మోడీ వాట్సాప్ ప్రచారానికి బ్రేక్.. రీజనేంటంటే!
`వికసిత భారత` పేరుతో జరుగుతున్న ఈ వాట్సాప్ ప్రచారం జోరుగా సాగుతోంది.
By: Tupaki Desk | 22 March 2024 3:49 AM GMTవచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కాలని తపిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ.. తన హయాంలో ప్రవేశ పెట్టిన అనేక పథకాలను గత నాలుగు రోజులుగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తున్నారు. దీనిపై కొందరు నేరుగా విమర్శలు చేస్తున్నారు. విషయం ఏంటంటే.. ప్రధాన మంత్రి గత పదేళ్ల కాలంలో ప్రవేశ పెట్టిన పథకాలకు సంబంధించి.. దేశవ్యాప్తంగా అన్ని పోన్లకు వాట్సాపుల్లో మెసేజ్‌లు చేస్తున్నారు.
`వికసిత భారత` పేరుతో జరుగుతున్న ఈ వాట్సాప్ ప్రచారం జోరుగా సాగుతోంది. దేశంలోనే కాకుండా విదేశాల్లోని వారికి కూడా మెసేజ్‌లు పంపుతూ.. ఎన్నారై ఓటర్లను కూడా ప్రభావితం చేస్తున్నారనే వాదన బలంగా వినిపించింది. తాజాగా దుబాయ్ నుంచి 10 మంది ఎన్నారైలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం.. ప్రధాని నరేంద్ర మోడీ పేరుతో వాట్సాపుల్లో జరుగుతున్న 'వికసిత భారత్' ప్రచారానికి బ్రేక్ వేసింది.
దేశంలో ఎన్నికల నియమావళి అమల్లోకి రావడంతో వాట్సాప్ లో వికసిత భారత్ సందేశాలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేకులు వేసింది. సోషల్ మీడియాలో వికసిత భారత్ ప్రచారాన్ని ఆపేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖకు నోటీసులు పంపింది.
కోడ్ అమల్లో ఉన్న సమయంలో సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేయడం నిబంధనలకు వ్యతిరేకం అని స్పష్టం చేసింది. దేశంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా సోషల్ మీడియాలో, ముఖ్యంగా వాట్సాప్ లో వికసిత భారత్ సందేశాలు వస్తున్నాయని ఈసీకి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే ఈసీ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. అయితే.. దీనికినిర్దిష్ట గడువు విధించకపోవడం గమనార్హం. కానీ, ఆదేశాలు మాత్రం తక్షణమే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.