Begin typing your search above and press return to search.

నా జీవితం రైలు ప‌ట్టాల మీదే మొద‌లైంది : ఎన్నిక‌ల వేళ‌ మోడీ సెంటిమెంట్ అస్త్రం

నా జీవితం రైలు ప‌ట్టాల మీదే మొద‌లైంది.. `` అంటూ ప్రారంభించి.. ఈ చాయ్ వాలాను ఎంతో మంది అవ‌మానించారు.

By:  Tupaki Desk   |   12 March 2024 10:28 AM GMT
నా జీవితం రైలు ప‌ట్టాల మీదే మొద‌లైంది :  ఎన్నిక‌ల వేళ‌ మోడీ సెంటిమెంట్ అస్త్రం
X

ఎన్నిక‌లు వ‌స్తే చాలు.. నాయ‌కుల‌కు గ‌తాలు గుర్తుకు వ‌స్తాయి. ఎక్క‌డెక్క‌డో ఆర్క్వైస్‌లో దాచిపెట్టిన వాటిని కూడా.. తీసి దుమ్ము దులిపి..ప్ర‌జ‌ల ముందు పెడ‌తారు. సెంటిమెంటును రాజేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఇప్పుడు మ‌రోసారి ప్ర‌ధాని మోడీ.. రైలు ప‌ట్టాలు.. త‌న జీవితం అనే విష‌యంపై సోదాహ‌ర‌ణంగా ప్ర‌సంగాలు దంచికొట్టారు. ''నా జీవితం రైలు ప‌ట్టాల మీదే మొద‌లైంది.. '' అంటూ ప్రారంభించి.. ఈ చాయ్ వాలాను ఎంతో మంది అవ‌మానించారు. ఇంకా అవ‌మానిస్తూనే ఉన్నారు.. మీరే ర‌క్షించుకోవాలి! అని ముగించారు.

తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో దేశవ్యాప్తంగా రూ. 85 వేల కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులకు మంగళవారం మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో తెలంగాణ‌, ఏపీకి చెందిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. సెంటి మెంటు లేప‌నాల‌ద్దిన‌ కామెంట్ల‌ను కుమ్మ‌రించారు. రైలు పట్టాలపై తన జీవితాన్ని ప్రారంభించానంటూ గతాన్ని గుర్తు చేసుకొన్నారు.

‘‘దేశం కోసమే అభివృద్ధి కార్య‌క్ర‌మాలు చేస్తున్నాం. అంతేకానీ.. కొంద‌రిలాగా.. ఎన్నికల్లో అధికారం చేజిక్కించుకునేందుకు నేను అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం లేదు. ఓట్ల కోసమే బీజేపీ సర్కారు ఈ చర్యలను చేపట్టిందంటూ కొందరు తప్పుపడుతున్నారు. కానీ, అవి త‌ప్పు. నా జీవితాన్ని రైలు పట్టాలపైనే ప్రారంభించా. గతంలో మన రైల్వేల పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉండేది. అందుకే ఆ కష్టాల గురించి నాకు బాగా తెలుసు. గత తరాలు అనుభవించిన బాధలను భవిష్యత్తు తరాలకు ఇవ్వకుండా ఉండడమే మోడీ గ్యారెంటీ’’ అని వ్యాఖ్యానించారు.

ఈ సెంటిమెంటు కొత్త కాదు!

ప్ర‌ధాని మోడీకి ఇలా సెంటిమెంట్లు ప్లే చేయ‌డం కొత్త‌కాదు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు.. తాను చాయ్ వాలా న‌ని చెప్పుకొన్నారు. 2014లోనూ ఇలానే చెప్పారు. కానీ, 2019లో ఓబీసీల ర‌గ‌డ తెర‌మీదికి వ‌చ్చిన‌ప్పుడు.. చాయ్ వాలా క‌మ్ ఓబీసీన‌ని చెప్పుకొన్నారు. అంతేకాదు.. తాను గుజ‌రాతీ వాడిన‌నే వివ‌క్ష చూపుతున్నా రంటూ.. కాంగ్రెస్ స‌హా త‌న‌ను వ్య‌తిరేకించే పార్టీలపై విమ‌ర్శ‌లు గుప్పించారు. త‌న‌ను తాను.. ప్ర‌జ‌ల కోసం పుట్టిన పుణ్యాత్ముడిగా ప్ర‌చారం చేసుకున్నారు. ఇది స‌క్సెస్ అయింది. ఇక‌, ఇప్పుడు రైలు ప‌ట్టాల‌పైనే జీవితం ప్రారంభించాన‌ని మొద‌లు పెట్టారు. ఇదీ.. సంగ‌తి! త‌డిసి ముద్ద‌యి.. సెంటిమెంటు అస్త్రాల ధాటికి ఓట్లు విర‌జిమ్మండి!! అంటున్నారు ప‌రిశీల‌కులు.