వైరల్ వీడియో... పెళ్లి ఊరేగింపులో గాల్లోకి లక్షల విలువైన కరెన్సీ నోట్లు!
అవును... ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థనగర్ లోని ఓ వివాహ ఊరేగింపు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
By: Tupaki Desk | 20 Nov 2024 4:41 AM GMTలేని వాడు ఆకలికి ఏడిస్తే.. ఉన్న వాడు అరగక ఏడిచాడనేది నానుడి! అయితే... అది ఎవరి అదృష్టం బట్టి వారికి ఉంటుంది అని ఒకరంటే.. కష్టే ఫలి అని మరికొందరు అంటుంటారు. ఆ సంగతి అలా ఉంటే... ఓ వివాహ ఊరేగింపులో గాలిలోకి సుమారు రూ.20 లక్షలు వెదజల్లినట్లు చెబుతున్న ఓ వీడియో మాత్రం ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
అవును... ఉత్తరప్రదేశ్ లోని సిద్ధార్థనగర్ లోని ఓ వివాహ ఊరేగింపు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ పెళ్లి ఊరేగింపు సందర్భంగా కొంతమంది వ్యక్తులు గాల్లోకి రూ.20 లక్షలు వెదజల్లినట్లు చెబుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఇళ్లపై ఉంటే.. మరికొంతమంది జేసీబీలపై నిలబడి నోట్ల కట్టలను గాల్లోకి వెదజల్లారు.
నివేదికల ప్రకారం... ఈ పనికి పూనుకున్నది వరుడి తరుపు అతిథులు అని అంటున్నారు. పెళ్లి ఊరేగింపు సందర్భంగా కొంతమంది అతిథులు ఇళ్లపైకి ఎక్కి, ఇంకొంతమంది జేసీబీలపైకి ఎక్కారు. అనంతరం రూ.100, రూ.200, రూ.500 నోట్లను గాల్లోకి విసరడం మొదలుపెట్టారు. వాటి మొత్తం రూ.20 లక్షలని అంటున్నారు.
ఇలా గాలికి ఎగురుతున్న కరెన్సీ నోట్లను ఒడిసి పట్టుకోవడానికి స్థానిక ప్రజలు ఎగబడుతున్న దృశ్యాలు వీడియోలో దర్శనమిస్తున్నాయి. ఈ వైరల్ వీడియో.. అఫ్జల్ – ఆర్మాన్ వివాహానికి సంబంధించినదని చెబుతున్నారు!
ఇక ఈ వీడియోకి సంబంధించిన కామెంట్ సెక్షన్ లో భిన్నాభిప్రాయాలు వయ్క్తమవుతున్నాయి. ఇందులో భాగంగా... "డబ్బును అవసరమైన వారికి పంచాలి.. ఇలా కాదు" అని ఒకరంటే... "ఐటీ అధికారులకు ఫోన్ చేయాలి" అని మరొకరు కోరారు. మరికొంతమంది మాత్రం... “ఈ డబ్బుతో నలుగురు పెద అమ్మాయిల వివాహాలు చేయొచ్చని” వ్యాఖ్యానించారు.