మణిపూర్ అల్లర్లపై మాట్లాడిన మోడీ... కానీ, ఏం చేశారంటే..!
మణిపూర్ విషయానికి కేటాయించిన సమయం కేవలం 9 నిమిషాలు మాత్రమే. అందులోనూ నాలుగు నిమిషాలే తమ సర్కారు ఏం చేస్తోందో చెప్పుకొచ్చారు.
By: Tupaki Desk | 10 Aug 2023 4:32 PM GMTకాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాల కూటమి.. ఇండియా ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం లక్ష్యం.. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో జరుగుతున్న అల్లర్లు.. అక్కడ జరుగుతున్న మారణ హోం.. వంటివాటిపై ప్రధాని నరేంద్ర మోడీతో ప్రకటన చేయించడమే. అయితే.. అనూహ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. మణిపూర్ అంశాన్ని ప్రస్తావిస్తూనే ఇక్కడ కూడా గతంలో కాంగ్రెస్ పాలనను ఏకరువు పెట్టారు. ఈశాన్య రాష్ట్రాల్లో చిచ్చుకు కాంగ్రెస్ పార్టీనే ప్రధాన కారణమని వ్యాఖ్యానించారు.
లోక్‌సభలో చేసిన ప్రధాని సుదీర్ఘ ప్రసంగంలో.. మణిపూర్ విషయానికి కేటాయించిన సమయం కేవలం 9 నిమిషాలు మాత్రమే. అందులోనూ నాలుగు నిమిషాలే తమ సర్కారు ఏం చేస్తోందో చెప్పుకొచ్చారు. మిగిలిన సమయాన్ని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించేందుకు మాత్రమే కేటాయించారు. "మణిపుర్‌లో పరిస్థితులపై సంపూర్ణ చర్చ జరగాలనే ఆలోచన విపక్షాలకు లేదు, ఆ ఘటనలు పునరావృతం కాకుండా అందరం కలిసి ఓ నిర్ణయానికి రావాలనే ఆలోచన విపక్షాలకు లేదు" అని కాంగ్రెస్‌పైనే ఎదురు దాడి చేశారు.
మణిపూర్ ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత అందరిపైనా లేదా? అని మోడీ నిలదీశారు. అయితే.. విపక్షాలకు మణిపుర్ ప్రజలపై ప్రేమకన్నా.. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉందన్నారు. మణిపుర్‌లో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రజల మధ్య పరస్పర విశ్వాసం నశించిందని మోడీ అన్నారు. మహిళలకు ఘోర అవమానం జరిగిందన్న ఆయన.. ఈ ఘటన అందరికీ తలవంపు లేనని చెప్పారు.
"మణిపుర్‌లో శాంతి నెలకొంటుందని, సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని సంపూర్ణ విశ్వాసంతో సభకు హామీ ఇస్తున్నా. ఆ రాష్ట్ర ప్రజలకు ఈ సభ, దేశం సంపూర్ణంగా అండగా నిలుస్తుంది. స్పర్థలను వీడి మణిపుర్ తిరిగి అభివృద్ధి బాట పడుతుందన్న విశ్వాసాన్ని సభకు ఇస్తున్నా" అని మోడీ వ్యాఖ్యానిం చారు.
రాహుల్‌కు పరోక్ష చురకలు..
అధికారం లేకుండా విపక్షాలు జీవించలేవని మోడీ అన్నారు. భారతమాత మరణం గురించి(బుధవారం రాహుల్ మాట్లాడుతూ.. మణిపూర్‌లో భారత మాత చనిపోయిందన్నారు) మాట్లాడటమంటే.. దేశ వినాశనాన్ని కోరుకున్నట్లేనని చెప్పారు. "ఒకసారి భారతమాత హత్య అంటారు. మరోసారి రాజ్యాంగం హత్య అంటారు. ఇదేం భాష. ఇది వాళ్లకు ఇవాళ కొత్తగా వచ్చిన సంస్కారం కాదు. వందేమాతరాన్ని ముక్కలుముక్కలుగా చేసిన నాడే వీళ్ల ఉద్దేశాలు బయటపడ్డాయి. ఓట్ల రాజకీయాల కోసం దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో విభజన చేశారు. కాంగ్రెస్ చరిత్ర అంతా భారతమాతను ఛిన్నాభిన్నం చేయడంలోనే మునిగిపోయింది" అని మోడీ నిప్పులు చెరిగారు.