మోడీ అంతే: 2029 ఎన్నికల కోసం కాదు 2047 ఎన్నికలకు రెఢీ అవుతున్నా!
అత్యున్నత స్థానాలకు ఎదిగిన వారి ఆలోచనలు మొత్తం వర్తమానం మీద అస్సలు ఉండవు.
By: Tupaki Desk | 17 March 2024 1:23 PM GMTఅత్యున్నత స్థానాలకు ఎదిగిన వారి ఆలోచనలు మొత్తం వర్తమానం మీద అస్సలు ఉండవు. వారంతా భవిష్యత్తులో ఏం జరగాలన్న దాని గురించే ఆలోచిస్తుంటారు. కనీసం పదేళ్ల నుంచి ఇరవై ఏళ్ల తర్వాత ఏం చేయాలన్న అంశాన్ని ఇప్పటి నుంచే ఆలోచించే తీరు కనిపిస్తూ ఉంటుంది. తాజాగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పిన మాటల్ని వింటే ఇదంతా ఎంత నిజమన్న విషయం అర్థమవుతుంది. తాజాగా ఆయన ఇండియా టుడే నిర్వహించిన సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలకు అక్కడున్న వారంతా అవాక్కు అయిన పరిస్థితి.
ఓపక్క సార్వత్రిక ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు తమ అస్త్రశస్త్రాలను బయటకు తీస్తూ.. ఎన్నికల్లో విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తుంటే.. మోడీ మాత్రం తమ గెలుపు మీద ధీమాను వ్యక్తం చేయటమే కాదు.. తాము 2029 ఎన్నికల కోసం పని చేయటం లేదని.. 2047 ఎన్నికల గురించి ఆలోచిస్తున్నట్లుగా చెప్పి అందరిని విస్మయానికి గురి చేశారు. అసలేం జరిగిందంటే.. ఇండియా టుడే ఎడిటర్ ఇన్ చీఫ్ అరుణ్ పురీ ప్రారంభోపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మోడీ ప్రస్తావన తెస్తూ.. 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం మోడీ సిద్ధమవుతున్నట్లుగా చెప్పారు. ఆయన మాట్లాడిన తర్వాత మోడీ ప్రసంగించటం మొదలు పెట్టారు. ‘‘మీరు 2029లోనే ఆగిపోయారు. నేను మాత్రం 2047 కోసం ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించా. మోడీ ఏం చేయబోతున్నారో తెలుసుకోవటానికి మీ టీం మొత్తాన్ని రంగంలోకి దించండి. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారాన్ని నిలబెట్టుకుంటాం. మీడియాలో ప్రచారం కోసం.. పత్రికల్లో హెడ్ లైన్ల కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు. హెడ్ లైన్ల కోసం కాదు. డెడ్ లైన్ల కోసం పని చేస్తున్నాం’’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మరిన్ని ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. తాము అవినీతిపై కఠినంగా వ్యవహరిస్తున్నామని.. ఈ విషయంలో దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు. తాము అవినీతిపై ఉక్కుపాదం మోపటంతో కొందరు కడుపు మంటతో రగిలిపోతున్నట్లుగా పేర్కొన్నారు. కొందరు వ్యక్తులు తమ ఇష్టానుసారం దూషిస్తున్నారని.. వారిని ప్రజలు ఏ మాత్రం విశ్వసించటం లేదన్నారు. తమ పదేళ్ల పదవీ కాలంలో పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాల్ని అమలు చేశామని.. వాటికి మీడియాలో గుర్తింపు రాలేదంటూ ఫిర్యాదు చేయటం గమనార్హం.
ప్రపంచ వ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నా.. భారత్ మాత్రం మరింత వేగంగా వ్రద్ధిబాట పడుతున్నట్లుగా పేర్కొన్నారు. తమకు దేశమే ప్రథమం అన్న నినాదంతో ముందుకు వెళుతుంటే.. కొందరు మాత్రం కుటుంబమే ప్రథమం అంటూ వ్యవహరిస్తున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. వచ్చే ఐదేళ్ల కాలంలో స్థిరమైన.. సమర్థవంతమైన.. బలమైన ఇండియా అనేది తాము ప్రపంచానికి ఇచ్చే గ్యారెంటీగా పేర్కొన్న మోడీ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. మోడీ ముందు చూపు అంచనాలకు అందని రీతిలో ఉందనటానికి తాజా ఆయన వ్యాఖ్యలే నిదర్శనంగా పేర్కొంటున్నారు.