కాంగ్రెస్ రికార్డును బ్రేక్ చేయనున్న మోడీ.. నిజమేనా?
దేశంలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి.
By: Tupaki Desk | 27 May 2024 5:30 PM GMTదేశంలో సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొన్ని రికార్డులు కూడా ఉన్నాయి. ఆ రికార్డులను ఇప్పటి వరకు ఎవ రూ అధిగమించలేదు. దేశానికి స్వాతంత్య్రంవచ్చి 75 ఏళ్లు గడిచిపోయినా.. అనేక పార్టీలు.. అనేక మంది నాయకులు కేంద్రంలో చక్రం తిప్పినా.. కాంగ్రెస్ కు ఉన్నరెండు కీలక రికార్డులను మాత్రం చెరపలేకపోయారు. అవే.. వరుసగా కాంగ్రెస్ పార్టీ మూడు సార్లు గెలుపు గుర్రం ఎక్కడం. రెండోది.. వరుసగా మూడు సార్లు తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ.. ప్రధాని పీఠం అధిరోహించడం. ఈ రెండు రికార్డులను కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు పదిలంగా కాపాడుకుంది.
అయితే.. ఇప్పుడు ఈ కాంగ్రెస్ రికార్డును ఛేదించేందుకు.. బీజేపీ విస్తృతంగా ప్రయత్నాలు చేసింది. ఇప్పటి వరకు బీజేపీ కేంద్రం లో మొత్తం నాలుగు సార్లు విజయం దక్కించుకుంది. వాజపేయి హయాంలో రెండు సార్లు , మోడీ హయాంలో రెండు సార్లు గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. వరుసగా మూడు సార్లు మాత్రం బీజేపీ అధికారంలోకి రాలేదు. కానీ, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో వరుసగా మూడో సారి విజయం దక్కించుకునేందుకు ప్రధాని మోడీ.. సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దేశవ్యాప్తంగా గతంలో ఏ ప్రధానీ చేయనంత ప్రచారం చేస్తున్నారు.
క్షణం కూడా వృధా కాకుండా..ప్రధాని మోడీ ఇంటర్వ్యూలు, ఇంటరాక్షన్‌లు, సభలు, సమావేశాలు.. ప్రసంగాలు.. ట్వీట్లు.. ఇలాం టి ఏ సందర్భాన్నీ ఆయన వదులు కోవడం లేదు. చాలా వేగంగా చాలా విస్తృతంగా ఆ సేతు హిమాచలం ఆయన పర్యటించారు. ఏ ప్రాంతాన్నీ ఆయన వదిలి పెట్టలేదు. ఏ విషయాన్నీ కూడా ఆయన వదులు కోలేదు. మొత్తంగా ఆయన తోపాటు.. బీజేపీ అగ్రనేతలు కూడా ప్రచారం చేశారు. దీంతో బీజేపీ వరుసగా మూడోసారి అదికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందనే సూచనలు.. సర్వేలు కూడా వస్తున్నాయి. ఇదే జరిగితే.. ఇప్పటి వరకు కాంగ్రెస్ పేరుతో ఉన్న మూడు సార్లు అధికారంలోకి వచ్చిన రికార్డును బీజేపీ బ్రేక్ చేసినట్టు అవుతుంది.
ఇక, నెహ్రూ వరుసగా.. మూడు సార్లు ప్రధాని అయ్యారు. 1947-1964 వరకు ఆయనే ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత.. ఆయన కుమార్తె ఇందిరమ్మ కూడా.. దేశాన్ని పాలించినా.. ఈ రికార్డును సాధించలేక పోయారు. ఇక, రాజీవ్ కూడా.. ఒక్కసారికే పరిమి తమయ్యారు. ఆ తర్వాత.. వరుస ప్రధానులు మారిపోయారు. దీంతో ఎవరూ కూడా నెహ్రూ రికార్డును సమం చేయడం అనేది చేయలేదు. ఇప్పుడు ఈ రికార్డును ప్రధాని నరేంద్ర మోడీ బ్రేక్ చేయనున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఆయనే మరోసారి ప్రధాని కానున్నారు. 2014, 2019 తర్వాత.. వరుసగా 2024లోనూ మోడీ ప్రధాని అయితే.. ఇక, నెహ్రూ పేరుతో ఉన్న రికార్డు ను ఆయన సమం చేసినట్టు అవుతుంది. ప్రస్తుతం బీజేపీ ఈదిశగానే వడివడిగా అడుగులు వేస్తుండడం గమనార్హం.