Begin typing your search above and press return to search.

మోడీ వర్సెస్ రాహుల్ : లైట్ తీసుకుంటే అంతే...?

ఇదిలా ఉంటే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ మొనగాడుగా నిలబడుతుందని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అంటున్నారు.

By:  Tupaki Desk   |   17 Oct 2023 11:37 AM GMT
మోడీ వర్సెస్ రాహుల్ : లైట్ తీసుకుంటే అంతే...?
X

నరేంద్ర మోడీ ఇప్పటిదాకా చూసుకుంటే ముఖ్యమంత్రి ప్రధాని పదవులతో గత రెండు దశాబ్దాలుగా అధికారంలోనే ఉన్నారు. ఆయన రాజకీయాలు వ్యూహాలు నూటికి తొంబై శాతం సక్సెస్ అయ్యాయి. బీజేపీకి కల లాంటి సొంత మెజారిటీని రెడు సార్లు సాధించిన నరేంద్ర మోడీని ఎవరూ తక్కువ అంచనా కట్టలేరు. 2019లో బీజేపీ ఓడుతుందని అనుకుంటే చివరి నిముషంలో పాక్ మీద మెరుపు దాడులతో టోటల్ టర్న్ కుంది నేషనల్ పాలిటిక్స్.

ఈసారి కూడా సార్వత్రిక ఎన్నికలకు ఆరేడు నెలల సమయం ఉంది. దాని కంటే ముందు సెమీ ఫైనల్స్ గా అయిదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో చూసుకుంటే మూడు రాష్ట్రాలలో డైరెక్ట్ ఫైట్ బీజేపీ కాంగ్రెస్ ల మధ్యనే కేంద్రీకృతమై ఉంది. మరో రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలతో ఈ జాతీయ పార్టీలు ఢీ కొంటున్నాయి. ఇక అయిదు రాష్ట్రాలలో కనీసంగా మెజారిటీ స్టేట్స్ ని ఏ జాతీయ పార్టీ గెలుచుకుంటుందో ఆ పార్టీకి ఫైనల్స్ గా చెప్పబడే 2024 ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుంది అని ఒక అంచనా.

ఇదిలా ఉంటే అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ మొనగాడుగా నిలబడుతుందని ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ అంటున్నారు. కాంగ్రెస్ ని ఏ మాత్రం తక్కువ అంచనా వేయవద్దు అని కూడా ఆయన మిజోరాం నుంచి

మీడియా ముఖంగా బీజేపీకి గట్టిగా చెబుతున్నారు. బీజేపీకి ఎదురులేదనుకున్న చోట్ల తాము జెండా పాతిన సంగతిని ఆయన గుర్తు చేస్తున్నారు. కర్నాటకలో బీజేపీని ఓడించిన సంగతిని ఆయన చెబుతూ ఇదే తీరున అయిదు రాష్ట్రాలలో కాంగ్రెస్ హవా సాగుతుందని ధీమా వ్యక్తం చేయడం విశెషం.

తెలంగాణాలో కాంగ్రెస్ గాలి బలంగా వీస్తోందని అక్కడ తమ పార్టీ విజయభేరీ మోగించడం ఖాయమని రాహుల్ ధీమాగా చెబుతున్నారు. అదే విధంగా చత్తీస్ ఘడ్ లో బీజేపీ ఒకపుడు బలంగా ఉండేది, అలాంటి పార్టీని గత ఎన్నికల్లో ఓడించామని, ఈసారి ఎన్నికల్లో మరోసారి ఓడించబోతున్నామని రాహుల్ చెప్పుకొచ్చారు. అంతే కాదు రాజస్థాన్ లో బీజేపీ పటిష్టంగా ఉంది అంటారు. అలాంటి చోట కాంగ్రెస్ గతసారి ఎన్నికల్లో గెలిచింది. ఈసారి ఎన్నికల్లో సైతం గెలిచి చూపిస్తామని రాహుల్ అంటున్నారు.

ఇక మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి కాంగ్రెస్ గెలిచి తీరుతుందని రాహుల్ చెప్పేశారు. ఈశాన్య రాష్ట్రాలలో చూసుకుంటే కాంగ్రెస్ విజయ యాత్ర మిజోరాం నుంచే స్టార్ట్ అవుతుంది అని ఆయన అంటున్నారు. కాంగ్రెస్ ని తక్కువ అంచనా వేయవద్దు అని రాహుల్ చెప్పడం విశేషం. కాంగ్రెస్ ఫిలాసఫీని ఆ పార్టీ ఐడియాలజీ ఆలోచనలను ఎవరు తక్కువ చేసినా భంగపడాల్సిందే అని ఆయన బీజేపీకి స్వీట్ వార్నింగ్ లాంటిది ఇచ్చేశారు.

నిజానికి చూస్తే బీజేపీ ఇపుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ ని తక్కువ అంచనా ఏమీ వేయడం లేదు అంటున్నారు. ప్రధానంగా నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గా రేపటి ఎన్నికలు జరగనున్న నేపధ్యం ఉంది. గతం కంటే రాహుల్ అన్ని విధాలుగా తన నాయకత్వాన్ని తాను రుజువు చేసుకున్నారు. భారత్ జోడో యాత్ర తరువాత రాహుల్ లో చాలా మార్పు కనిపిస్తోంది. రాహుల్ గాంధీ స్పీచ్ కూడా మారింది. ఆయన వ్యూహాలు ఎత్తుగడలు కూడా మారాయి.

ఇండియా కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా రాజకీయంగా బీజేపీకి గట్టి సవాల్ విసిరిన కాంగ్రెస్ ఇపుడు బీజేపీ హిందూత్వ ఫిలసఫీని కూడా బిగ్ చాలెంజ్ చేస్తూ కుల గణన డిమాండ్ ని ముందుకు తీసుకుని వచ్చింది. ఇది నిజంగా బీజేపీకి మింగుడుపడని అంశమే. దేశంలో బీసీలు మైనారిటీలు ఓబీసీలు వంటి వారిని ఒక త్రాటి మీదకు తీసుకుని రావడం ద్వారా ఇండియా కూటమి పటిష్టమైన ఓటు బ్యాంక్ తో బీజేపీని ఢీ కొట్టాలని చూస్తోంది.

ఇక రాహుల్ చెప్పినట్లుగా అయిదు రాష్ట్రాలలో మెజారిటీ గెలిచినా కాంగ్రెస్ లెక్క చాలా వరకూ మారిపోతుంది అని అంటున్నారు. అయితే బీజెపీ రామమందిరాన్ని అలాగే రీసెంట్ గా పార్లమెంట్ లో ఆమోదించిన మహిళా రిజర్వేషన్ బిల్లుని నమ్ముకుంది. దాంతో మోడీ కూడా కాంగ్రెస్ ని లైట్ తీసుకోవడం లేదు అనే అంటున్నారు. చూడాలి మరి ఈ రెండు పార్టీల పోరు ఇద్దరు నేతల మధ్యన పొలిటికల్ వార్ సెమీ ఫైనల్స్ లో ఏ రకమైన రిజల్ట్స్ ని అందిస్తుందో.