చిక్కుల నుంచి హక్కుల దాకా.. 'ప్రత్యేక హోదా'!!
ఒకప్పుడు ప్రత్యేక హోదా అంటే.. పెద్ద చిక్కు. ఇతర రాష్ట్రాలు ఏమంటాయో.. అనే బెంగ. కేంద్రం ఇస్తుందా? అనే సందేహాలు
By: Tupaki Desk | 3 July 2024 10:30 AM GMTఒకప్పుడు ప్రత్యేక హోదా అంటే.. పెద్ద చిక్కు. ఇతర రాష్ట్రాలు ఏమంటాయో.. అనే బెంగ. కేంద్రం ఇస్తుందా? అనే సందేహాలు.. వెరసి.. బిహార్ సహా.. ప్రత్యేక హోదా కోరుతున్న పశ్చిమబెంగాల్, ఏపీ, ఒడిసా వం టి రాష్ట్రాలు తల్లడిల్లాయి. అయితే.. ఇప్పుడు మాత్రం చిక్కుల్లేవా? అంటే.. ఉన్నాయి. కానీ, కేంద్రంలో బలమైన ప్రభుత్వం ఏర్పడకపోవడంతో పాటు.. ప్రత్యేక హోదా కోసం సుదీర్ఘంగా నిరీక్షిస్తున్న పార్టీలే మోడీ సర్కారును నిలబెట్టడంతో ఇప్పుడు ఆయా రాష్ట్రాలకు హక్కుగా పరిణమించింది.
ఈ ప్రభావమే.. బిహార్‌లో కనిపిస్తోంది. తాము కేంద్రంలోని మోడీ సర్కారుకు మద్దతిస్తున్నామన్న ధీమాతో నే అక్కడి జనతాదళ్ యునైటెడ్ పార్టీ అధినేత, సీఎం నితీష్ కుమార్.. ప్రత్యేక హోదాపై ఏకంగా అసెం బ్లీలోనే తీర్మానం చేశారు. వాస్తవానికి ఈ విషయంపై కూటమి పార్టీల నాయకుడిగా ఆయన ప్రధానితో ముందుగా మాట్లాడి ఉండాల్సింది. కానీ, అలా చేయలేదు. తనంతట తనే అసెంబ్లీలో బిల్లు పెట్టి తీర్మానం చేయించుకున్నారు.
అంటే.. ఒకప్పుడు జార్ఖండ్ వద్దందని, మహారాష్ట్ర కాదందని చిక్కులు ఎదుర్కొన్న నితీష్ కుమార్.. ఇప్పుడు కేంద్రంలో పరిస్థితి మారడంతో ప్రత్యేక హోదాను హక్కుగా భావిస్తున్నారు. ఇక, పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌కు ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ ఉంది. ఎందుకంటే.. ఇక్కడివారు ప్రత్యేక రాష్ట్రమే కోరుతున్నారు. దీంతో ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రత్యేక హోదా కల్పించడంద్వారా.. సమస్యను పరిష్కరించాలని చూస్తున్నారు. దీంతో ఈ చిక్కులు ఇతర రాష్ట్రాలకు కూడా ముసురుకున్నాయి. అయినా.. ఇప్పు డు కూటమి పార్టీలు హక్కుగా భావిస్తున్నారు.
మోడీ ఇస్తారా?
ఏపీ సహా.. బిహార్ రాష్ట్రాలు కేంద్రంలో కూటమి సర్కారులో భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.దీంతో ఏపీ, బిహార్‌లకు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రయత్నాలు చేయొచ్చు. కానీ, ఇదే సమయంలో మోడీకి ప్రధాన చిక్కు.. ఒడిశా. ఇక్కడ కూడా సుదీర్ఘ కాలంగా ప్రజలు హోదా కోసం.. ఉద్యమిస్తున్నారు. నవీన్ పట్నాయక్ సర్కారు.. గత ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చింది. అయినా.. తీసుకురాలేక పోయింది. ఇక, ఇప్పుడు.. రాష్ట్రంలో బీజేపీనే అధికారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు ఇవ్వకుండా.. మిగిలిన రాష్ట్రా లకు ఇవ్వడం మోడీకి సాధ్యమయ్యే పనికాదు. సో.. ఒకప్పటి చిక్కుల నుంచి హక్కుల వరకు వచ్చినా.. సాధించడం అంత ఈజీ అయితే.. కాదనే అభిప్రాయం వ్యక్తమవుతుండడం గమనార్హం.