Begin typing your search above and press return to search.

మోడీ విశాఖ నుంచి ప్రచారం చేయరా...!?

ఆయన దేశ ప్రధాని. ఎక్కడ నుంచి అయినా ప్రచారం చేయవచ్చు. అయిదేళ్ల క్రితం విశాఖ నుంచే నరేంద్ర మోడీ ఏపీ ప్రచారాన్ని ప్రారంభించారు

By:  Tupaki Desk   |   13 March 2024 5:00 AM IST
మోడీ విశాఖ నుంచి ప్రచారం చేయరా...!?
X

ఆయన దేశ ప్రధాని. ఎక్కడ నుంచి అయినా ప్రచారం చేయవచ్చు. అయిదేళ్ల క్రితం విశాఖ నుంచే నరేంద్ర మోడీ ఏపీ ప్రచారాన్ని ప్రారంభించారు. 2019 మార్చి 1న విశాఖ వచ్చిన ప్రధాని అనాడు రైల్వే జోన్ ఇచ్చేస్తున్నామంటూ ఒక జీవో కాపీని కూడా సభికులకు చూపించారు. కానీ అయిదేళ్లు గడచినా రైల్వే జోన్ ఊసే లేదు.

ఇక గత మూడేళ్ళుగా చూస్తే స్టీల్ ప్లాంట్ చిచ్చు రాజేసి ఉంచారు. ప్రైవేట్ పరం చేస్తాం తప్ప తగ్గేది లేదు అని అంటున్నారు. వేయి రోజులకు పైగా కార్మికులు ఆందోళన బాటలో ఉన్నారు. అయినా సరే కేంద్రం తన నిర్ణయం మార్చుకోలేదు. పైపెచ్చు మంత్రులు అంతా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పాలసీ నిర్ణయం అంటూ వచ్చారు.

దీంతో బీజేపీ మీద ఉక్కు కార్మికులకు కోపం చాలా ఎక్కువైపోతోంది. ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ టూర్ మీద రెండు సార్లు ప్రకటనలు వచ్చినా కూడా అది ఖరారు కాలేదు. నిజానికి చూస్తే ఈ నెల 1న ప్రధాని సభ విశాఖలో ఉండాలి. కానీ క్యాన్సిల్ అయిందని వార్తలు వచ్చారు. లేటెస్ట్ గా ఈ నెల 16న ప్రధాని సభ విశాఖలో అన్నారు.

దాంతో పాటుగా విశాఖలో మోడీ రోడ్ షో చేస్తారు అని కూడా ప్రచారం సాగింది. తీరా చూస్తే ఈ నెల 17న చిలకలూరిపేటలో సభ ఉంది. అది బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి సభగా ఉంది. దానికంటే ముందు ఈ నెల 15, 16 తేదీలలో ప్రధాని తెలంగాణా టూర్ పెట్టుకున్నారు. మరి మోడీ విశాఖ ఎపుడు వస్తారు అన్న చర్చ అయితే ఉంది.

మోడీ విశాఖ సభ ఈ నెల 16 అని అనుకుంటే దాని కంటే ఒక రోజు ముందు అంటే ఈ నెల 15 కాంగ్రెస్ సభ విశాఖలో పెట్టారు. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద భారీ సభను పెట్టారు. ఈ సభలో ఆయన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీద ప్రసంగం చేస్తూ కేంద్రం మీద నిప్పులు చెరగనున్నారు. దాంతో ఆ మరుసటి రోజే ప్రధాని సభ అంటే ఆ ప్రభావం పడుతుందని వాయిదా వేశారా అన్న చర్చ సాగుతోంది.

అసలు మోడీ సభ విశాఖలో ఉంటుందా లేదా అన్నది కూడా చర్చగా ఉంది. విశాఖకు మోడీ వస్తే స్టీల్ ప్లాంట్ ఇష్యూ మీద మాట్లాడాల్సి ఉంటుందని అంటున్నారు. అలాగే రైల్వే జోన్ విషయం కూడా ప్రస్తావించాల్సి ఉంటుంది. దాంతో విశాఖ సభ ఉండే చాన్స్ లేదని అంటున్నారు. ఎన్నికల ప్రచారం కూడా మోడీ కొన్ని కీలక కేంద్రాల్లో చేపడతారని ఉత్తరాంధ్రాను ఆయన టచ్ చేయకపోవచ్చు అంటున్నారు. ఒక వేళ వచ్చినా అనకాపల్లి నుంచే మోడీ సభ ఉంటుంది తప్ప విశాఖ లో ఉండదేమో అన్న సందేహాలూ వ్యక్తం చేస్తున్నారు. విశాఖ ఎంపీ సీటు కూడా బీజేపీకి కేటాయించకపోవడం వెనక స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఉండడమే అంటున్నారు.