Begin typing your search above and press return to search.

మోహన్ బాబు సారీ చెప్పటమా? అదే అసలు కారణమా?

నలుగురు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగే మాటల్లో ‘మనిషివా.. మోహన్ బాబువా’ అన్న మాట ఓకే.

By:  Tupaki Desk   |   16 Dec 2024 5:10 AM GMT
మోహన్ బాబు సారీ చెప్పటమా? అదే అసలు కారణమా?
X

నలుగురు ప్రైవేటు వ్యక్తుల మధ్య జరిగే మాటల్లో ‘మనిషివా.. మోహన్ బాబువా’ అన్న మాట ఓకే. కానీ.. ఒక ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్ ఇదే మాటను.. తాటికాయంత అక్షరాలతో బ్రేకింగ్ న్యూస్ వేస్తూ వేయటమే అసాధారణం. అందుకు కారణం.. తమ సంస్థలో పని చేసే జర్నలిస్టుపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు చానల్ మైకును పట్టుకొని బలంగా కొట్టటమే. ఆ దెబ్బకు సదరు జర్నలిస్టుకు తీవ్రగాయం కావటమే కాదు.. రోజుల తరబడి ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స చేయించుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే సదరు గాయానికి సంబంధించిన సర్జరీలు జరిగాయి.

ఏం జరిగినా.. ఎంత జరిగినా.. తాను మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరించే సినీ నటుల్లో మోహన్ బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఆయన మొండితనానికి చాలామంది తగ్గిపోతుంటారు. తాజా ఉదంతంలో మాత్రం ఆయనే తగ్గాల్సి వచ్చింది. తన కుటుంబ సభ్యుల మధ్య జరుగుతున్న రచ్చను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా ప్రతినిధిపై అసాధారణ రీతిలో దాడి చేసిన మోహన్ బాబు తీరుపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది.

ఇదిలా ఉంటే.. ఆదివారం తన కొడుకు మంచు విష్ణుతో కలిసి మోహన్ బాబు యశోదా ఆసుపత్రికి వెళ్లారు. తాను చేసిన దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న జర్నలిస్టు రంజిత్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా క్షమాపణలు చెప్పారు. రంజిత్ కుమార్తె.. ఇతర కుటుంబ సభ్యులకు కూడా మోహన్ బాబు క్షమాపణలు చెప్పారు. ఆ రోజు జరిగిన ఘటనకు తాను బాధ పడుతున్నానని.. అలా జరిగి ఉండాల్సింది కాదని.. తప్పు తనదేనని రంజిత్ తో మోహన్ బాబు పేర్కొన్నారు.

క్షమించమని అడగటం తప్ప.. మరేమీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నానని పేర్కొన్న మోహన్ బాబు.. ఈ సందర్భంగా రంజిత్ కుమార్తెను అప్యాయంగా దగ్గరకు తీసుకొని ఎత్తుకున్నాను. ‘సారీ తల్లి..నా వల్లే మీ నాన్నకు ఈ పరిస్థితి వచ్చింది’ అని పేర్కొన్నారు. అనంతరం రంజిత్ కుటుంబ సభ్యులతో మాట్లాడి అతడి ఆరోగ్య పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. రెండు కాళ్లకు.. భుజాలు.. కళ్లకు సర్జరీ చేయించుకున్న తనకు సర్జరీ బాధ ఎలా ఉంటుందో తెలుసన్న ఆయన.. రంజిత్ త్వరగా కోలుకోవాలని పేర్కొన్నారు. రంజిత్ కు ఎలాంటి సాయం చేయటానికైనా సిద్ధమనన హామీని ఇవ్వటం వెనుక కారణం ఏమిటి? ఇంత హటాత్తుగా రంజిత్ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి మరీ పేరు పేరునా క్షమాపణలు చెప్పటానికి కారణం ఏమిటన్నదిచూస్తే.. హైకోర్టులో ఉన్న బెయిల్ పిటిషన్ విషయంలో ఏ మాత్రం తేడా కొట్టినా.. అరెస్టు కావాల్సి ఉంటుంది. అందుకే.. తన సారీతో అరెస్టు ముప్పు నుంచి బయటపడేందుకు ఇంత భారీగా సారీలు చెప్పేందుకు వెనుకాడటం లేదన్న మాట వినిపిస్తోంది. మోహన్ బాబు విషయంలో చట్టం ఏం చేస్తుందో చూడాలి.