Begin typing your search above and press return to search.

రాముడు ఇక టెంట్ లో ఉండక్కరలేదు... అసక్తికరంగా మోడీ ప్రసంగం!

ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. ఇంతకాలం టెంట్ లో ఉన్న రాముడు ఇప్పుడు దివ్యమందిరానికి చేరుకున్నారు.

By:  Tupaki Desk   |   22 Jan 2024 10:47 AM GMT
రాముడు ఇక టెంట్  లో ఉండక్కరలేదు... అసక్తికరంగా మోడీ ప్రసంగం!
X

ఉత్తరప్రదేశ్‌ లోని అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. ఇంతకాలం టెంట్ లో ఉన్న రాముడు ఇప్పుడు దివ్యమందిరానికి చేరుకున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మధ్యాహ్నం రామమందిరంలో రామ్‌ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వేల మంది పరోక్షంగా కోట్ల మంది తిలకించారని చెప్పవచ్చు. ఈ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దీక్ష విరమించిన మోడీ... అనంతరం ప్రసగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

అవును... అయోధ్యలోని నవనిర్మిత రామమందిరంలో రామ్‌ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా మోడీ ప్రసంగించారు. ఈ సందర్భంగా... "జై సియా రామ్‌" అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు మోడీ. ఈ క్రమంలో... "మన రామ్‌ లల్లా ఇక టెంట్‌ లో ఉండాల్సిన అవసరం లేదు, ఆయన దివ్యమందిరంలో కొలువుదీరారు" అని ప్రధాని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో... "జనవరి 22, 2024".. ఇది కేవలం తేదీ మాత్రమే కాదు.. కొత్త కాలచక్రానికి ప్రతీక అని తెలిపిన మోడీ... కొన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఈ తేదీని ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. ఈ క్షణం కోసం ప్రజలు వందల ఏళ్లుగా నిరీక్షించారని.. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా దశాబ్దాల పాటు న్యాయపోరాటం చేశామని తెలిపారు.

ఈ కాలక్రమంలో ఎన్నో బలిదానాలు, పోరాటాలు, త్యాగాలు జరిగాయని.. ఈ కార్యం ఆలస్యమైనందుకు క్షమించమని రాముడిని వేడుకుంటున్నట్లు తెలిపారు. ఇన్ని వందల ఏళ్ల తర్వాత మన రాముడు మళ్లీ అయోధ్యకు వచ్చాడని చెబుతూ.. ఈ శుభ గడియల్లో ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మోడీ ప్రకటించారు. ఇదే సమయంలో... ఈ రాత్రికి ప్రతి ఇంటా రామజ్యోతి వెలగాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ఇక ఈ శుభ గడియల కోసం 11 రోజుల దీక్ష వహించిన విషయాన్ని పంచుకున్న మోడీ... ఈ 11 రోజులూ రాముడితో అనుబంధం ఉన్న క్షేత్రాలన్నీ సందర్శించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లోని లేపాక్షి ఆలయం, తమిళనాడులోని రామేశ్వర ఆలయంతో పాటు రామసేతు ప్రాంతాన్ని దర్శించుకున్నట్లు వెల్లడించారు!

ఈ సందర్భంగా... రామ నామం ఈ దేశ ప్రజల్లో నిండి ఉందని చెప్పిన మోడీ... రాముడు వివాదం కాదు సమాధానం అని అన్నారు. ఇదే సమయంలో... రాముడు అగ్ని కాదు.. వెలుగు అని ఆయన స్పష్టం చేశారు. ఇదే క్రమంలో... రాముడే భారత్‌ కు ఆధారం.. ఆయనే భారత్‌ విధానం అంటూ మోడీ కొనియాడారు.