Begin typing your search above and press return to search.

కేటీయార్ ని సీఎం చేయమన్నారు...కేసీయార్ గుట్టు బయటపెట్టిన మోడీ!

ప్రజా సేవలో నేను అలసిపోయాను, నా కుమారుడు కేటీయార్ సీఎం గా మీరు ఆశీర్చదించాలని కేసీయార్ నన్ను కోరారని మోడీ జనాలకు చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   3 Oct 2023 1:19 PM GMT
కేటీయార్ ని సీఎం చేయమన్నారు...కేసీయార్ గుట్టు బయటపెట్టిన మోడీ!
X

ఈ రోజు నేను నిజం చెప్పడానికే వచ్చాను అంటూ నిజమాబాద్ సభలో ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగం ఆరంభించారు. ఆ మీదట ఆయన నోటి వెంట సంచలనాలు అలా దొర్లుకుంటూ వచ్చాయి. కేసీయార్ దాదాపు రెండేళ్ళ క్రితం జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల తరువాత నా దగ్గరకు వచ్చారు. ఎన్డీయేలో చేరుతానని నన్ను ప్రాధేయపడ్డారు.

ప్రజా సేవలో నేను అలసిపోయాను, నా కుమారుడు కేటీయార్ సీఎం గా మీరు ఆశీర్చదించాలని కేసీయార్ నన్ను కోరారని మోడీ జనాలకు చెప్పుకొచ్చారు. అయితే నేను దానికి ఒప్పుకోలేదు. ఇది రాజ్యం రాజరికం కాదు, యువరాజు గా ఎవరూ ఉండరని చెప్పానని ఆయన అన్నారు. ప్రజల ఆశీర్వాదం తీసుకున్న వారే ముఖ్యమంత్రి అవుతారని చెప్పాను అని ఆయన నిండు సభలో నగ్న సత్యాన్ని ఆవిష్కరించారు.

నాటి నుంచే కేసీయార్ తన కళ్ళలో చూసేందుకే ధైర్యం చేయలేక తనకు స్వాగతం పలకడంలేదని అన్నారు. గతంలో కేసీయార్ పెద్ద పూల మాలలు తీసుకుని వచ్చేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. నేను కేసీయార్ చేసిన అవినీతి భాగోతాన్ని ఆయనకే చెప్పానని కూడా మోదీ చెప్పారు.

ఆనాటి నుంచి నాకు దూరంగా ఉన్న కేసీయార్ కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు డబ్బులు కూడా అందించి సాయపడ్డారని మోడీ విమర్శించారు. అవినీతి బంధుప్రీతి కలిగిన బీయారెస్ ని అందుకే ఎన్డీయేలోకి చేర్చుకోలేదని అన్నారు. బీయారెస్ మీదనే బీజేపీ పోరాటం అని ఆయన స్పష్టం చేశారు.

గుజరాతీ అయిన పటేల్ తెలంగాణాకు విముక్తి కలిగిస్తే మరో గుజరాతీ అయిన తన హయాంలోనే తెలంగాణా అభివృద్ధి జరుగుతోందని మోడీ చెప్పారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజాస్వామ్యాన్ని లూటీస్వామ్యంగా చేశారని ఆయన విమర్శించారు.

భారతదేశం లాంటి దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రాముఖ్యత ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణాను పూర్తిగా కుటుంబ స్వామ్యంగా మార్చేశారని కేసీయార్ మీద మండిపడ్డారు. కుటుంబ పాలన వల్ల పూర్తిగా తెలంగాణా యువత నష్టపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్రం వల్ల కేసీయార్, ఆయన కొడుకు, కూతురు, అల్లుడు లబ్ది పొందుతున్నారని సామాన్యులకు ఫలితాలు అందడం లేదని మోడీ అన్నారు.

తెలంగాణాలో బీజేపీ ప్రభుత్వం ఎన్నో చేసిందని, ఎనిమిది వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను అందించిందని చెప్పారు. తెలంగాణాలో తాను శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులకు తానే ప్రారంభిస్తున్నాను అని ఆయన చెప్పారు. తెలంగాణా ప్రజల కోసం ప్రగతి కోసం బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు.

ఇదిలా ఉంటే కేసీయార్ మోడీల మధ్య జరిగిన చర్చకు నిజమాబాద్ సభలో ప్రధాని సరైన టైం లో బయటపెట్టడం పట్ల చర్చ సాగుతోంది. కేసీయార్ మోడీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు అన్న దాని మీద ఎవరికీ క్లారిటీ లేదు. అయితే తన కళ్లలోకి చూసే ధైర్యం కేసీయార్ కి లేదని జరిగింది ఇదీ అంటూ మోడీ చెప్పుకొచ్చారు. మరి ఇది తప్పు అంటూ బీయారెస్ ఏ విధంగా రివర్స్ అటాక్ చేస్తుందో చూడాల్సి ఉంది.