నమ్మకానికి బ్రాండ్ అంబాసిడర్లు.. అప్పుడు ఆయన, ఇప్పుడు ఈయన
ప్రస్తుతం అధికార ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే వలస పక్షుల రాజకీయమే నడుస్తోంది.
By: Tupaki Desk | 4 Feb 2025 3:30 PM GMTరాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు, సంప్రదాయాలు వంటి వాటికి ఎప్పుడో కాలం చెల్లింది. ఇప్పుడు నడుస్తోంది అంతా అవకాశ వాద రాజకీయామే.. పార్టీ సిద్ధాంతాలకు, ఆశయాలకు కట్టుబడి పనిచేసేవారిని వేళ్లపైనే లెక్కించొచ్చు. అసలు అలాంటి వారు ఇప్పుడు ఉన్నారా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ప్రస్తుతం అధికార ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోయే వలస పక్షుల రాజకీయమే నడుస్తోంది. దేశంలో ఎక్కడ చూసినా, అధికార పార్టీలోకి జంప్ చేసే నేతలే ఎక్కువ కనిపిస్తుంటారు. కానీ, తమను నమ్మిన పార్టీని.. అవకాశమిచ్చిన అధినేతను అంటిపెట్టుకుని, అవసరం వచ్చినప్పుడు విధేయుత చూపే నేతలు ఎవరైనా ఉన్నారంటే ఏపీలో ఇద్దరు నేతల పేర్లు నిశ్సందేహంగా చెప్పొచ్చు. ఆ ఇద్దరు శాసనమండలి ప్రస్తుత, మాజీ చైర్మన్లు కావడం విశేషం.
ఏపీలో ఇప్పుడు, గతంలో ఏకపక్ష రాజకీయమే నడుస్తోంది. 164 మంది ఎమ్మెల్యేల బలంతో కొలువుదీరిన కూటమి సర్కార్.. రాష్ట్రంలో అంతటా తన మాటే చెల్లుబాటు కావాలని చూస్తోంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్ కూడా ఐదేళ్లు తన మాటకు ఎదురులేకుండా ఉండాలని భావించారు. అయితే అప్పుడు, ఇప్పుడు శాసనమండలిలో మాత్రం అధికార పార్టీ ఆలోచనలకు తగ్గ నిర్ణయాలు మాత్రం ఉండటం లేదని అంటున్నారు. దీనికి కారణం శాసనమండలి చైర్మన్లుగా వ్యవహరిస్తున్న చైర్మన్లే. ప్రస్తుతం శాసనమండలి చైర్మన్ గా కొయ్యె మోషేన్ రాజు వ్యవహరిస్తున్నారు. ఈయన వైసీపీ నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారు. అయితే సభలో వైసీపీకి బలం ఉన్నా, అధికారం టీడీపీ కూటమి చేతిలో ఉండటంతో పలు విషయాల్లో ఆయన తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు చెప్పుతున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలోకి దూకేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవులకు కొందరు రాజీనామా చేయగా, చైర్మన్ వాటిని ఆమోదించడం లేదు. ఈ రాజీనామాలను ఆమోదిస్తే.. ప్రస్తుత బలాబలాలు ప్రకారం ఆ స్థానాలు ఎమ్మెల్సీలు టీడీపీకి ఖాతాలో చేరుతాయి. దీంతో వ్యూహాత్మకంగా చైర్మన్ మోషేన్ రాజు వ్యవహరిస్తూ తన విధేయత చాటుకుంటున్నట్లు చెబుతున్నారు.
ఇదేవిధంగా వైసీపీ హయాంలో మండలి చైర్మనుగా వ్యవహరించిన ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు షరీఫ్ కూడా పార్టీపై విధేయత నిరూపించుకున్నారు. ఆ సమయంలో వైసీపీ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా ఆయన పనిచేయడం వల్ల రాజధాని వికేంద్రీకరణ నిలిచిపోయిందని చెబుతున్నారు. షరీఫ్ తనకు కొరకుడుపడకపోవడం వల్ల ఏకంగా శాసనమండలినే రద్దు చేయాలని నిర్ణయానికి అప్పటి సీఎం జగన్ రావాల్సివచ్చిందని అంటున్నారు. షరీఫ్ చైర్మన్ గా ఉన్నప్పుడు ఎంతో మంది టీడీపీ సభ్యులు వైసీపీలో చేరినా, ఆయన మాత్రం వైసీపీకి తలొగ్గలేదని చెబుతారు. ఈ రోజుకీ అమరావతి రాజధానిగా ఉందంటే దానికి రైతుల ఉద్యమం ఎంతటి కారణమో.. షరీఫ్ నిర్ణయమూ అంతే ప్రభావం చూపిందని అంటున్నారు.
ఇలా ఇద్దరు నేతలు తమ పార్టీలకు విధేయుత చూపడం ప్రస్తుత రాజకీయాల్లో అరుదైన విషయంగా పరిగణించాలని అంటున్నారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడకుండా, ప్రలోభాలను లెక్క చేయకుండా రాజకీయాల్లో విలువలు పాటించాలని ఈ ఇద్దరూ చాటిచెప్పారనే ప్రశంసలు అందుకుంటున్నారు. ముఖ్యంగా ఇలా ఆదర్శనంగా నిలిచిన ఇద్దరు నేతల్లో ఒకరు మైనార్టీ, ఇంకొకరు దళిత వర్గానికి చెందిన నేతలు కావడం గమనార్హం. నేటి తరం నేతలు ఈ ఇద్దరిని ఆదర్శంగా తీసుకోవాలని రాజకీయ పండితులు సూచిస్తున్నారు.