అమెరికాలో కాల్పులు : తెలుగు విద్యార్థి పరిస్థితి విషమం!
ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి మద్దతుగా ఉండమని మా కమ్యూనిటీని వేడుకుంటున్నాను” వెబ్ సైట్ పోస్ట్‌లో పేర్కొన్నారు.
By: Tupaki Desk | 10 March 2025 11:37 PM ISTతెనాలి యువకుడు మోహన్ సాయి పోతుగుంట అమెరికా టెన్నెస్సీ రాష్ట్రంలోని ఈస్ట్ మెమ్‌ఫిస్‌లో గురువారం కాల్పులకు గురై ప్రస్తుతం అత్యంత విషమ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు..
మీడియా నివేదికలు, మెమ్‌ఫిస్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపిన వివరాల ప్రకారం.. మోహన్ తన స్నేహితుని కారులో రాత్రి 11:30 గంటల ప్రాంతంలో అపార్ట్మెంట్ భవనానికి బయట కూర్చొని ఉన్న సమయంలో ఒక అనామకుడు అతనిని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపాడు.
ముందు ప్రయాణీకుల విండో ద్వారా రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో మోహన్ భుజం , పై భుజంలో బుల్లెట్లు దూసుకుపోయాయి.. అనంతరం మోహన్ తక్షణమే తన కారును నడిపించి హైలాండ్‌లోని వాలెరో గ్యాస్ స్టేషన్‌కు చేరుకుని 911కు కాల్ చేశాడు. పోలీసులు అక్కడకు చేరుకుని అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మోహన్ క్రిటికల్ కండీషన్ లో చికిత్స పొందుతున్నట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. gofundme.com వెబ్‌సైట్‌లో ప్రవాస భారతీయులు, మోహన్ స్నేహితులు చికిత్స కోసం ఆర్థిక సహాయం ఇవ్వాలని పిలుపునిచ్చారు.. “మా ప్రియమైన స్నేహితుడు మోహన్ సాయి పోతుగుంట టెన్నెస్సీ, మెమ్‌ఫిస్‌లో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ అనుకోని ఘటన మమ్మల్ని విచారంలో ముంచేసింది. ప్రస్తుతం మోహన్ ప్రాణాలతో పోరాడుతున్నాడు. అతనికి అత్యవసర వైద్యం అందుతోంది. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి మద్దతుగా ఉండమని మా కమ్యూనిటీని వేడుకుంటున్నాను” వెబ్ సైట్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ పోస్ట్ ద్వారా సుమారు 15,000 అమెరికన్ డాలర్లు సమీకరించబడాయి.
ఇంకా నిందితుడి వివరాల గురించి పోలీసులు సమాచారం ఇవ్వలేదు. మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.