Begin typing your search above and press return to search.

రామోజీరావు మరణంపై మోడీ, గవర్నర్ రియాక్షన్ ఇదే!

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు.

By:  Tupaki Desk   |   8 Jun 2024 5:48 AM GMT
రామోజీరావు మరణంపై మోడీ, గవర్నర్  రియాక్షన్  ఇదే!
X

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరబాద్ లోని ఓ ఆసుపత్రిలో ఈ నెల 5న ఆయన చేరారు. ఈ క్రమంలో అక్కడ చికిత్స తీసుకుంటూ శనివారం తెల్లవారుజామున 4:50 గంటలకు తుదిశ్వాస విడిచారు. దీంతో... ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు.

ఈ సందర్భంగా పలువురు కీలక నేతలు, ప్రముఖులు, సినిమా నటులు ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు. ఇందులో భాగంగా నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా.. రామోజీరావు మృతిపై స్పందించారు. ఇందులో భాగంగా రామోజీరావు మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

"రామోజీరావు మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. పత్రికేయ, సినీ రంగంపై ఆయా చెరగని ముద్రవేశారు. మీడియాలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ఎప్పుడూ ఆయన దేశ అభివృద్ధి కోసమే ఆలోచించేవారు" అంటూ నరేంద్ర మోడీ ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ చేశారు.

ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో పాటు వెంకయ్య నాయుడు, చంద్రబాబు, కేసీఆర్, కిషన్ రెడ్డి.. మొదలైన వారు ఈ సందర్భంగా రామోజీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

గవర్నర్‌ సంతాపం..:

రామోజీరావు మృతిపట్ల ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మీడియా, వినోద రంగాల్లో రామోజీరావు నిష్ణాతుడని.. తెలుగు జర్నలిజంలో ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో ప్రసిద్ధి చెందారని.. ఇదే క్రమంలో జర్నలిజం, సాహిత్యం, సినిమా, విద్యా రంగాల్లో ఎనలేని సేవలందించారని తెలిపారు.

ఇలా పలు కీలక రంగాల్లో ఎనలేని సేవలు అందించినందుకు గానూ రామోజీరావును పద్మవిభూషణ్ తో సత్కరించినట్లు తెలిపారు. ఇదే సమయంలో రామోజీరావు కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.