మోడీ స్టార్ క్యాంపెయినరా ?
నరేంద్రమోడీని తెలంగాణా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా మార్చేసింది. పార్టీ తరపున స్టార్ క్యాంపెయనర్లుగా కేంద్ర ఎన్నికల కమీషన్ కు జాబితా అందచేయాల్సుంటుంది.
By: Tupaki Desk | 7 Nov 2023 6:40 AM GMTనరేంద్రమోడీని తెలంగాణా బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా మార్చేసింది. పార్టీ తరపున స్టార్ క్యాంపెయనర్లుగా కేంద్ర ఎన్నికల కమీషన్ కు జాబితా అందచేయాల్సుంటుంది. అలాంటి జాబితాలో మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాతో కూడిన 42 మంది పేర్లను ఇచ్చింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే మోడీని పార్టీ స్టార్ క్యాంపెయినర్ స్ధాయికి కుదించేసింది. ఎలాగంటే మోడీ దేశ ప్రధానమంత్రి అన్న విషయం తెలిసిందే. అంటే స్టార్ క్యాంపెయినర్ స్ధాయికి మించిన చరిష్మా మోడీకుంటుంది.
అలాంటి మోడీని తెలంగాణా స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చటమంటే ప్రధాని స్ధాయిని తగ్గించేయటమే. ఇప్పటికే మోడీ చాలాసార్లు తెలంగాణాలో పర్యటించిన విషయం తెలిసిందే. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో మోడీ పేరు చేర్చకుండా ఉండుంటే బాగుండేది. స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పేరు లేకపోయినా ప్రధాని హోదాలో మోడి ఎన్నికల బహిరంగసభల్లో, ర్యాలీలు, రోడ్డుషోల్లో పాల్గొనవచ్చు. అవకాశం ఉన్నప్పటికీ మరి మోడీని ఎందుకని స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో చేర్చిందో అర్ధంకావటంలేదు.
నిజానికి జాబితా మొత్తంలో మోడీ, అమిత్ షా, నడ్డాలు తప్ప ఇంకెవరికీ స్టార్ క్యాంపెయినర్ల సీనులేదు. ఎందుకంటే బండి సంజయ్, కిషన్ రెడ్డి, మురళీధరరావు, ప్రకాష్ జవదేకర్, బీఎల్ సంతోష్, అర్వింద్ మీనన్, తరుణ్ చుగ్, నిర్మల సీతారామన్ లాంటి వాళ్ళు ఎంతమంది ఎన్నిసార్లు ప్రచారం చేసినా ఎలాంటి ఉపయోగముండదు. ఎందుకంటే వీళ్ళెవరు తెలంగాణా జనాలకు పెద్దగా పరిచయటంలేని వాళ్ళే. జాబితాలో బండి సంజయ్ పేరున్నా తాను పోటీచేస్తున్న కరీంనగర్ నియోజకవర్గంలో గెలుపుకే అవస్తలు పడుతున్నారు.
కాబట్టి కరీంనగర్ నియోజకవర్గాన్ని వదిలి ఇతర నియోజకవర్గాల్లో ప్రచారం చేసేంత సీన్ బండికి పెద్దగా ఉండకపోవచ్చు. ఇక కిషన్ రెడ్డి పరిస్ధితి దాదాపు ఇలాగే ఉంటుంది. అబంర్ పేటలో అభ్యర్ధి కృష్ణ యాదవ్ ను గెలిపించుకోవటమే కిషన్ కు తలకుమించిన వ్యవహారంగా మారబోతోంది. కాబట్టి ఏ రూపంలో చూసినా జాబితాలోని స్టార్ క్యాంపెయినర్ల వల్ల పార్టీకి పెద్దగా ఉపయోగం ఉంటుందని అనుకునేందుకు లేదు. ఒకవైపు పార్టీ ఇమేజిని చంపేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మోడీ, అమిత్ షాలు తెలంగాణాలో ఎన్నిసార్లు పర్యటిస్తే మాత్రం ఏమిటి ఉపయోగం ?