Begin typing your search above and press return to search.

మోడీ వర్సెస్ రాహుల్ : దేశం మార్పు కోరుకుంటోందా !?

అంతే కాదు ఆహార ద్రవ్యోల్బణం అంతకంతకు అధికం అవుతూ వస్తోంది.

By:  Tupaki Desk   |   28 May 2024 5:17 PM GMT
మోడీ వర్సెస్ రాహుల్ : దేశం మార్పు కోరుకుంటోందా !?
X

పదేళ్ళ పాటు మోడీ పాలన చూసింది దేశం. అభివృద్ధి చేశామని బీజేపీ నేతలు చెబుతున్నారు. కానీ సగటు ప్రజనీకానికి భారాలు బాగానే పడ్డాయి. గ్యాస్ బండ నుంచి పెట్రోల్ డీజీల్ వరకూ రేట్లు అమాంతం పెరిగాయి. అంతే కాదు ఆహార ద్రవ్యోల్బణం అంతకంతకు అధికం అవుతూ వస్తోంది. ఏమి కొనేటట్లు లేదు తినేటట్లు లేదు అన్న పరిస్థితి ఉంది.

బీజేపీ ఎన్నికల్లో ప్రచార ఆస్త్రాలుగా చేసుకున్న వాటిని తమ విజయాలుగా చెప్పుకుంటున్న వాటిని చూస్తే సాధారణ ప్రజానీకానికి అవి ఎంతవరకూ కనెక్ట్ అయ్యాయి అనిపించకమానదు అంటున్నారు విశ్లేషకులు. 370 ఆర్టికల్ ని రద్దు చేయడం, ట్రిపుల్ తలాఖ్ రాముల వారి ఆలయం అయోధ్యలో కట్టడం మంచిదే. వీటిని ఎవరూ కాదని అనరు.

కానీ వీటితో పాటే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అందులో సగం నెరవేర్చినా బాగుండేది అన్న మాట ఉంది. అలాగే మధ్యతరగతి పేద వర్గాలకు ఊరటను ఇచ్చే చర్యలు అయితే ప్రతిసారీ ప్రవేశపెట్టిన పెద్దగా బడ్జెట్ లో లేవు అనే అంటున్నారు.

ఆర్ధిక వృద్ధి రేటు కూడా అనుకున్న స్థాయిలో పుంజుకోలేదన్న మాట ఉంది. దీంతో మళ్లీ అధికారంలోకి వస్తే ఏమి చేస్తామన్న దాని మీద బీజేపీ చెప్పేది ఏంటి అంటే జాతీయ వాదం గురించే. ఎంతసేపూ జాతీయ వాదాన్నే నమ్ముకుని ముందుకు పోతున్నారు తప్ప సగటు జీవితాలను ప్రభావితం చేసే అంశాలను అందుకుని వాటిని తాము అజెండాలో పెడతామని చెప్పడం లేదు.

మరో వైపు చూస్తే రాహుల్ గాంధీ చాలా విషయాలు చర్చించారు. కాంగ్రెస్ మానిఫేస్టోలో కూడా పేదలు మధ్య తరగతి వర్గాకలు ఊరటను ఇచ్చే హామీలు ఉన్నాయి. ఉద్యోగాల విషయంలో వారికి హామీ ఉంది. ఆర్మీలో అగ్ని పధ్ లాంటి టెంపరరీ జాబ్స్ కాకుండా వాటిని రద్దు చేసి పూర్తి అవకాశాలు ఇస్తామని కూడా చెప్పుకొచ్చారు. అలాగే అనేక కీలక హామీలతో ధరాభారాలు తగ్గిస్తామని కూడా చెప్పారు. మొత్తానికి చూస్తే ఈ దేశంలో నూటికి తొంబై శాతం ఉండే సామాన్యుడు మధ్యతరగతి వర్గాలు కోరుకుంటున్న అంశాలతో కాంగ్రెస్ ప్రచారం చేసింది.

