Begin typing your search above and press return to search.

మీడియాపై దాడి... మోహన్ బాబుకి బిగ్ షాకిచ్చిన పోలీసులు!

జల్ పల్లిలోని తన నివాసం వద్ద మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Dec 2024 5:15 PM GMT
మీడియాపై దాడి... మోహన్ బాబుకి బిగ్ షాకిచ్చిన పోలీసులు!
X

జల్ పల్లిలోని తన నివాసం వద్ద మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసిన మోహన్ బాబు... కొందరు మీడియా ప్రతినిధులపై చేయి చేసుకున్నారని అంటున్నారు. ఈ సమయంలో మోహన్ బాబు బౌన్సర్ల దాడిలో కెమెరామెన్ కిందపడిపోయారని తెలుస్తోంది.

ఆ సమయంలో ఆగ్రహంతో ఊగిపోయిన మోహన్ బాబు.. మీడియా ప్రతినిధుల చేతుల్లోని మైకులు బలవంతంగా లాక్కునారని.. వాటిని నేలకేసి కొట్టారని అంటున్నారు. దీంతో... మీడియా జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మరోపక్క పోలీసులు షాకిచ్చారని తెలుస్తోంది.

అవును... మీడియా ప్రతినిథులపై మోహన్ బాబు దాడి ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఈ సమయంలో తక్షణమే మోహన్ బాబు తమకు క్షమాపణ చెప్పాలంటూ జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదే సమయంలో... పోలీసులు ఆయనపై చర్యలు తీసుకోకపోతే తమ ఆందోళనలను తీవ్రం చేస్తామని హెచ్చరిస్తున్న జర్నలిస్టులు.. మోహన్ బాబు రౌడీ షీటర్ లాగా ప్రవర్తించారని.. తమ స్వేచ్ఛకు భంగం కలిగించారని మండిపడ్డారు. ఈ సమయంలో... మోహన్ బాబుకు రాచకొండ సీపీ సుధీర్ బాబు నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.

ఆయనతో పాటు మంచు విష్ణు, మంచు మనోజ్ లకు సీపీ నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది. వీరు ముగ్గురుని బుధవారం ఉదయం 10:30 గంటలకు సీపీ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారని అంటున్నారు. మీడియా దాడి నేపథ్యంలోనే ఈ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీంతో... బుధవారం రాచకొండ సీపీ ఆఫీసు వద్ద ఏమి జరగబోతుందనేది ఆసక్తిగా మారింది.

మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి!:

మీడియా ప్రతినిథులపై మోహన్ బాబు దాడి చేశారనే విషయం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో... మోహన్ బాబుని తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన ఓ పోస్ట్ చేశారు.

ఇందులో భాగంగా... "మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును తక్షణమే అరెస్ట్ చేయాలి.. అయ్యప్ప మాలలో ఉన్న మీడియా ప్రతినిధిపై దాడి చేయడం మరీ దారుణం.. సిగ్గుచేటు అమానుషం" అంటూ తీన్మార్ మల్లన్న ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.