Begin typing your search above and press return to search.

మోడీకి రైట్ హ్యాండ్ జగన్...లెఫ్ట్ హ్యాండ్ చంద్రబాబు...మరి పవన్...!?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బలమైన సారధిగా ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 March 2024 8:59 AM GMT
మోడీకి రైట్ హ్యాండ్ జగన్...లెఫ్ట్ హ్యాండ్ చంద్రబాబు...మరి పవన్...!?
X

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బలమైన సారధిగా ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయనతో దోస్తీ చేయడానికి ఏపీలోని అన్ని పార్టీలూ పోటీ పడుతూనే ఉన్నాయి. పొత్తులు కట్టి బాహాటంగా కొన్ని పార్టీలు ముందుకు వస్తే పొత్తు లేకపోయినా తెర వెనక అవగాహానతో కొన్ని పార్టీలు ఉంటున్నాయి.

అలా ఏపీ రాజకీయం బీజేపీ చాణక్యం గురించి అర్ధం కాని వారు బహుశా ఆ మాత్రం పాలిటిక్స్ తెలిసిన వారిలో ఎవరూ ఉండరు అనే చెప్పాలి. మోడీకి ఏపీలో ఎన్ని సీట్లు వస్తాయి అని ఏవరినైనా అడిగితే పాతికకు పాతిక అని చెబుతారు. అదేంటి బీజేపీ ఆరు ఎంపీ సీట్లకే పోటీ చేస్తోంది కదా అంటే పోటీ చేసినవి గెలిచినా గెలవకపోయినా మొత్తానికి మొత్తం పాతిక ఎంపీ సీట్లు బీజేపీవే అన్న జవాబు సెటైరికల్ గా వస్తుంది.

అంటే ఏపీలో అన్ని పక్షాలతో బీజేపీ రాజకీయంతో పులిహోర కలుపుతోంది అని దాని అర్ధం. మరి ఇంతలా తెలిశాక కూడా ఏపీలో బీజేపీకి ఇబ్బంది అవుతుంది అని ఎవరైనా అనుకుంటారా అసలు ఎదురు లేదు అనే అనుకుంటారు. అందుకే ఒక మాట ఏపీ పాలిటిక్స్ లో గట్టిగా వినిపిస్తుంది.

అదేంటి అంటే మోడీకి జగన్ రైట్ హ్యాండ్, చంద్రబాబు లెఫ్ట్ హ్యాండ్ అని. ఈ ఇద్దరినీ అలా తన వెంట బెట్టుకుని ఏపీ రాజకీయాన్ని మొత్తం మోడీ శాసిస్తున్నారు అని అంటున్నారు. దానికి ఉదాహరణ ఇటీవల చిలకలూరిపేటలో జరిగిన సభ అని అంటున్నారు. ఆ సభలో చంద్రబాబు మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మోడీ లేని దేశాన్ని ఊహించలేమని అన్నారు. ఆయన్ని ప్రపంచ గురువు అనేశారు.

మరి దానికి బదులుగా మోడీ చంద్రబాబుని ఒక్క మాట అయినా పొగిడారా. బాబు అనుభవం గొప్పది అని ఒక్క పదం అయినా వాడారా అంటే లేదు అని తమ్ముళ్ళే గొణుక్కుంటున్నారు. సరే బాబుని పొగడలేదు. కనీసం జగన్ ని తిడితే కడుపారా తృప్తిగా ఉండేది కదా. 2019లో బాబుకు పోలవరం ఏటీఎం అని ఘాటు పదాలతో విరుచుకుని పడినట్లుగా జగన్ అవినీతి అనకొండ అని మోడీ లాంటి వారు అంటే ఆ లెక్కే వేరు కదా.

అపుడైనా తమ్ముళ్లకు బాబుకు ఎంతో సంతృప్తిగా ఉండేది కదా. ఆ పని అయినా చేశారా అంటే అసలు లేదు కదా. మరి ఇదేమిటి అని అంతా అనుకోరా. సరే అటు జగన్ సీఎం ఇటు చంద్రబాబు మాజీ సీఎం ఈ ఇద్దరి విషయంలో మోడీ బ్యాలెన్స్ గానే ఉంటున్నారు అనుకున్నా జనసేన పేరుతో పార్టీని నడుపుతూ మోడీ కలకాలం దేశానికి ప్రధానిగా ఉండాలి అని ఎక్కిన ప్రతీ వేదిక మీద పవన్ కళ్యాణ్ గట్టిగానే చెబుతున్నారు కదా. పోనీ ఆయన గురించి ఒక్క మంచి మాట మాట్లాడారా అంటే అసలు పవన్ గురించి మోడీకి పెద్దగా ఏ రకమైన ఒపీనియన్ లేదు అని అంటున్నారు.

