మోడీ టార్గెట్ మారింది.. 2030 కాదు.. 2028!!
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ మారింది. దేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ఆయన పదే పదే చెబుతున్నారు.
By: Tupaki Desk | 16 Nov 2023 1:30 PM GMTకేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుకున్న టార్గెట్ మారింది. దేశాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని ఆయన పదే పదే చెబుతున్నారు. అంతేకాదు.. 2030 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ మూడో స్థానంలో ఉండేలా తీర్చిదిద్దుతామని.. ఈ క్రమంలో అడుగులు వేగంగా పడుతు న్నాయని కూడా ఆయన సెలవిస్తున్నారు.
అయితే.. ఈ టార్గెట్ ఇప్పుడు మారిందని.. ప్రపంచ స్టాటిస్టిక్స్ సంస్థ(వరల్ఢ్ ఆఫ్ స్టాటిస్టిక్స్) వెల్లడించిం ది. మోడీ నేతృత్వంలో భారత్ ఇప్పటికే విజయాలు నమోదు చేసిందని.. ఈ పురోగతి మరింత కొనసాగు తోందని సంస్థ వెల్లడించింది. తాజాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చేసిన అధ్యయనం తాలూకు వివరాలను సంస్థ వివరించింది. దీని ప్రకారం.. 2028 నాటికే భారత్ ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలో మూడోస్థానంలో ఉంటుందని పేర్కొంది.
ఈ సర్వే అంచనా ప్రకారం 2028 నాటికి అమెరికా 32.96 ట్రిలియన్ డాలర్లతో ప్రపంచ దేశాల్లో తొలి స్థానంలో ఉండనుంది. ఇక, 23.61 ట్రిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానాన్ని ఆక్రమించుకుంటుందని తెలిపింది. భారత్ మాత్రం 5.94 ట్రిలియన్ డాలర్లతో మూడో స్థానంలో నిలుస్తుందని సర్వే వెల్లడించింది. భారత్ తర్వాత స్థానాల్లో జర్మనీ 5.46, జపాన్ 5.16 ట్రిలియన్ డాలర్లతో నాలుగు, ఐదు స్థానాలు దక్కించుకుంటాయని వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్ వెల్లడించింది.
దీంతో ఈ విషయాన్ని ఎన్నికలు జరుగుతున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ నాయకులు సోషల్ మీడియా వేదిక ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నారు. మోడీ లేకపోతే.. ఈ దేశం ఏంకానో.. అని కామెంట్లు చేస్తున్నారు. మరి వీరి ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.