Begin typing your search above and press return to search.

ఊపిరి పోస్తున్న ఉదయనిధి... తగులుకోండి అని మంత్రులకు ఆదేశాలు

నరేంద్ర మోడీ తన క్యాబినేట్ మీటింగులో ఉదయనిధిని తగులుకోండి అని మంత్రులకు ఆదేశాలు ఇవ్వడం అంటే కచ్చితంగా దేశమంతా యాంటీ హిందూత్వ కూటమి ఇండియా కూటమి అని చాటి చెప్పడమే.

By:  Tupaki Desk   |   7 Sep 2023 5:23 PM GMT
ఊపిరి పోస్తున్న ఉదయనిధి... తగులుకోండి అని మంత్రులకు ఆదేశాలు
X

ఉదయనిధి స్టాలిన్ సినిమాల నుంచి రాజకీయాల వైపు మళ్లారు. తండ్రి మంత్రివర్గంలో చాలా సులువుగా పదవిని అందుకున్నారు. ఒక విధంగా ఏడు పదుల వయసులో ఉన్న స్టాలిన్ కంటే చురుకైన నేతగా పార్టీలో ప్రభుత్వంలో మారిపోయారు. ఆయన దూకుడుతో సీనియర్లు ఇబ్బంది పడుతున్నా కిమ్మనని పరిస్థితి ఉంది.

ఉదయనిధి స్టాలిన్ ఇపుడు ఒక విషయంలో తాత కరుణానిధి వైపుగా మళ్లారు. ద్రవిడవాదం నాస్తికవాదం వైపుగా ఆయన అడుగులు వేశారు. 1940 దశకం నుంచి ద్రవిడవాదం తో తమిళనాడు ఊగింది అలా పుట్టుకొచ్చిన నాయకుడే కరుణానిధి. ఇక కరుణానిధి నీడలో ఎదిగిన వారు స్టాలిన్.

అయితే అధికారం రుచి మరిగిన తరువాతా డీఎంకే అయినా అన్నాడీఎంకే అయినా చాలా దూరం వచ్చేశాయి. బీజేపీతో పొత్తులు కూడా పెట్టుకునే దాకా వెళ్లాయి. ఒక విధంగా పునాదులు మరచిన వైనం ఇది. 2021లో అయితే అన్నా డీఎంకే పట్ల వ్యతిరేకతతో డీఎంకే అధికారంలోకి వచ్చింది. ఈసారి అలా కాదు అని నమ్ముతోంది. అందుకే ఏదో పిడివాదం ఉండాలి.

అందుకే తన పాత మూలాలను తవ్వి తీస్తోంది. ఆ డోస్ కాస్తా ఎక్కువ చేశారు ఉదయనిధి స్టాలిన్. ద్రవిడవాదం అంటే పడిచచ్చే జనాభా ఇంకా ఉన్నారు. అలాగే హిందూత్వ తన పేటెంట్ హక్కు అంటున్న బీజేపీకి యాంటీ జనాలూ ఎపుడూ ఉంటారు. ఇలా రెండిందాల లాభం అనే సనాతన ధర్మం మీద నోరు పారేసుకున్నారు ఉదయనిధి స్టాలిన్.

అయితే ఆయన ఆలోచనలు తమిళ రాజకీయాలకు పరిమితం అయినా దాని ప్రతిద్వనులు దేశమంతటా వినిపిస్తున్నాయి. అలా ఇంకా గట్టిగా వినిపించేలా చేసేందుకు బీజేపీ కూడా తయారుగా ఉంది. ఇక ఉదయనిధి స్టాలిన్ తన మాటలకు కట్టుబడి ఉంటాను అని చెప్పడం కూడా కమలదళానికి ప్లస్ పాయింట్ అయ్యేలా ఉంది ఇపుడు. ఎందుకంటే ఉదయనిధి చేసిన కామెంట్స్ చాలా ప్రమాదంగా మారుతున్నాయి.

దేశంలోని హిందూత్వ మూలాలనే ప్రశ్నించేలా ఉన్నాయి. దాంతో భావోద్వేగాలకు అవి కారణభూతం అవుతాయి. అలా ఉదయనిధి బీజేపీకి ఊపిరి పోశారని అంటున్నారు. ఇపుడిపుడే బీజేపీని వ్యతిరేకంగా ఒక్క మాట మీద నిలబడి ఇండియా కూటమి నేతలు బస్తీ మే సవాల్ అంటున్నారు.

అలాంటి ఇండియా కూటమి నడ్డి విరిచేలా ఉదయనిధి కామెంట్స్ ఉన్నాయి. ఇక మొదట్లో స్టాలిన్ కొడుకుని సమర్ధించినా లేటెస్ట్ గా తన కుమారుడి కామెంట్స్ ని వక్రీకరించారు అని అంటున్నారు. అందులో అర్ధాలు పరమార్థాలు వేరు అని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఎవరు చేసినా కూడా జరగాల్సిన నష్టం జరిగిపోతోంది.

ఒకవేళ ఉదయనిధి తగ్గాలనుకున్నా బీజేపీ ఊరుకునేలా లేదు అంటున్నారు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ తన క్యాబినేట్ మీటింగులో ఉదయనిధిని తగులుకోండి అని మంత్రులకు ఆదేశాలు ఇవ్వడం అంటే కచ్చితంగా దేశమంతా యాంటీ హిందూత్వ కూటమి ఇండియా కూటమి అని చాటి చెప్పడమే.

ఇపుడు డీఎంకేతో అంటకాగితే తప్పు అన్నట్లుగా బీజేపీ ప్రచారం ముదిరినా ఆశ్చర్యం లేదు. మొత్తానికి చూస్తే ఉదయనిధి వేళ కాని వేళలో చేసిన నోరు జోరు ఆపద కాలంలో బీజేపీని ఆదుకుంటోంది అని అంటున్నారు. అదే టైం లో బీజేపీకి బెస్ట్ ఫ్రెండ్ గా కూడా ఉదయనిధి మారిపోయారు అని ఇండియా కూటమి నేతలు అంతా గొణుక్కుని సణుక్కుంటున్నారు. అయినా చేసేది ఏమైనా ఉందా అన్నదే ఇపుడు అతి పెద్ద ప్రశ్నగా ఉంది మరి.