Begin typing your search above and press return to search.

మోడీ మీద ఉక్రెయిన్ భారం మోపిన అమెరికా

ఇపుడు చూస్తే ఉక్రెయిన్ తో వివాదానికి రష్యా ముగింపు పలికేలా భారత్ ప్రయత్నించి ఒప్పించాలని అమెరికా సూచిస్తోంది.

By:  Tupaki Desk   |   17 July 2024 6:33 PM GMT
మోడీ మీద ఉక్రెయిన్ భారం మోపిన అమెరికా
X

ప్రధానిగా మూడోసారి గెలిచిన తరువాత నరేంద్ర మోడీ రష్యా పర్యటనకు వెళ్లారు. అది కూడా దాదాపుగా అయిదేళ్ల తరువాత. ఇక ఉక్రెయిన్ తో రష్యా యుద్ధం ప్రారంభించిన తరువాత మోడీ రష్యా టూర్ చేయడం ఇదే తొలిసారి. ఇలా ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ పర్యటన సహజంగానే అమెరికాకు కంటగింపుగా మారింది.

ఏక ధృవ ప్రపంచాన్ని కోరుకుంటున్న అమెరికా ఉక్రెయిన్ వెనక ఉందని అంతా అనుమానిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా ని దెబ్బ తీయడానికి ప్రచ్ఛన్న యుద్ధానికి తలుపు తెరిచినట్లుగా ప్రచారంలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో రష్యా మీద ఒత్తిడి అమెరికా వివిధ రకాలుగా చేస్తూ పోయింది.

ఈ పరిణామాల మధ్య భారత తటస్తంగా ఉంటూ వచ్చింది. ఇపుడు ఏకంగా ప్రధాని రష్యా టూర్ పెట్టుకుని దశాబ్దాల భారత్ రష్యా మిత్ర బంధాన్ని మరోసారి చాటారు. మోడీ రష్యా టూర్ మీద అమెరికా సన్నాయి నొక్కులు నొక్కుతూ వచ్చింది. ఇపుడు చూస్తే ఉక్రెయిన్ తో వివాదానికి రష్యా ముగింపు పలికేలా భారత్ ప్రయత్నించి ఒప్పించాలని అమెరికా సూచిస్తోంది.

ఉక్రెయిన్‌తో వివాదానికి సంబంధించి తన చట్టవిరుద్ధమైన యుద్ధాన్ని ముగించాలని శాశ్వత శాంతిని కనుగొనాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను భారత్ ఈ విధంగా కోరాలని అమెరికా అంటోంది. ఈ విషయంలో రష్యాతో ఉన్న దీర్ఘకాల సంబంధాన్ని ఉపయోగించుకోవాలని అమెరికా భారతదేశాన్ని కోరింది.

అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ దీని మీద మాట్లాడుతూ భారతదేశం రష్యాతో సుదీర్ఘ సంబంధాన్ని కలిగి ఉందని గుర్తు చేశారు. అందుకే రష్యాతో ఆ సంబంధాన్ని ఉపయోగించుకుని ఉక్రెయిన్ సమస్య తీర్చాలని భారతదేశాన్ని కోరుతున్నామని అన్నారు.

అదే సమయంలో ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత సార్వభౌమత్వాన్ని గౌరవించమని ఐక్య రాజ్యసమితి చార్టర్‌ను గౌరవించమని భారతదేశం వ్లాదిమిర్ పుతిన్‌కు చెప్పాలని ఆయన అన్నారు. ఒక విధంగా చూస్తే ఇది సూచనగా ఉన్నా భారత్ ని ఇరికిస్తున్నట్లుగానే ఉంది. రష్యా ఉక్రెయిన్ ల విషయంలో భారత్ ఎపుడూ ఒకే మాట చెబుతూ వస్తోంది. చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుతోంది.

రష్యా తనదైన రక్షణ పరమైన అనుమానాలు భయాందోళనలు వ్యక్తం చేస్తోంది. ఉక్రెయిన్ వెనక ఉన్న శక్తుల గురించే రష్యా కలవరపడుతోంది. పరిస్థితి ఇలా ఉంటే ఏకపక్షంగా రష్యాను తగ్గమని అడిగే హక్కు ఎవరికైనా ఎలా ఉంటుంది. ముందు ఉక్రెయిన్ కి నాటో దేశాల సాయం నిలుపుదల చేసి చర్చలకు వెళ్లమని పెద్దన్న తానే కోరవచ్చు కదా అన్న మాట కూడా ఉంది. ఏది ఏమైనా భారత్ రష్యా బంధాన్ని దెబ్బ తీయడానికే ఈ ఫిట్టింగ్ ని పెద్దన్న పాత్రలో అగ్ర దేశం పెట్టినట్లుగా ఉందని అంటున్నారు.