ప్రధాని మోదీ రోజుకు ఎన్ని గంటలు నిద్ర పోతారో తెలుసా?
ఆయన నిద్ర, పనివేళలు గురించి ఎంపీలు అడగ్గా సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత తాను ఎలాంటి ఆహారం తీసుకోనని మోదీ ఎంపీలకు తెలిపారు.
By: Tupaki Desk | 10 Feb 2024 10:26 AM GMTదేశ ప్రధాని నరేంద్ర మోదీ రోజుకు ఎన్ని గంటలు శ్రమిస్తారు? నిత్యం ఎంతసేపు నిద్రపోతారనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొనడం సహజం. కాగా ప్రతి రోజూ తాను కేవలం మూడున్నర గంటలు మాత్రమే తాను నిద్రపోతానని ప్రధాని మోదీ వివరించారు. తాజాగా పార్లమెంటు సమావేశాల్లో భాగంగా కొందరు ఎంపీలతో ప్రధాని పార్లమెంటు క్యాంటీన్ లో లంచ్ చేశారు. ఈ లంచ్ కు ఆయనే డబ్బు చెల్లించారు.
ఈ సందర్భంగా మోదీ వ్యక్తిగత విషయాల గురించి ఎంపీలు కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆయన నిద్ర, పనివేళలు గురించి ఎంపీలు అడగ్గా సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత తాను ఎలాంటి ఆహారం తీసుకోనని మోదీ ఎంపీలకు తెలిపారు. అలాగే రోజుకు తాను మూడున్నర గంటలు మాత్రమే నిద్రపోతానని వెల్లడించారు. ఇందుకు తాను సమతుల ఆహారం తీసుకుంటానని... నిద్రకు తగినట్టు సమతుల ఆహారం తీసుకోవాలన్నారు.
కాగా ఇటీవల పరీక్షా పే చర్చ కార్యక్రమంలో విద్యార్థులతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ఇదే విషయాన్ని చెప్పారు. తాను రోజుకు మూడున్నర గంటలు నిద్రపోతానని వెల్లడించారు. అంతేకాకుండా తాను బెడ్ మీద పడుకున్న 30 సెకన్లకే గాఢ నిద్రలోకి జారుకుంటానని తెలిపారు.
అలాగే గతంలో ఇదే అంశానికి సంబంధించి మహారాష్ట్ర భారతీయ జనతా పార్టీ చంద్రకాంత్ పాటిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ రోజూ రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని వెల్లడించారు. ఆయన నిద్రపోకుండా ఓ ప్రయోగం చేస్తున్నారని తెలిపారు. దేశం కోసం 24 గంటలు ప్రధాని పనిచేస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు.
ప్రధాని మోదీ రోజూ కేవలం రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని చంద్రకాంత్ పాటిల్ అప్పట్లో తెలిపారు. ప్రతిరోజూ 22 గంటల పాటు ఆయన తన విధుల్లోనే ఉంటారన్నారు. నిద్ర పోవాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు ప్రయోగాలు చేస్తున్నారని చెప్పారు. ప్రధాని ఒక్క నిమిషం కూడా తన సమయాన్ని వృథా చేయరన్నారు.
అలాగే బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ గతంలో ప్రధాని మోదీని ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ప్రధాని నిద్రవేళల గురించి అక్షయ్ ప్రశ్నించారు. దానికి ప్రధాని మోదీ సమాధానమిస్తూ తాను కేవలం మూడున్నర నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నానని వివరించారు.