వాషింగ్ మెషిన్ లో లక్ష్మీదేవి... చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే!
వివరాళ్లోకి వెళ్తే... విశాఖలో ఒక ఎలక్ట్రిక్ షాపుకు సంబంధించిన వాషింగ్ మెషిన్లు ఆటోలో లోడై వెళ్తున్నాయి. అయితే ఎన్ఏడీ వద్ద పోలీసులు ఆ ఆటోను పట్టుకున్నారు.
By: Tupaki Desk | 25 Oct 2023 5:13 PM GMTసినిమా స్టైల్లో డబ్బు తరలిస్తున్న ఒక ఆసక్తికరమైన సంఘటన విశాఖలో జరిగింది. డబ్బు తరలించే విషయంలో క్రియేటివ్ గా ఆలోచించారో ఏమో కానీ... ఒక ఆటోలో ఎలక్ట్రానిక్ వస్తువులను తరలిస్తూ వాటిలో నోట్ల కట్టలు నింపారు! పైకి చూస్తే అందులో నోట్ల కట్టలు ఉన్నాయని మానవమాత్రుడికి అనుమానం రాకుండా ప్లాన్ చేసినట్లుగా చేశారు! అయితే సమాచారం అందిందో.. లేక, అనుమానం వచ్చిందో తెలియదు కానీ... పోలీసులకు దొరికేసింది!
అవును... విశాఖపట్నంలో ఒక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. ఓ ఆటో రాత్రిపూట ఎలక్ట్రానిక్ వస్తువుల లోడుతో వెళ్తుంది. దసరా సీజన్ కావడంతో ఇలా పెద్ద ఎత్తున షిప్టింగ్ లు సహజం అని దాన్ని ఒక రెగ్యులర్ లోడింగ్ లో భాగంగా భావించారట! అయితే అందులో ఏదో మతలబు ఉందనే సమాచారం పోలీసులకు అందిందని తెలుస్తుంది! వెంటనే రాత్రిపూట గుట్టుగా వెళ్తున్న ఆటోను ఆపిన పోలీసులు దాన్ని నిషితంగా పరిశీలించడంతో అసలు విషయం బయట పడింది!
వివరాళ్లోకి వెళ్తే... విశాఖలో ఒక ఎలక్ట్రిక్ షాపుకు సంబంధించిన వాషింగ్ మెషిన్లు ఆటోలో లోడై వెళ్తున్నాయి. అయితే ఎన్ఏడీ వద్ద పోలీసులు ఆ ఆటోను పట్టుకున్నారు. ఎంత చెక్ చేసినా సీల్ చేసి ఉన్న ఆరు వాషింగ్ మిషన్లు మాత్రమే ఆటోలో కనిపిస్తున్నాయి తప్ప ఇంకేమీ కనిపించడం లేదు. డ్రైవర్ను ప్రశ్నిస్తే విశాఖ నుంచి విజయవాడ తీసుకెళ్తున్నట్టు చెప్పాడు. దీంతో పోలీసులకు చిన్న అనుమానం స్టార్ట్ అయ్యిందట.
దీంతో... పోలీసులు ఆ ఆటో డ్రైవర్ తో వాషింగ్ మిషన్ల సీల్స్ విప్పించారు. దీంతో వాషింగ్ మెషిన్లలో 1.30 కోట్ల నగదు కట్టలు దర్శనమిచ్చాయి. ఈ నగదుతో పాటు 30 కొత్త సెల్ ఫోన్లు కూడా ఉన్నాయి. అదే సమయంలో ఈ ఆటో వెనకే బైక్ పై ఒక వ్యక్తి పైలెట్ గా వెళ్తున్నాడని పోలీసులు గుర్తించారంట. దీంతో వెంటనే ఆటోను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
అనంతరం ఆ ఆటోతోపాటు, అందులోని ఆరు వాషింగ్ మెషిన్లు, ఆటోని ఫాలో అవుతున్న బైక్ ను పోలీసులు సీజ్ చేశారు. అనంతరం 41, 102 సీఆర్పీసీ కింద కేసు నమోదు చేశారని తెలుస్తుంది. అయితే ఈ వ్యవహారంపై ఒక ఎలక్ట్రిక్ షాపు యజమాని స్పందించినట్లు తెలుస్తుంది. విషయం తెలుసుకున్న అనంతరం ఆ వ్యాపారి పోలీస్ స్టేషన్ కు వెళ్లారని చెబుతున్నారు.
అనంతరం... దసరా సేల్ డబ్బును విజయవాడలోని బ్యాంకులో జమ చేసేందుకు తీసుకెళ్తున్నట్టు ఆ ఎలక్ట్రానిక్ షాపు యజమాని వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అంత గుట్టుగా భారీ స్థాయిలో నగదు ఎందుకు తరలించాల్సి వచ్చిందన్న విషయంపై మాత్రం సరైన వివరణ ఇవ్వకపోవడంతో నగదును సీజ్ చేశామని పోలీసులు చెబుతున్నారని సమాచారం. అయితే... “వాషింగ్ మెషిన్” లో లక్ష్మీదేవి అంటూ సోషల్ మీడియాలో ఈ విషయం మాత్రం హాట్ టాపిక్ గా మారింది!