Begin typing your search above and press return to search.

అవిశ్వాసం పాజిటివ్ సెంటిమెంట్...2024లో రికార్డులు బద్ధలు

విపక్షాలలో పార్టీలు అన్నీ అవినీతిలో కూరుకుపోయాయని, అయితే అవన్నీ కొత్తగా జట్టు కట్టి ముందుకు రావడం విశేషం అంటూ మోడీ ఎద్దేవా చేశారు.

By:  Tupaki Desk   |   10 Aug 2023 12:55 PM GMT
అవిశ్వాసం పాజిటివ్ సెంటిమెంట్...2024లో రికార్డులు బద్ధలు
X

రాజకీయాల్లో సెంటిమెంట్లు చాలా ఎక్కువ. ఒకసారి కనుక ప్రతికూల ఫలితం వస్తే ఆ వైపుగా చూడరు. యాంటీ సెంటిమెంట్ గా భావించి అంతటితో స్వస్తి పలుకుతారు. అదే సెంటిమెంట్ పాజిటివ్ గా వర్కౌట్ అయితే మాత్రం అసలు వదలరు. అయితే ఇందులో కొన్ని కోరి తెచ్చుకున్నవి ఉంటే కొన్ని ఎదురుచూసేవి ఉంటాయి. ఆ విధంగా బీజేపీకి అవిశ్వాస తీర్మానం పాజిటివ్ సెంటిమెంట్ గా మారింది అని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నారు.

మోడీ పార్లమెంట్ లో విపక్షాల అవిశ్వాస తీర్మానం మీద జవాబు ఇస్తూ తమకు ఇది ఎంతో మేలు చేసే విషయం అన్నారు. అవిశ్వాస తీర్మానంతో బీజేపీ విజయానికి ఉన్న బంధాన్ని ఆయన అందంగా లోక్ సభలో ఆవిష్కరించారు; సరిగ్గా అయిదేళ్ల క్రితం 2018 లో ఇలాగే అవిశ్వాసాన్ని విపక్షాలు ప్రవేశపెట్టాయి.

అప్పట్లో మోడీ ప్రభుత్వం గెలిచింది. ఆ తరువాత 2019 ఎన్నికల్లోనూ గెలిచింది. 2023లో అవిశ్వాస తీర్మానం విపక్షాలు మళ్ళీ పెట్టాయి. ఇంకేముంది 2024లో కూడా బీజేపీ గెలిచి తీరుతుందని మోడీ పూర్తి ధీమాను వ్యక్తం చేశారు.

మావి సెంచరీలు, మీవి నో బాల్స్ అంటూ విపక్షాల మీద ఆయన సెటైర్లు పేల్చారు. ప్రజలకు మంచి చేసే బిల్లులు విపక్షాలకు అసలు నచ్చవని, అసలు గడచిన అయిదేళ్ళుగా విపక్షం స్కోర్ ఏంటి ప్రజల మద్దతు ఎంత వరకూ సంపాదించారు అని మోడీ గట్టిగానే నిలదీశారు.

విపక్షాలలో పార్టీలు అన్నీ అవినీతిలో కూరుకుపోయాయని, అయితే అవన్నీ కొత్తగా జట్టు కట్టి ముందుకు రావడం విశేషం అంటూ మోడీ ఎద్దేవా చేశారు. దేశానికి బీజేపీ ఏమి చేసిందని విపక్షాలు అంటున్నాయని కానీ బీజేపీ కుంభకోణాలు లేని భారతాన్ని దేశానికి అందించిందని ఆయన గట్టిగా చెప్పుకున్నారు.

బీజేపీకి ప్రజల విశ్వాసం బలంగా ఉందని, అందుకే నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా నో బాల్ గా విపక్షాలకు మిగిలిపోయిందని ప్రధాని విమర్శించారు. బీజేపీకి మేలు చేయాలని లేకపోయినా దేవుడు విపక్ష కూటమికి అవిశ్వాసం పెట్టమని చెప్పి ఉంటాడని అందుకే తమ ప్రభుత్వం మీద అవిశ్వాసం అంటూ విపక్షాలు పెట్టాయని అలా తమకు ఎనలేని మేలు చేశాయని మోడీ పంచులేశారు.

విపక్షాల కూటమికి ఎంత మంది సభ్యులు ఉన్నారో తెలియదు కానీ అంతా సభకు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. మళ్లీ మేమే పాత రికార్డులు కూడా బద్ధలు అవుతాయని మోడీ బల్ల గుద్దారు. మొత్తానికి అవిశ్వాసాన్ని చాలా లైట్ గా బీజేపీ తీసుకుంది. అదే టైం లో సెంటిమెంట్ గా తీసుకుంది. విపక్షాల మీద మోడీ విసుర్లు, విమర్శలతో పై చేయి సాధించారు.

బీజేపీ విషయానికి వస్తే 1998లో వాజ్ పేయ్ మీద విపక్షాలు పెట్టిన అవిశ్వాసం తరువాత 1999లో బీజేపీ గెలిచింది. అలాగే 2018లో అవిశ్వాసం తరువత మోడీ రెండవ సారి ప్రధాని అయ్యారు. ఇపుడు మళ్ళీ అవిశ్వాసం పెట్టారు. 2024లో గెలవడం ఖాయమే అంటున్నారు. చూడాలి మరి.