట్వీట్ కి జతచేశారు.

ఇందులో భాగంగా... "70 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ లూటీ కొనసాగుతుంటే.. ఇండియాలో మనీ హైస్ట్ లాంటి కల్పిత కథలు ఎవరికి కావాలి..?" అని మోడీ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో "కాంగ్రెస్ సమర్పిస్తోన్న మనీ హైస్ట్" పేరిట బీజేపీ షేర్ చేసిన వీడియోను జత చేశారు.

మరోపక్క తన కంపెనీలో భారీ నగదు లభ్యమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సాహు నుంచి వివరణ కోరింది. ఈ సమయంలో... అది ఆయన ప్రైవేటు వ్యవహారమని, పార్టీతో ఎలాంటి సంబంధం లేదని ఆ పార్టీ స్పష్టం చేసింది. అయితే పార్టీ వ్యక్తి అయినందువల్ల అంత మొత్తం ఎలా వచ్చిందో అధికారిక ప్రకటన చేయాల్సి ఉందని ఆదేశించింది.

కాగా, బ్యాంక్ దోపిడీల నేపథ్యంలో థ్రిల్లింగ్‌ గా సాగే వెబ్‌ సిరీస్ "మనీ హైస్ట్" కు విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆ వెబ్ సిరీస్ పేరు చెప్పి మోడీ... కాంగ్రెస్ ను ఈ విధంగా ఎద్దేవా చేశారు.