Begin typing your search above and press return to search.

పద్మశ్రీ మొగులయ్యకు ఇంత కష్టమా! ?

నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లింగాల మండలం అవుసలికుంట గ్రామానికి చెందిన మొగులయ్య 52 దేశాల ప్రతినిధుల ముందు తన 12 మెట్ల కిన్నెర గానంతో ప్రదర్శనలను ఇచ్చాడు.

By:  Tupaki Desk   |   3 May 2024 7:23 AM GMT
పద్మశ్రీ మొగులయ్యకు ఇంత కష్టమా! ?
X

అరుదైన సంగీత వాద్యం.. కిన్నెరతో అద్భుతమైన సంగీతాన్ని సృజియించి కేంద్ర ప్రభుత్వం నుంచి 2022లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం పొందిన కిన్నెర మొగులయ్య గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎక్కడో మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన కిన్నెర వాద్య కళాకారుడు అయిన మొగులయ్యను మీడియా వెలుగులోకి తీసుకురావడం.. జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ తన భీమ్లా నాయక్‌ లో పాట పాడే అవకాశం ఇవ్వడంతో మొగులయ్య కీర్తి పెరిగిపోయింది.

ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని మొగులయ్యకు ప్రకటించింది. అలాగే అప్పటి కేసీఆర్‌ ప్రభుత్వం కోటి రూపాయలను గ్రాంటుతోపాటు రంగారెడ్డి జిల్లాలో ఆయనకు ఇళ్ల స్థలాన్ని కూడా మంజూరు చేస్తున్నట్టు ప్రకటించింది.

అలాంటి అరుదైన సంగీత కళాకారుడు ఇప్పుడు దినసరి కూలీగా మారాడనే వార్త హాట్‌ టాపిక్‌ గా మారింది. సోషల్ మీడియా లో ఒక పోస్ట్ ప్రకారం ఆయన హైదరాబాద్‌ సమీపంలోని తుర్కయమంజాల్‌ లోని ఓ నిర్మాణ స్థలంలో పని చేస్తూ కనిపించారని కొన్ని ఫొటోలు వైరల్‌ గా మారాయి.

ప్రతి నెలా తనకు అందే పది వేల రూపాయల గౌరవ వేతనం ఆగిపోయిందని.. అందుకే కూలి పనులు చేయకతప్పడం లేదని మొగులయ్య చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. తన వాద్య కళను అందరూ మెచ్చుకున్నప్పటికీ ఎవరి నుంచి సాయం అందలేదని ఆయన అన్నట్టు టాక్‌ నడుస్తోంది.

కేసీఆర్‌ ప్రభుత్వం అందిస్తానన్న కోటి రూపాయల గ్రాంటు, ఇళ్ల స్థలం కూడా ఇంకా పెండింగులోనే ఉన్నాయని అంటున్నారు. దీంతో మొగులయ్యకు ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయని చెబుతున్నారు.

మొగులయ్య కుమారుల్లో ఒకరు మూర్చ వ్యాధితో బాధపడుతున్నారని, అతడి మందులకే నెలకు కనీసం 7 వేల రూపాయల ఖర్చు అవుతున్నాయని.. దీంతో డబ్బులు చాలక కూలిపనులకు వెళ్తున్నట్టు ఆయన చెప్పినట్టు టాక్‌ వినిపిస్తోంది.

ప్రతి నెలా తనకు ప్రభుత్వం నుంచి అందుతున్న పది వేల గౌరవ వేతనం కూడా ఆగిపోయిందని.. దీంతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో కూలి పనులకు వెళ్తున్నట్టు మొగులయ్య ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన నిజంగా కూలి పనులకు వెళ్తున్నారా లేదా అనేది తెలియాల్సి ఉంది.