ఎన్నాళ్లకెన్నాళ్లకు ఒకే వేదికపై మోదీ, పవన్, బాబు!
అందులోనూ ఈ సభకు మూడు పార్టీల అగ్ర నేతలు.. ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరవుతుండటంతో ఈ సభను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
By: Tupaki Desk | 12 March 2024 7:40 AM GMTఆంధ్రప్రదేశ్ లో ఎట్టకేలకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల మధ్య పొత్తు పొడిచిన సంగతి తెలిసిందే. అలాగే ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలనేది కూడా తేలిపోయింది. టీడీపీ 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు స్థానాల్లో, జనసేన 21 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాల్లో, బీజేపీ 10 అసెంబ్లీ, 6 పార్లమెంటు స్థానాల్లోనూ పోటీ చేయనున్నాయి. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి, ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండాల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి.
పొత్తు, సీట్ల పంపకం జరిగిపోవడంతో ఇక మూడు పార్టీలు సమరోత్సాహంతో ప్రచారం నిర్వహించనున్నాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీలు కలిసి మార్చి 17న చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నాయి. అందులోనూ ఈ సభకు మూడు పార్టీల అగ్ర నేతలు.. ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హాజరవుతుండటంతో ఈ సభను మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
2014లో ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయాక బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోటీ చేశాయి. జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. ఆ సమయంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా, బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ ఉన్నారు. ఆయనతోపాటు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఒకే వేదికపై పలు బహిరంగ సభలను నిర్వహించారు.
మళ్లీ పదేళ్ల తర్వాత మూడు పార్టీల అగ్ర నేతలు ఒకే వేదికపై కూర్చోనున్నారు. దీంతో చిలకలూరిపేట సభపైనే అందరి కళ్లూ నెలకొని ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన ఇలా మూడు పార్టీల అగ్ర నేతలు చిలకలూరిపేట సభకు హాజరవుతుండటంతో అన్ని పార్టీలు ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా భారీ ఎత్తున జనసమీకరణపై దృష్టి సారించాయి. కనీసం 5–6 లక్షల మంది ప్రజలను తరలించాలని ప్రణాళికలు రచించాయి.
మూడు పార్టీల్లో పెద్ద పార్టీ టీడీపీనే కావడంతో ప్రధాన బాధ్యతను ఆ పార్టీనే తీసుకుంది. స్వయంగా చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలను మించిపోయే రీతిలో జనసమీకరణపై దృష్టి సారించారు.
జనసమీకరణపై దృష్టిసారించిన టీడీపీని ఆర్టీసీ కరుణించింది. మూడు పార్టీల సభకు ఆర్టీసీ బస్సుల్ని అద్దెకు ఇస్తామని ప్రకటించింది. ఇటీవల టీడీపీ, జనసేన నిర్వహించిన తాడేపల్లిగూడెం సభకు ఆర్టీసీ బస్సుల్ని ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు రేగాయి. వైసీపీ సభలకు వేలల్లో బస్సులను ఇస్తూ తాము అద్దె చెల్లిస్తామని చెబుతున్నా తమకు బస్సులు ఇవ్వకపోవడం వివక్ష కిందకే వస్తుందని టీడీపీ నేతలు విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రభావమో లేక మరేదైనా కారణమో కానీ ఆర్టీసీ అధికారులు దిగొచ్చారు. బస్సులు ఇవ్వడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు.
దీంతో టీడీపీ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది. సభను జయప్రదం చేసేందుకు మూడు పార్టీలకు చెందిన అన్ని ప్రాంతాల నేతలతో 13 సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు.
సభ ఏర్పాట్లలో ప్రధానమైన సమన్వయ కమిటీలో అచ్చెన్నాయుడు, లోకేశ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, జీవీ ఆంజనేయులు, జనసేన ప్రతినిధులు గాదె వెంకటేశ్వరరావు, షేక్ రియాజ్, చిల్లపల్లి శ్రీనివాస్, బీజేపీ ప్రతినిధులు పాతూరి నాగభూషణం, సన్నారెడ్డి దయాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
వేదిక నిర్వహణ కమిటీ బాధ్యతలను కనకమేడల రవీంద్రకుమార్, కె.రామ్మోహన్ నాయుడు, పయ్యావుల కేశవ్, జనసేనకు చెందిన మల్లినీడి తిరుమలరావు, రామకృష్ణకు ఇచ్చారు. సభా ప్రాంగణ కమిటీలో ఆలపాటి రాజేంద్రప్రసాద్, నక్కా ఆనంద్‌బాబు, దేవినేని ఉమామహేశ్వరరావు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పెందుర్తి వెంకటేశ్, పెరబత్తుల రాజశేఖర్, జనసేన నేతలు అమ్మిశెట్టి వాసు, నేరెళ్ల సురేశ్, పెండ్యాల బాలాజీ, బీజేపీ నుంచి బిట్రా వెంకట శివనారాయణ ఉన్నారు.
ఆహార, తాగునీటి కమిటీ బాధ్యతల్ని ప్రత్తిపాటి పుల్లారావు, మద్దులూరి మాల కొండయ్య, ఇంటూరి నాగేశ్వరరావు, యరపతినేని శ్రీనివాసరావు, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వెనిగండ్ల రాము, కొలికపూడి శ్రీనివాస్, మేడిశెట్టి సూర్యకిరణ్, జనసేన నుంచి మోకా నానికి ఇచ్చారు.