ఆసక్తికర పరిణామం... జర్నలిస్టును కలిసి సారీ చెప్పిన మోహన్ బాబు!
ఈ నెల 10వ తేదీ మంగళవారం రాత్రి జల్ పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనలో జర్నలిస్ట్ రంజిత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Dec 2024 4:21 PM GMTఈ నెల 10వ తేదీ మంగళవారం రాత్రి జల్ పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘటనలో జర్నలిస్ట్ రంజిత్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆవేశంతో ఊగిపోయిన మోహన్ బాబు.. సదరు జర్నలిస్టుపై దాడి చేశారు. దీంతో... మీడియా ప్రతినిధులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మరోపక్క పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు.
ఈ సమయంలో స్పందించిన మోహన్ బాబు.. తాను కొట్టింది జర్నలిస్టునో, మరో వ్యక్తినో తనకు తెలియదని.. జర్నలిస్టు అని తెలిసి చేయి చేసుకోవడానికి తానేమైనా మూర్ఖుడినా అని అంటూ స్పందించారు. మరోపక్క కోర్టులో మోహన్ బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టును నేరుగా కలిసి సారీ చెప్పారు ఎంబీ!!
అవును... మోహన్ బాబు ఇంటివద్ద జరిగిన ఘటనలో జర్నలిస్టు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా మోహన్ బాబు యశోదా ఆస్పత్రికి వెళ్లి.. తన దాడిలో గాయపడిన జర్నలిస్టును పరామర్శించారు.
ఈ సందర్భంగా 'జర్నలిస్టు సమాజానికి' సారీ చెప్పాలని రంజిత్ కోరగా.. మోహన్ బాబు ఈ మేరకు జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణలు చెప్పారు! ఇదే సమయంలో దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారని అంటున్నారు. ఈ సందర్భంగా ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యులను క్షమాపణ కోరినట్లు తెలుస్తోంది.
అనంతరం... రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మోహన్ బాబు. అనంతరం మోహాన్ బాబు సదరు జర్నలిస్టు కుటుంబంతో ఫోటో దిగారు! ఈ సమయంలో మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో ఉన్నారు! దీంతో... ఈ వ్యవహారం కాస్త సద్దుమణిగినట్లేనా అనే చర్చ మొదలైంది.
కాగా... మోహన్ బాబు దాడిలో తీవ్రంగా గాయపడిన జర్నలిస్టు రంజిత్ కు వైద్యులు సర్జరీ నిర్వహించారు. దెబ్బతిన్న జైగోమాటిక్ ఎముకను సరిచేశారని అంటున్నారు. ఈ నేపథ్యంలో మరో మూడు నాలుగు రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నారని తెలుస్తోంది.