భవనం మారింది.. 'భావన' మారుతుందా మోడీ సర్!!
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారు పిలుపు నిచ్చిన తర్వాత..అందరూ అనుకున్నట్టుగానే ఈ 'మార్పు' చోటు చేసుకుంది.
By: Tupaki Desk | 20 Sep 2023 2:30 AM GMTపార్లమెంటు పాత భవనం మారింది. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభించిన దాదాపు రెండు మాసాల తర్వాత.. ఇక్కడ ఉభయ సభలు మంగళవారం నుంచి కొలువు దీరాయి. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సర్కారు పిలుపు నిచ్చిన తర్వాత..అందరూ అనుకున్నట్టుగానే ఈ 'మార్పు' చోటు చేసుకుంది. ఇక, పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు పలుకుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇందిరా గాంధీ పేరు ఎత్తకుండా.. ఇతర ప్రధానుల పేర్లు చెబుతూ.. ఎంతో మంది ఈ పార్లమెంటు నుంచి ఎన్నో వేల చట్టాలు చేశారని అన్నారు.
దాదాపు 48 నిమిషాల పాటు పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్‌లో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రధాని మోడీ సుదీర్ఘ ప్రసంగం చేశారు. ఇక, ఆ తర్వాత..పాత పార్లమెంటు భవనం నుంచి పాదయాత్రగా ఎంపీలతో కలిసి.. ఆయన కొత్త పార్లమెంటు భవనంలోకి అడుగు పెట్టారు. అక్కడ కూడా ఇదే తరహాలో 40 నిమిషాలకు పైగానే సుదీర్ఘంగా ప్రసంగించారు. పాత, కొత్త భవితవ్యాలను ఉటంకించారు. జీ-20 సదస్సుల విజయం సహా భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని, ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా అంకురిస్తోందని చెప్పుకొచ్చారు.
ఇక, పనిలో పనిగా..పార్లమెంటు వ్యవహారాలను కూడా ప్రధాని ఉటంకించారు. పార్లమెంటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ''ఇప్పటి వరకు పార్లమెంటు సభలు ఎలా జరుగుతున్నాయో.. యావత్ భారత్ వీక్షించింది. ఈ సభల్లో మరిన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. సభ్యులపై గురుతర బాధ్యత మరింత పెరుగుతుంది. ప్రజల సమస్యల పరిష్కారానికి.. ఈ వేదిక సమున్నతంగా వినియోగించుకోవాలి. వినియోగపడాలి!'' అని కూడా మోడీ పిలుపునిచ్చారు. అయితే.. మోడీ చేసిన ఈ వ్యాఖ్యల తర్వాత.. దేశవ్యాప్తంగా ఆయన వ్యవహార శైలిపై ఆసక్తికర చర్చ తెరమీదకి వచ్చింది.
భవనం మారింది సరే.. భావన మారుతుందా? అని పార్లమెంటు గురించి.. సీనియర్లు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకంటే.. సహజ రాజకీయాలు పార్లమెంటును కుదిపేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తమకు నచ్చిన వారికి ఒకరకంగా.. నచ్చనివారిని మరో రకంగా పార్లమెంటులోనే ట్రీట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రజాస్వామ్యానికి పార్లమెంటు పట్టుగొమ్మగా మారాలని అభిలషిస్తున్న ప్రధాని.. ప్రతిపక్షాలకు మాట్లాడే సమయమే ఇవ్వడం లేదన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. ఇక, ప్రతిపక్షాలు లేవనెత్తుతున్న అంశాలకు ఆయన ఇప్పటికీ.. అనేకం(ఉదాహరణకు గౌతం అదానీ-హిండెన్ బర్గ్ అంశం, మణిపూర్ అల్లర్లు, బీబీసీ గుజరాత్ డాక్యుమెంటరీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం, కరోనా మృతులు .. ఇలా చాలా అంశాలు) ఉన్నాయి.
దీంతో భవనం మార్చిన ప్రధాన మంత్రి తన భావనను కూడా మార్చుకోవాలనేది సీనియర్లు, పరిశీలకుల మాట. నిజమైన ప్రజాస్వామ్యం అంటే.. ప్రతిపక్షాలకు కూడా(వీరిని కూడా ప్రజలే ఎన్నుకున్నారు) పార్లమెంటులో సమ భాగస్వామ్యం ఇవ్వాలనేది వారి ఉద్దేశం. కానీ, ఇప్పుడు ఇదే అసలు సమస్యగా మారిపోయింది.పార్లమెంటులో ప్రతిపక్షాలకు సరైన సమయం ఇవ్వడం లేదని, తమపై విమర్శలు చేసిన వారిని అడ్డగోలుగా సస్పెండ్ చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. మరి భవనం మార్చిన ప్రధాని ఈ భావనను కూడా మార్చినప్పుడే.. నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అంటున్నారు.