భూమివ్వకుంటే భూమ్మీదే లేకుండా చేయండి.. అరబ్ రాజు కర్కశం
సహజంగానే దీనికి అడ్డంకులు వస్తున్నాయి. అయితే, వాటిని కర్కశంగా అణిచివేస్తోంది
By: Tupaki Desk | 9 May 2024 12:30 PM GMTభవిష్యత్ అంతా గ్రీన్ ఎనర్జీదే.. పర్యావరణానికి ఏమాత్రం హాని కలగని కారణంగా.. ఇంధన వనరుల వాడకాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలు ఆలోచిస్తున్నాయి. మరోవైపు వాడకం పెరగడమే కాక పలు కారణాలతో అన్ని దేశాల్లోనూ పెట్రొల్ నిల్వలు గణనీయంగా పడిపోతున్నాయి. ఇది అన్నిటికంటే గల్ఫ్ దేశాలకు చాలా ప్రమాదకర సంకేతం. దీంతోనే ఆయా దేశాలు తమ ఆదాయం తగ్గకుండా ప్రత్యామ్నాయాల వైపు ఆలోచిస్తున్నాయి. ఇలానే గల్ఫ్ లో అతి పెద్దదైన సౌదీ అరేబియా అతి పెద్ద ప్రాజెక్టును తలపెట్టింది. సహజంగానే దీనికి అడ్డంకులు వస్తున్నాయి. అయితే, వాటిని కర్కశంగా అణిచివేస్తోంది.
‘నియోమ్’.. సౌదీ అరేబియా చేపట్టిన అతి భారీ ప్రాజెక్టు. ఒక విధంగా చెప్పాలంటే అది ఆ దేశ యువరాజు చిరకాల స్వప్నం. భవిష్యత్ దేశమంతటి నగరం. కానీ, దీనికి ఎవరు అడ్డుగా నిలిచినా ప్రాణాలతో విడిచిపెట్టవద్దని హెచ్చరించడమే వివాదాస్పదం అవుతోంది. నియోమ్ కు భూ సేకరణకు సహకరించకపోతే అసలు కనికరించవద్దని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్) ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
అదొక స్మార్ట్ సిటీ..
అన్ని వనరులు ఒకేచోట.. అంతా ఒక క్రమ పద్ధతిలో.. ఇలాంటి పరిస్థితులు ఉన్న నగరాలనే స్మార్ట్ సిటీలు అంటారు. నియోమ్ అలాంటిదే. అయితే, అత్యంత ఖర్చు. అతి భారీతో కూడినది. వాస్తవానికి 50-60 ఏళ్ల కిందట సౌదీ సహా అరబ్ దేశాలు సంపన్నమైనవి ఏమీ కాదు. ఎప్పుడైతే పెట్రోల్ నిల్వలు బయటపడ్డాయో.. అప్పుడు వాటి దశ తిరిగింది. ఇలానే సౌదీ అరేబియాలో పెట్రోల్ నిల్వలు వెలుగులోకి వచ్చాయి. ఎంత సహజ వనరులైనా ఎప్పటికైనా తరిగిపోక తప్పదు కదా..? ఇప్పుడదే పరిస్థితి. సౌదీలో పెట్రోల్ నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. మిగతా ప్రపంచం అంతా కూడా చమురు నుంచి గ్రీన్ ఎనర్జీ వైపు మళ్లిపోతోంది. దీంతో సౌదీకి మున్ముంద ఆదాయం పడిపోనుంది. ఈ నేపథ్యంలోనే సౌదీ పాలకులు మేల్కొన్నారు.
పర్యటక దేశంగా మార్చేందుకు..
సౌదీ సంప్రదాయ ముస్లిం దేశమే అయినా ఛాందస వాదం నుంచి బయటపడుతోంది. ఇప్పుడు పెట్రోల్ నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో నియోమ్ ను నిర్మించి పర్యాటక ప్రదేశం, గ్లోబల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు సిద్ధమయ్యారు. ఎంబీఎస్ మానస పుత్రిక అయిన నియోమ్ కు 500 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్ కేటాయించారు. దీనికోసం ఎర్ర సముద్ర తీరంలో 26,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 రకాల రీజియన్లు.. అందులో ఫ్లోటింగ్ పోర్ట్, స్కై రిసార్టులు, సర్వాట్ పర్వతాలపై నిర్మాణాలు, మిర్రర్డ్ సిటీ వంటివి నిర్మించనున్నారు. అందులోనూ ‘ది లైన్’ పేరిట తలపెట్టినది అత్యంత కీలకమైన నిర్మాణం.
