Begin typing your search above and press return to search.

జర్నలిస్టుకు మోహన్ బాబు క్షమాపణలు... లేఖ విడుదల!

ఈ ఘటనలో మీడియా ప్రతినిధులపైనా దాడి జరగగా.. అందులో ఓ జర్నలిస్టు తీవ్రంగా గాయపడిన పరిస్థితి.

By:  Tupaki Desk   |   13 Dec 2024 4:52 AM GMT
జర్నలిస్టుకు మోహన్  బాబు క్షమాపణలు... లేఖ విడుదల!
X

మంగళవారం నాడు జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద జరిగిన ఉద్రిక్తత తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మీడియా ప్రతినిధులపైనా దాడి జరగగా.. అందులో ఓ జర్నలిస్టు తీవ్రంగా గాయపడిన పరిస్థితి. దీంతో.. తీవ్ర నిరసనలు తెరపైకి వచ్చింది. ఈ సమయంలో మోహన్ బాబు స్పందించారు.

అవును... జల్ పల్లిలోని తన నివాసం వద్ద మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. దీనిపై గురువారం రాత్రి మోహన్ బాబు ఆడియో విడుదల కాగా.. ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు! ఈ సమయంలో తాజాగా ఓ లేఖ విడుదల చేశారు.

ఇందులో భాగంగా... ఇటీవల జరిగిన దురదృష్టకర సంఘటనను అధికారికంగా ప్రస్తావించడంపై విచారం వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాస్తున్నాను.. అని మొదలుపెట్టిన మోహన్ బాబు... "వ్యక్తిగత కుటుంబ వివాదంగా మొదలై.. తీవ్ర ఘర్షణకు దారి తీసింది.. ఈ ఘటనలో జర్నలిస్ట్ సోదరుడికి బాధ కలిగించినందుకు నాకు కూడా బాధగా ఉంది!" అన్నారు.

"ఇది జరిగిన తర్వాత అనారోగ్య కారణాల వల్ల 48 గంటల పాటు ఆస్పత్రిలో ఉండటం వల్ల వెంటనే స్పందించలేకపోయాను.. నేను అతడి సహనాన్ని అభినందిస్తున్నాను.. ఆ రోజు నా ఇంటి గేటు విరిగిపోయి సుమారు 30 నుంచి 50 మంది వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు.. దీంతో నేను సహనాన్ని కోల్పోయాను" అని అన్నారు.

"ఈ గందరగోళం మధ్య మీడియా ప్రతినిధులు అనుకోకుండా వచ్చారు. నేను పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించాను.. ఈ ప్రయత్నంలో ఒక జర్నలిస్టుకు గాయమైంది.. ఇది చాలా దురదృష్టకరం.. అతడికి, అతడి కుటుంబానికి, అతడి సంస్థకు కలిగిన బాధకు నేను తీవ్రంగా చింతిస్తున్నాను.. హృదయపూర్వకంగా క్షమించమని కోరుతున్నాను.. త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను" అని మోహన్ బాబు లేఖలో రాశారు!

కాగా... మంగళవారం రాత్రి మోహన్ బాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అదనపు డీజీపీని కలిసిన అనంతరం మనోజ్ దంపతులు మోహన్ బాబు నివాసానికి చేరుకోగా.. సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో.. గేట్లు బలవంతంగా తోసుకుని లోపలికి వెళ్లారు. ఆయనతో పాటు అక్కడున్న మీడియా సిబ్బంది లోపలికి వెళ్లారు.

ఈ ఉద్రిక్తతల నడుమ మోహన్ బాబు తీవ్ర అసహనానికి గురయ్యారు.. అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. కొందరు ప్రతినిధులపై ఆయన చేయిచేసుకున్నారు! దీంతో... టీవీ9 జర్నలిస్టుకు తీవ్ర గాయమైంది. దీంతో.. మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదయ్యింది!