Begin typing your search above and press return to search.

యుద్ధం కాదు సంధి? ఎల్లుండే ఉక్రెయిన్ కు మోదీ.. ఏం చెబుతారో?

యూరప్ అంతటికీ పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్తు కేంద్రం భద్రతపై ఆందోళనలు నెలకొన్న వేళ.. ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు

By:  Tupaki Desk   |   19 Aug 2024 12:30 PM GMT
యుద్ధం కాదు సంధి? ఎల్లుండే ఉక్రెయిన్ కు మోదీ.. ఏం చెబుతారో?
X

యూరప్ అంతటికీ పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్తు కేంద్రం భద్రతపై ఆందోళనలు నెలకొన్న వేళ.. ప్రధాని మోదీ ఉక్రెయిన్ కు వెళ్లనున్నారు. గత వారం ఈ అణు కేంద్రం వద్ద డ్రోన్‌ దాడి జరిగిన సంగతి తెలిసిందే. రెండున్నరేళ్ల కిందట యుద్ధం మొదలైన సమయంలో అత్యంత భయాందోళనలు కలిగించింది జపోరిజియా ప్లాంట్. దీనిపై దాడి ఉక్రెయిన్‌ దళాలే చేసినట్లు రష్యా ఆరోపిస్తోంది. కాదు.. కాదు.. ఉక్రెయిన్ పనే అని రష్యా అంటోంది. దీంతో అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ప్లాంట్‌ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఉక్రెయిన్ దూకుడు..

రష్యాపై మొదట ఆత్మరక్షణ, తర్వాత యుద్ధం చేసిన ఉక్రెయిన్ ఇప్పుడు ఎదురుదాడికి దిగుతోంది. రెండు వారాలుగా రష్యా భూభాగంలోకి చొచ్చుకువెళ్తోంది. కస్క్‌ ప్రాంతంలో గ్లుష్కొవొలో సెయిమ్‌ నదిపై కీలక వంతెనను కూల్చివేసింది. ఇది రష్యా సైన్యానికి సరఫరా వ్యవస్థలను అడ్డుకునే ప్రయత్నమే. దీంతోపాటు ఉక్రెయిన్ దళాలు ఇక్కడ ఉండిపోనున్నాయి. కాగా, సెయిమ్ నదిపై మరో వంతెననూ ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. మొత్తం మూడు బ్రిడ్జిలకు గాను ఒక్కటే మిగిలింది. కస్క్‌ లో స్వాధీనంలోకి తీసుకున్న ప్రాంతాన్ని గుప్పిట్లో పెట్టుకునేందుకే ఉక్రెయిన్‌ వంతెనలపై కన్నేసింది.

అణు ప్లాంట్ పై ఆందోళనల వేళ..

సుదీర్ఘకాలంగా ఉక్రెయిన్ పోరాటం సాగిస్తున్నది. దీంతో వనరులు అయిపోయాయి. మిగిలినది అతి తక్కువే. మరోవైపు అణు ప్లాంట్ పై ఆందోళనలు నెలకొన్నాయి. దీంతోనే ఉక్రెయిన్‌ రష్యాలోకి వెళ్లడం ప్రమాదకర ప్రయత్నం అని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాగా, రష్యా కూడా ఆదివారం తెల్లవారుజామున ఉక్రెయిన్‌పై మరోసారి క్షిపణులతో దాడిచేసింది. ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థ దీన్ని కూల్చివేసింది. ఇకమీదట రష్యా దాడులను తీవ్రం చేసే అవకాశం కనిపిస్తోంది.

మోదీ వెళ్తున్నారు.. మరి ఏం జరుగుతుందో?

ప్రధాని మోదీ 21, 22, 23 తేదీల్లో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. తొలుత పోలండ్, అనంతరం ఉక్రెయిన్‌ వెళ్లే ఆయన.. ఏం మాట్లాడతారో చూడాలి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం మొదలయ్యాక మోదీ ఉక్రెయిన్ వెళ్లడం ఇదే తొలిసారి. అయితే, మూడోసారి ప్రధాని అయ్యాక మోదీ నేరుగా రష్యా వెళ్లడం తీవ్ర కలకలం రేపింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దీనిని తీవ్రంగా తప్పుబట్టారు. కానీ, రష్యాతో భారత్ కు సుదీర్ఘ కాలంగా స్నేహ బంధం ఉంది. కాగా, 45 ఏళ్ల తర్వాత పోలెండ్‌ వెళ్తున్న తొలి భారత ప్రధాని మోదీ. 1979లో చివరిసారిగా అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్.. ఈ దేశాన్ని సందర్శించారు.

సంధి ప్రయత్నాలు సాగిస్తారా?

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధాన్ని ఆపగలిగే ప్రపంచ నాయకులు ఎవరూ అంటే.. అది ఒక్క మోదీనే అనే సమాధానం వస్తోంది. బైడెన్, జిన్ పింగ్ సహా మరెవరికీ ఆ సత్తా లేదు. రెండు దేశాలకూ భారత్ సన్నిహితం. అంతేకాదు.. పుతిన్ కు మోదీ వ్యక్తిగతంగానూ సన్నిహితం. మోదీ చెబితే పుతిన్ వింటారనే వ్యాఖ్యలు గతంలోనూ వినిపించాయి. మోదీ కూడా ఇది యుద్ధాల కాలం కాదని గతంలోనే చెప్పారు. మరిప్పుడు ఆయన సంధి కుదురుస్తారా? అనేది చూడాలి. అదే జరిగితే.. మోదీ ప్రపంచ నాయకుడు అవుతారనడంలో సందేహం లేదు.