Begin typing your search above and press return to search.

జగన్ మీదకు మోడీ ...ఈ మార్పుకు కారణం...!?

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ జగన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ రాసేశారు.

By:  Tupaki Desk   |   9 May 2024 3:37 AM GMT
జగన్ మీదకు మోడీ ...ఈ మార్పుకు కారణం...!?
X

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ జగన్ ప్రభుత్వానికి డెడ్ లైన్ రాసేశారు. జూన్ 4తో జగన్ ప్రభుత్వానికి చివరి ఘడియలే అని ఆయన ట్వీట్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. ఆయన దేశంలో అనేక ప్రతిపక్ష పార్టీల మీద రాజకీయ యుద్ధం చేశారు. బహిరంగ సభలలో ప్రసంగించారు. కానీ ఇంతలా ఒక ప్రభుత్వానికి ఓటమి ముహూర్తం పెట్టడం అంటే ఆశ్చర్యంగానే ఉంది.

అసలు మోడీకి జగన్ విషయంలో ఎక్కడ తేడా వచ్చింది అన్న చర్చ సాగుతోంది. ఆయన చిలకలూరిపేట మీటింగులో జగన్ ని ఏమీ అనలేదు. కానీ తాజాగా ఈ నెల 6, 8 తేదీలలో చేసిన ఏపీ పర్యటనలలో మాత్రం ఏకంగా డైరెక్ట్ అటాక్ చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ఓడించాల్సిందే అని ప్రజలకు తీవ్ర స్వరంతో పిలుపు ఇచ్చారు. ఇలా ఎందుకు అన్నదే ఇపుడు చర్చగా ఉంది.

అదే టైం లో చంద్రబాబుని పట్టుకుని ప్రియ మిత్రమా అని సంభోదిస్తున్నారు. బుధవారం రాత్రి విజయవాడ రోడ్ల మీద జరిగిన రోడ్ షో తో ఉప్పొంగిన మోడీ తన జీవితంలో చూసిన అద్భుతమైన రోడ్ షో ఇది అని అన్నారు. ఏపీ ప్రజలు టీడీపీ కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం అయింది అని కూడా ఆయన పేర్కొన్నారు.

అంతే కాదు గత కొన్ని రోజులుగా తాను ఏపీలో పర్యటిస్తున్నానని, ఏపీ ప్రజలు ఎన్డీయే కూటమి అభ్యర్థులకు భారీగా ఓట్లు వేయనున్నారన్న విషయం అర్థమైందని తెలిపారు. మహిళలు, యువ ఓటర్ల మద్దతతో ఎన్డీయే అభ్యర్థులకు భారీ మెజారిటీ ఖాయమని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఏపీ అధికార పక్షం వైసీపీ పైనా ప్రధాని మోదీ విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ సంస్కృతితో వైసీపీకి బలమైన అనుబంధం ఉందని, అందుకే ఆ పార్టీ రాష్ట్రంలో అవినీతి, కుటిలత్వం, మాఫియా తత్వాన్ని పెంచి పోషించిందని మోదీ ధ్వజమెత్తారు. వైసీపీతో ఏపీ ప్రజలు పూర్తిగా విసిగిపోయారని, వాళ్ల ప్రభుత్వానికి జూన్ 4వ తేదీతో ఆఖరు అని స్పష్టం చేశారు.

ఇక బీజేపీ, టీడీపీ గతంలోనూ కలిసి పనిచేశాయని, భవిష్యత్ అభివృద్ధి దిశగా తమది బలమైన బంధం అని స్పష్టం చేశారు. ఎంతో క్రియాశీలకంగా ఉన్న జనసేన పార్టీ వల్ల తమ కూటమి మరింత బలోపేతం అయిందని వివరించారు. తమ ఆకాంక్షలు నెరవేర్చే సత్తా ఈ కూటమికి ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని మోదీ తన ట్వీట్ లో వెల్లడించారు.

ఇవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ తో వైసీపీని మోడీ పోల్చారు. మార్చి 16న చిలకలూరిపేట సభలోనూ ఆయన ఇదే మాట అన్నారు. దాని అర్ధం ఏమిటి అంటే వైసీపీ ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ తో కలసి ఉంటోంది అన్నదన్న మాట. ఏపీలో రాజకీయం చూస్తే జగన్ సొంత చెల్లెలు వైఎస్ షర్మిల ఏపీసీసీ చీఫ్ గా ఉంటున్నారు. ఆమె మోడీ మీద డైరెక్ట్ ఎటాక్ చేస్తున్నారు తాజాగా ఏపీ మోడీ పర్యటన నేపధ్యంలో ఏపీ ప్రజల మన్ కీ బాత్ వినండని ఆమె స్ట్రాంగ్ గానే కౌంటర్ వేశారు.

షర్మిల ఏపీ ప్రెసిడెంట్ అయ్యాక ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. విభజన హామీల గురించి మాట్లాడుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నారు. వైసీపీ బీజేపీతో పొత్తులో లేకపోయినా ఈ విషయాలు అసలు ఎత్తడంలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ విమర్శలు బీజేపీకి మోడీకి ఇబ్బందికరంగా మారుతున్నాయని అంటున్నారు.

దాంతో పాటు జగన్ షర్మిల ఒక్కటే అని మోడీ బలంగా నమ్ముతున్నట్లుగా ప్రచారం సాగుతోంది. జగన్ విశ్వసనీయత మీద కూడా మోడీ డౌట్ పడుతున్నట్లుగా ఉందని అంటున్నారు. రేపటి రోజున కేంద్రంలో అధికారానికి సరిపడా సీట్లు ఎన్డీయేకు రాకపోతే జగన్ ఇండియా కూటమి వైపుగా అడుగులు వేస్తారేమో అన్న సందేహాలు ఏవో మోడీకి ఉన్నాయని అంటున్నారు. అందుకే ఏపీలో వ్యవస్థలలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఎక్కడ బిగించాలో అక్కడ గట్టిగా బిగిస్తున్నారు అని అంటున్నారు.

మోడీ టార్గెట్ చేస్తే ఆ లెక్క వేరేగా ఉంటుందని కూడా అంటున్నారు. ఏపీలో ఎన్డీయే కూటమిదే విజయం అని మోడీ చెప్పారూ అంటే వ్యవస్థలను కూడా వైసీపీకి యాంటీగా మార్చేందుకు పూర్వ రంగం సిద్ధం అవుతోంది అంటున్నారు. ఏది ఏమైనా జగన్ కి మోడీకి గ్యాప్ అయితే వచ్చింది అని అంటున్నారు. ఆయనకు ఇది రాజకీయంగా క్లిష్ట సమయం అని అంటున్నారు

ఇక ఈ పరిణామాలు చూసిన వైసీపీ నేతలు మోడీ మారిపోయారు అని అంటున్నారు. వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి మాట్లాడుతూ మోడీలో చాలా మార్పు కనిపిస్తోందని అన్నారు. ఆయన ఆఖరుకు చంద్రబాబు స్క్రిప్ట్ ని చదువుతున్నారని కూడా మండిపడ్డారు. ఏది ఏమైనా టీడీపీ కూటమిలో గెలుపు ఆశలు పెంచేలా మోడీ వైఖరి ఉంది అని అంటున్నారు. చూడాలి మరి అంతిమ నిర్ణేతలు ప్రజలు కాబట్టి వారి తీర్పు ఎలా ఉంటుందో.