Begin typing your search above and press return to search.

అరుణాచలం వెళ్లి ఐపీ పెట్టారు !

మనిషి ఆశా జీవి. వారి ఆశలే వారి మోసానికి పెట్టుబడులు అయ్యాయి. అధిక వడ్డీల ఆశ చూపారు.

By:  Tupaki Desk   |   4 Jun 2024 3:31 AM GMT
అరుణాచలం వెళ్లి ఐపీ పెట్టారు !
X

మనిషి ఆశా జీవి. వారి ఆశలే వారి మోసానికి పెట్టుబడులు అయ్యాయి. అధిక వడ్డీల ఆశ చూపారు. అసాధారణ స్థాయిలో వడ్డీలు చెల్లించారు. నమ్మకం కుదరడంతో వందలాది మందిని నమ్మించారు. వందలకోట్లు దండుకున్నారు. వీరి పన్నాగం బయటపడే సమయం వచ్చింది. అరుణాచలం వెళ్లి వచ్చి అందరికీ ఐపీ పెట్టారు. గుట్టుగా పారిపోదామనుకునే లోపు డబ్బులిచ్చిన వారు అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.

తెలంగాణ స్టేట్‌ కోఅపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌(టెస్కాబ్‌)లో జనరల్‌ మేనేజర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ వాణీబాల ఆమె భర్త మేక నేతాజీతో కలిసి 1986లో ప్రియాంక చిట్‌ఫండ్‌ పేరుతో ఫైనాన్స్‌ సంస్థను ఏర్పాటు చేశారు. వాణీబాల తమ బ్యాంకుకు వచ్చే డిపాజిట్‌దారులను ప్రియాంక చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలని నెలవారీ 24 శాతం వడ్డీ వస్తుందని చెప్పడంతో అధిక వడ్డీకి ఆశపడి చాలామంది డబ్బులు ఇచ్చారు.

ఆ డబ్బుతో ప్రియాంక గ్రాఫిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ను ప్రారంభించారు. కరోనా ప్రభావం వారి వ్యాపారాలను దెబ్బతీసింది. దీంతో అధిక వడ్డీలకు తెచ్చిన డబ్బును రొటేషన్‌ చేయడం కష్టసాధ్యం అయింది. వడ్డీలు చెల్లించడంలో ఆలస్యం కావడంతో కొందరికి అనుమానం వచ్చింది. తమ డబ్బులు తమకు ఇవ్వాలని వత్తిడి చేయడం ప్రారంభించారు. దీంతో ఇక ఐపీ పెట్టడమే మార్గం అని అరుణాచలం వెళ్లి వచ్చి మే 3వ తేదీన ఐపీ ఫైల్‌ చేశారు. నోటీసులు అందకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గత నెల 30న నేతాజీ, వాణీబాల, శ్రీహర్షలను అరెస్టు చేశారు.

నిందితులు 543 మందికి ఐపీ నోటీసులు పంపించగా, వారిలో 145 మంది వరకు వచ్చి పోలీసులను ఆశ్రయించారు. వీరిలో ఒక్కొక్కరు రూ.10 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తున్నది. ఈ మోసం విలువ తొలుత రూ.200 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు అంచనా వేసినప్పటికీ బాధితుల సంఖ్య పెరుతుండటంతో అది రూ.500 కోట్ల వరకు ఉండే అవకాశమున్నదని భావిస్తున్నారు. ఈ సొమ్మును నిందితులు ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, ఏం ఆస్తులు కొన్నారో తెలుసుకొనేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.