Begin typing your search above and press return to search.

సొంతంగా 370.. కూటమి 400 ప్లస్ సీట్లు ఎందుకు?

మరి.. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ప్రస్తావిస్తే..ఆయన ఏం చెబుతారు? అన్నది ఆసక్తికరం.

By:  Tupaki Desk   |   5 May 2024 5:55 AM GMT
సొంతంగా 370.. కూటమి 400 ప్లస్ సీట్లు ఎందుకు?
X

దేశాన్ని పదేళ్లు పాలించిన తర్వాత.. మరోసారి ఎన్నికల్ని ఎదుర్కొంటున్న బీజేపీ.. తన తాజా ఎన్నికల లక్ష్యాన్ని కొన్ని నెలల నుంచి భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. బీజేపీ సొంతంగా 370 స్థానాల్ని.. కూటమి మిత్రులతో కలిసి 400 సీట్లను సొంతం చేసుకోవాలన్న మాటను చెప్పటం.. ఆ దిశగా అడుగులు వేయటం తెలిసిందే. 370, 400సీట్లను బీజేపీ అండ్ కో సొంతం చేసుకుంటే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని.. తమకు నచ్చినట్లుగా మారుస్తారంటూ బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.

మరి.. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ప్రస్తావిస్తే..ఆయన ఏం చెబుతారు? అన్నది ఆసక్తికరం. తాజాగా ఆయన్ను ఇంటర్వ్యూ చేసిన వారు ఇదే ప్రశ్నను సంధించారు.దానికి మోడీ ఇచ్చిన సమాధానం ఏమంటే.. ‘‘370 సీట్లు అన్నది కేవలం ఎన్నికల నినాదం కాదు. అది ప్రజల కోరిక. మోడీ గ్యారెంటీలను అమలు చేస్తారని మాపై పెట్టుకున్న నమ్మకం.. విశ్వాసానికి నిదర్శనం. ఆర్టికల్ 370 రద్దు అన్నది కోట్ల మంది ప్రజల దీర్ఘకాల ఆకాంక్ష. మేం రద్దు చేసినప్పుడు ప్రజల్లో నిజమైన సంత్రప్తి వ్యక్తమైంది. ఆర్టికల్ 370ను రద్దు చేసిన పార్టీకి 370కి పైగా సీట్లు.. కూటమికి 400లకు పైగా సీట్లు ఇవ్వాలన్న సహజసిద్ధమైన భావోద్వేగం వారిలో ఉంది’ అని పేర్కొనటం చూస్తే.. తాము పెట్టుకున్న లక్ష్యాన్ని జనాలతో ముడిపెట్టటం ఆసక్తికరంగా చెప్పాలి.

తాము అనుకున్నట్లుగా మెజార్టీ సీట్లను సొంతం చేసుకున్న తర్వాత ఎస్టీ.. ఓబీసీ రిజర్వేషన్లను లాక్కొని మైనార్టీలకు ఇవ్వాలన్న కాంగ్రెస్ ఆలోచనను చూసి తాము అప్రమత్తమైనట్లుగా పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి.. ఎస్సీ.. ఎస్టీ.. ఓఎబీసీ రిజర్వేషన్లను రక్షించటానికి తమకు ఆ మాత్రం మెజార్టీ అవసరమని మోడీ పేర్కొన్నారు. అంతేకాదు.. ఫ్యూచర్ లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదన్న అంశాన్ని నొక్కిచెప్పటం గమనార్హం.

అంతేకాదు.. తాము మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి వంద రోజుల్లోనే పసుపుబోర్డును ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొనటం ఆసక్తికరంగా మారింది. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే విషయంలో ఏపీ ప్రజలకు హామీ ఇస్తున్నా. తెలంగాణకు.. భారతదేశానికి హైదరాబాద్ నగరం ఒక గ్రోత్ సెంటర్. హైదరాబాద్ నగరంలో సులభమైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి తేవటానికి ఎంఎంటీఎస్ నెట్ వర్కును విస్తరిస్తాం. వందే భారత్ మెట్రో ప్రయోజనం పొందే నగరాల్లో హైదరాబాద్ ఉండనుంది. ముంబయి - అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు త్వరలో పూర్తి కానుంది. అలాంటి కారిడార్లు దేశంలో దక్షిణ..తూర్పు.. ఉత్తర ప్రాంతాల్లో నిర్మిస్తామని మ్యానిఫెస్టోలో చెప్పాం. దక్షిణాదిలో హైదరాబాద్ ముఖ్య నగరం కాబట్టి భవిష్యత్తులో హైస్పీడ్ రైల్ కారిడార్ ను కచ్ఛితంగా చూస్తుందని పేర్కొన్నారు.