Begin typing your search above and press return to search.

ఏమిటీ నాసిన్? అనంతలో మోడీ ప్రారంభిస్తున్న దీని ప్రత్యేకత ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వస్తున్నారు. తాజాగా ఆయన పర్యటన అనంతపురం జిల్లాలోని గోరంట్లలో సాగనుంది. నాసిన్ పేరుతో ప్రారంభించే ఈ అకాడమీ ప్రత్యేకత ఏమిటి?

By:  Tupaki Desk   |   16 Jan 2024 5:14 AM GMT
ఏమిటీ నాసిన్? అనంతలో మోడీ ప్రారంభిస్తున్న దీని ప్రత్యేకత ఏమిటి?
X

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి వస్తున్నారు. తాజాగా ఆయన పర్యటన అనంతపురం జిల్లాలోని గోరంట్లలో సాగనుంది. నాసిన్ పేరుతో ప్రారంభించే ఈ అకాడమీ ప్రత్యేకత ఏమిటి? అదేం చేస్తుందన్న విషయంలోకి వెళితే.. ఏపీకి ప్రత్యేక గుర్తింపు తెచ్చే ఈ అకాడమీ విశేషాల్లోకి వెళితే..

రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర సర్వీసులకు సంబంధించిన అకాడమీలను ఏర్పాటు చేసే అంశంలో భాగంగా నాసిన్ ను ఏర్పాటు చేస్తున్నారు. నాసిన్ (ఎన్ఏసీఐఎన్) అంటే.. నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, ఇన్ డైరెక్టు ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ (తెలుగులో అయితే.. జాతీయ కస్టమ్స్.. పరోక్ష పన్నులు.. మాదక ద్రవ్యాల అకాడమీ). ఉమ్మడి అనంతపురం జిల్లా (కొత్తగా ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం)లోని గోరంట్ల మండల పరిధిలోని పాలసముద్రం సమీపంలోని నేషనల్ హైవే 44కు అనుకొని ఉన్న 503 ఎకరాల్లో ఈ అకాడమీని నిర్మిస్తున్నారు.

బెంగళూరు ఎయిర్ పోర్టు నుంచి కేవలం గంట వ్యవధిలో ఈ అకాడమీకి చేరుకోవటం దీని ప్రత్యేకతగా చెప్పాలి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఈ శిక్షణ కేంద్రం అత్యంత భద్రత నడుమ కొనసాగేలా నిర్మాణాన్ని పూర్తి చేశారు. దేశంలోనే అత్యుత్తమ సివిల్ సర్వీసులుగా పేర్కొనే ఐఏఎస్ లకు ముస్సోరి.. ఐపీఎస్ లకు హైదరాబాద్ తరహాలో.. ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్)లకు శిక్షణ నాసిన్ లో ఇస్తారు. ఈ అకాడమీ ఆవరణలోనే సోలార్ సిస్టం ఏర్పాటు చేశారు.

శిక్షణలో భాగంగా అవసరమైన విమానాన్ని తీసుకువచ్చారు. నాసిన్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ నిర్మాణానికి ఏర్పాట్లు సాగుతున్నాయి. అకాడమీలో పని చేసే సిబ్బంది పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేశారు. ఇందుకు అవసరమైన స్థలాన్ని రెవెన్యూ శాఖ గుర్తించింది. మరోవైపు ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తారు. ఈ అకాడమీని ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రారంభిస్తారు. ఇందుకోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు.. భద్రతను సిద్దం చేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనే ఈ కార్యక్రమానికి ఏపీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు.. పలువురు మంత్రులు.. ప్రజా ప్రతినిధులు హాజరవుతారు. 2015లో నాటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు.. అశోక్ గజపతి రాజు.. సుజనా చౌదరి ఆధ్వర్యంలో ఈ అకాడమీ నిర్మాణానికి శంకుస్థాపన చేయగా.. ఈ రోజు (జనవరి 16, 2024) ప్రారంభమవుతోంది.