మోడీ ఎన్నికల డ్రామా మొదలైంది... ఓదార్పు మాటలే...!
కాదేదీ హామీలకనర్హం! అన్నట్టుగా ఎన్నికల వేళ నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం కీలకమై న ఎస్సీ వర్గీకరణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా.. ఇలాంటి హామీనే ఇచ్చారని పరిశీలకులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 13 Nov 2023 1:30 AM GMTకాదేదీ హామీలకనర్హం! అన్నట్టుగా ఎన్నికల వేళ నాయకులు హామీలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం కీలకమై న ఎస్సీ వర్గీకరణపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా.. ఇలాంటి హామీనే ఇచ్చారని పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్‌లో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ.. వారికి బలమైన హామీలు ఇచ్చారు. అంతేకాదు.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగను పదే పదే ఓదార్చారు.
ఇక, మోడీ ఇచ్చిన హామీల్లో కీలకమైనవి.. 1) ఎస్సీ రిజర్వేషన్ అంశం న్యాయస్థానాల్లో ఉన్న నేపథ్యంలో వారికి న్యాయం జరిగేలా చూస్తానని చెప్పడం. 2) ఎస్సీ వర్గీకరణకు తమ మద్దతు సంపూర్ణంగా ఉంటుంద ని వెల్లడించడం. 3) ఎస్సీ వర్గీకరణపై అధ్యయనం చేసేందుకు కమిటీ వేస్తానని హామీ ఇవ్వడం. ఈ మూడు హామీలను ప్రధాని పదే పదే చెప్పుకొచ్చారు. అయితే.. ఇవి సాధ్యమేనా? అన్నది ఇప్పుడు ప్రశ్న. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
2014లో ప్రధాని అభ్యర్థిగా మోడీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇదే మంద కృష్ణ.. ఆయనను కలిసి.. ఇదే డిమాండ్‌ను విన్నవించారు. అప్పట్లోనూ చూస్తామని హామీ ఇచ్చారు. కానీ, పదేళ్లు గిర్రున తిరిగిపోయాయి. ఇప్పటివరకు దీనిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇక, ఇప్పుడు కీలకమైన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు, మరో వైపు 100 రోజుల్లో రానున్న సార్వత్రిక సమరాన్ని దృష్టిలో పెట్టుకునే ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపారనే విమర్శలు వస్తున్నాయి.
ఇక, మోడీ చెబుతున్నట్టు.. ఎస్సీ వర్గీకరణకు ఆయన మద్దతు ఇచ్చినా.. దేశవ్యాప్తంగా చూసుకుంటే.. వర్గీకరణకు మెజారిటీ కులాలు.. అంగీకరించడం లేదు. తద్వారా తమ రిజర్వేషన్ హక్కులు పోతాయనే భయం వారిలో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే మాల సామాజిక వర్గం రిజర్వేషన్ వర్గీకరణకు ససేమిరా అంటోంది. అంటే.. ఇది ఒకరకంగా.. పులి నోట్లో తల పెట్టినట్టే అవుతుంది. కాబట్టి.. మోడీ ఇంత సాహసోపేత నిర్ణయంతీసుకునే అవకాశంలేదని.. ప్రస్తుతం జరిగింది కేవలం .. ఎన్నికల ఓదార్పేనని పరిశీలకులు చెబుతున్నారు.