రెండేళ్లలోనే 4.5 లక్షల జనాభా
నియోమ్ ల్ లైన్ ప్రాజెక్టును 100 మీటర్ల ఎత్తు, 200 మీటర్ల వెడల్పుతో 170 కిలోమీటర్ల పొడవునా నిర్మించనున్నారు. దాదాపు 90 లక్షలమంది నివసించేలా చేపట్టారు. త్రీడీ కమ్యూనికేషన్లు.. ప్రజలకు ఐదు నిమిషాల్లో నిత్యావసరాలు దొరికే వెసులుబాటు.. కృత్రిమ మేధ సేవలు లభిస్తాయి. ది లైన్ నిర్మాణంలో అంతా అద్దాల వినియోగమే. 2026 నాటికి నియోమ్‌లో 4.5 లక్షల మంది, 2030 నాటికి 20 లక్షల జనాభా ఉంటారని అంచనా. నియోమ్ లో
ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి కేంద్రం.. 100 శాతం పునరుత్పాదక ఇంధనం వినియోగం.. జీరో ఉద్గారాలు, పాజిటివ్ కార్బన్ వాతావరణం ఉండేట్లు చూస్తారు. వర్చువల్ ఫార్మింగ్, గ్రీన్ హౌస్ ల ద్వారా ఆహారాన్ని స్థానికంగా ఉత్పత్తి చేయనున్నారు. సర్వత్ పర్వతాలపై ట్రోజెనాలో 2029 ఆసియా వింటర్ గేమ్స్ నిర్వహించనుండడం మరో ప్రత్యేకత.
భూమి అడిగితే ఇవ్వాల్సిందే..
అత్యంత కీలకమైన ది లైన్ ప్రాజెక్టు 2030 నాటికి అంటే 4.5 లక్షల జనాభా ఉండే వేళకు 2.4 కిలోమీటర్ల మేర మాత్రమే నిర్మాణం పూర్తవుతుందనే అంచనాలున్నాయి. కారణం.. చాలా భూసేకరణ అవసరం. ఈ నేపథ్యంలో మూడు గ్రామాలను ఖాళీ చేసేందుకు 2020లో సౌదీ బలగాలు తీవ్ర ప్రయత్నం చేశాయి. స్థానిక హువైటీ తెగ వారిపై దమనకాండకూ దిగాయి. ఈ తెగకు చెందిన అబ్దుల్ రహీం అల్ హువైటీ తన భూమిలోకి అధికారులను రానీయలేదు. అతడిని మర్నాడే దళాలు కాల్చేశాయి. అనంతరం ఆందోళనలు జరగ్గా 47 మంది గ్రామస్థులను అరెస్టు చేసి ఉగ్ర నేరాలు మోపారు.
వీరిలో ఐదుగురికి మరణశిక్ష విధించడం గమనార్హం. హువైటీ అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నందుకే డజన్ల మందిని అరెస్టు చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
బయటపెట్టింది ఎవరంటే..?
నియోమ్ విషయంలో దాగిన దారుణాలను సౌదీ మాజీ కర్నల్ రభిహ్ ఎలెన్జీ ప్రముఖ మీడియా బీబీసీకి తెలిపాడు. ఏడాది నుంచి ఆయన యూకేలో శరణార్థిగా ఉంటున్నాడు. ఇప్పడు ఎలెన్డీకీ ప్రాణ భయం పట్టుకుంది. లండన్ లోని సౌదీ దౌత్య కార్యాలయానికి రావాలని అతడికి ఆదేశాలు వెళ్లాయి. ఇంకా అతడు అక్కడికి వెళ్లలేదు. వెళ్తే.. ఏం జరుగుతుందో తెలుసు కాబట్టి.