ఇది మరింత చిత్రమైన వ్వవహారమే కదా. ఏపీలో చూసుకుంటే మోడీ మార్క్ పొలిటికల్ కోణంలో బాబు జగన్ మాత్రమే కావాలని అంటున్నారు. ఎందుకంటే ఈ ఇద్దరి పార్టీలే బలంగా ఉన్నాయి. ఈ ఇద్దరు వద్దనే బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ ఇద్దరికే ఎంపీ సీట్లు కూడా ఎక్కువగా దక్కుతాయి అని అంటున్నారు. అందుకోసమే ఈ ఇద్దరినీ తన వైపు ఉంచుకున్నారు అని అంటున్నారు.

అక్కడ జగన్ ని తిట్టలేదు, బాబుని పొగడలేదు. ఇలా బ్యాలెన్స్ మెయింటెయిన్ చేస్తూ మోడీ ధన్యుడిని అనిపించుకుంటున్నారు అని పొలిటికల్ సెటైర్లు పడుతున్నాయి. మోడీ తనకు దేవుడని ఆరాధ్యుడని పవన్ అనుకోవచ్చు. మోడీ మాత్రం పవన్ ని కూరల్లో కరివేపాకు లాగానే తీసి పక్కన పెడుతున్నారు అని అంటున్నారు. ఆయన ఫోకస్ అంతా ఏపీ అంటే జగన్ చంద్రబాబు అన్నట్లుగానే ఉంది అని అంటున్నారు.

వారిద్దరూ సీరియస్ పొలిటీషియన్స్. వారిద్దరే బీజేపీకి ఏపీ నుంచి బలంగా నిలబడతారు అన్న లెక్కలు ఉన్నాయట. వారి వల్లనే రేపటి రోజున కేంద్రంలో బీజేపీ మరింత ఎక్కువ సీట్లను తన ఖాతాలో కలుపుకోవడానికి వీలు అవుతుంది అన్న అంచనాలు ఉన్నాయట. అందుకే ఎవరినీ నొప్పించక తాను నొవ్వక అన్న తీరున ఏపీ రాజకీయాల్లో మోడీ మాస్టార్ తనదైన స్టైల్ ని కొనసాగిస్తున్నారు అని అంటున్నారు.

ఇక పవన్ అయితే తానే పొత్తులను కలిపాను బీజేపీ వద్ద పెద్దల చీవాట్లు తిన్నాను అని భ్రమ పడుతున్నారు. బీజేపీ జాతీయ పార్టీ.. ఢక్కా మెక్కీలు తిన్న పార్టీ. తనకు ఎవరు అవసరమో ఎప్పటికి ఏది చేయాలో అంత తెలియకుండా ఉంటుందా. మాస్టర్ మైండ్స్ బీజేపీలో నిరంతరం పనిచేస్తూ ఉంటాయి. బీజేపీ ప్లాన్ 2024లో టీడీపీతో చేతులు కలపాలని ఎపుడో పెట్టుకుని ఉంది.

అదే సమయంలో అటు బాబు కానీ జగన్ కానీ ఇండియా కూటమి వైపు తొంగి చూడరాదు అన్నది కూడా కమలం పార్టీ ఫిలాసఫీ. గుత్త మొత్తంగా ఏపీలో పాతిక సీట్లు బీజేపీ వైపు టర్న్ కావాలన్నదే వారి పట్టుదల. సౌత్ లో ఇంత పెద్ద నంబర్ తో సీట్లు ఇచ్చే స్టేట్ బీజేపీకి మరోకటి లేనే లేదు. అందుకే బీజేపీ ఏపీ మీద ఇలా ఫోకస్ పెట్టింది. మొత్తానికి పవన్ చిలకలూరిపేట సభలో మోడీని అపర భగీరధుడిగా పోల్చారు. కానీ బీజేపీ గంగలో ఏపీలో అన్ని పార్టీలు మునిగాయన్న సత్యాన్ని సినీ స్టార్ గానే ఇంకా ఉంటూ వస్తున్న పవన్ కి ఎపుడు తెలిసేనో అన్నదే డౌట్.