ఇక రెండు సార్లు చాన్స్ మోడీకి బీజేపీకి ఇచ్చిన దేశం ఈసారి రాహుల్ వైపు చూస్తుందా అన్న చర్చ కూడా మొదలైంది. భారత్ జోడో యాత్రలో రాహుల్ సామాన్య ప్రజల్లో కనెక్ట్ అయిన విధానం ఆ మీదట ఆయన ప్రసంగాలలో వచ్చిన మార్పు, 2014 నాటికి 2024 నాటికి రాహుల్ మోడీని రాజకీయంగా ఢీ కొట్టిన తీరులో వచ్చిన మౌలికమైన మార్పులు ఇవ్వన్నీ జనంలో చర్చగా ఉన్నాయి.

ఈసారి ఇండియా కూటమికి ఒక్క చాన్స్ ఎందుకు ఇవ్వకూడదు అన్నది ఉత్తరాదిన కొంత వినిపిస్తుంది అని అంటున్నారు. సౌత్ ఇండియాలో ఎటూ ఇండియా కూటమికి బలం ఉంది. కేరళ, తమిళనాడు, కర్నాటక, తెలంగాళాలో కలుపుకుంటే ఇండియా కూటమికి 80కి పైగా ఎంపీ సీట్లు రావచ్చు అని ఒక అంచనా ఉంది.

ఇక ఉత్తరాదిన మహారాష్ట్ర, బీహార్ యూపీ ఉత్తరాఖండ్ రాజస్థాన్ లలో కూడా కూటమికి ఆదరణ మొదలైంది అని అంటున్నారు. యూపీలో ఈసారి కనీసంగా ఇరవై నుంచి పాతిక దాకా ఎంపీ సీట్లు ఇండియా కూటమి సాధిస్తుంది అని లెక్క వేస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్ మహారాష్ట్రలలో కూడా బీజేపీకి గట్టి దెబ్బ పడుతుందని అంటున్నారు.

మరో వైపు చూస్తే యూపీలో బీజేపీకి 2019 నాటికే 80 సీట్లకు 62కి నంబర్ పడింది. ఇది 2014లో వచ్చిన 71 సీట్లకు తొమ్మిది తక్కువ. ఈసారి కూడా తగ్గుతుంది అని అంటున్నారు. బీహార్ లో కూడా 2019 నాటికే సీట్లు తగ్గాయి. ఈసారి ఇండియా కూటమి సవాల్ చేస్తోంది అని అంటున్నారు.

ఇవన్నీ చూసిన మీదట ఇండియా కూటమికి 200 కంటే ఎక్కువ ఎంపీలు వచ్చే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఢిల్లీ పంజాబ్ హర్యానా రాజస్థాన్, మధ్యప్రదేశ్ లలో కూడా ఇండియా కూటమికి కొంత అనుకూలంగా ఉందని అంటున్నారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ గత ఏడాది అధికారంలోకి వచ్చింది. ఆ హవా కొనసాగుతోంది. అసోం లో బీజేపీ వ్యతిరేకత కాంగ్రెస్ కి అనుకూలం కానుంది.

ఇవన్నీ చూసినపుడు కాంగ్రెస్ సెంచరీ ని కొట్టడం ఖాయమనే అంటున్నారు. కాంగ్రెస్ వంద, కూటమిలోని ఇతర పార్టీలు మరో వందా సీట్లు తెచ్చుకుంటే మాత్రం ఈసారి ఢిల్లీ పీఠం మీద పందెం కాయడం ఖాయమని అంటున్నారు.

మెల్లగా దేశంలో మార్పు కనిపిస్తోంది అని అది ఇండియా కూటమి విజయం మీద ప్రభావం చూపిస్తే ఎంపీ సీట్లు ఇంకా పెరిగినా ఆశ్చర్యం లేదు అంటున్నారు. దేశంలో మార్పు రావాలని కేంద్రంలో కొత్త ప్రభుత్వం రావాలన్నది అంతర్లీనంగా ఉన్న ఒక భావన అని అంటున్నారు. అది ఓట్ల రూపంలో ఎంతవరకూ టర్న్ అయింది అన్న దానిని బట్టే జూన్ 4 తరువాత దేశ రాజకీయ ముఖ చిత్రం మారుతుంది అని అంటున్నారు.