Begin typing your search above and press return to search.

ఉద్యోగినులకు నెలసరి సెలవు.. పంద్రాగస్టున ఆ రాష్ట్ర సర్కారు శుభవార్త

ఉద్యోగినులకు నెల సరి సెలవు సరే.. ఎప్పుడిస్తారు? అనేదే ప్రశ్న. దీనికి ప్రతి నెల వారి రుతుక్రమంలో తొలి లేదా రెండో రోజు సెలవును తీసుకునే వెసులుబాటు ఇవ్వనున్నారు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 10:06 AM GMT
ఉద్యోగినులకు నెలసరి సెలవు.. పంద్రాగస్టున ఆ రాష్ట్ర సర్కారు శుభవార్త
X

భారత దేశంలోని మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలన్నీ క్రికెట్ పిచ్చితో ఊగిపోతుంటే.. ఆ రాష్ట్రం మాత్రం హాకీని నెత్తికెత్తుకుంది.. ప్రపంచ కప్ లు నిర్వహించడమే కాదు.. భారత హాకీ జట్టుకు స్పాన్సర్ గానూ వ్యవహరించింది. ఇదేంటి.. వీరికేమైనా పిచ్చా..? అని నవ్వుకున్న వారు ఉన్నారు. కానీ.. అదే భారత హాకీ జట్టు తాజాగా పారిస్ ఒలింపిక్స్ లో భారత్ పరువు నిలిపింది. వరుసగా రెండో కాంస్య పతకం సాధించి దేశాన్ని సగర్వంగా నిలిపింది. తమను ప్రోత్సహించిన ఆ రాష్ట్రానికి ప్రతిష్ఠ తెచ్చింది. ఇప్పడదే రాష్ట్రం మరో కీలక నిర్ణయ తీసుకుంది.

ఆ కఠిన సమయంలో..

స్త్రీలకు నెలసరి సమయం అత్యంత బాధాకరం. కొందరైతే తీవ్ర మానసిక, శారీరక సమస్యలు ఎదుర్కొంటారు. నేచర్ ఇచ్చిన దీనిని కొందరు వేరే విధంగా భావిస్తారు. ఇంట్లో ఓ పక్కన ఉండిపోవడం వంటివి చేస్తారు. ఇక ఉద్యోగాలు చేస్తున్న మహిళలకైతే పరిస్థితి చెప్పనలవి కాదు. నెలసరి సమయంలో అత్యవసరం అయినా సెలవు కష్టం అవుతుంది. ఇక సమావేశాల వంటి వాటిలో పాల్గొనాల్సి వస్తే చెప్పనలవి కాదు. ఇలాంటి ఇబ్బందులను అధిగమించేలా ఉద్యోగినులకు నెలలో ఒకరోజు నెలసరి సెలవు ఇవ్వనున్నట్లు ఒడిశా ప్రభుత్వం ప్రకటించింది. ఇది ఎంతైనా మహిళలకు శుభవార్తే. అంతేగాక ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళలకు అందరికీ వర్తింపజేస్తామని తెలిపింది. దీనిని తక్షణమే అమల్లోకి తెస్తామని కూడా స్పష్టం చేసింది.

సెలవు ఎప్పుడిస్తారు?

ఉద్యోగినులకు నెల సరి సెలవు సరే.. ఎప్పుడిస్తారు? అనేదే ప్రశ్న. దీనికి ప్రతి నెల వారి రుతుక్రమంలో తొలి లేదా రెండో రోజు సెలవును తీసుకునే వెసులుబాటు ఇవ్వనున్నారు. కాగా, ఒడిశా ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల మహిళల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు మహిళలకు నెలసరి సెలవులపై దేశవ్యాప్తంగానూ విస్తృతంగా చర్చ ఉంది. మూడు రోజుల పాటు నెలసరి సెలవులు ఇవ్వాలని రెండేళ్ల కిందటనే ఓ బిల్లును ప్రతిపాదించినా ఆమోదం రాలేదు.

సుప్రీం కోర్టూ స్పందించింది..

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవులపై ఇటీవల సుప్రీంకోర్టు కూడా స్పందించింది. ఇలాంటి వెసులుబాటు ఇవ్వడం ద్వారా మహిళలు ఎక్కుమంది ఉద్యోగాల్లో చేరేందుకు ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతందని పేర్కొంది. ఇక్కడ ఓ మెలిక ఉందని.. దీనిని తప్పనిసరి చేయాలని యాజమాన్యాలను బలవంతం చేస్తే.. నియామకాల సందర్భంగా ప్రతికూల పరిస్థితి ఏర్పడవచ్చని వ్యాఖ్యానించింది. మహిళలను ఉద్యోగాల్లో నియమించే అవకాశాల తగ్గడాన్ని తాము కోరుకోవడం లేదని తెలిపింది.

బిహార్ లో 30 ఏళ్ల కిందటనే..

బిహార్‌ లో 1992 నుంచే మహిళలకు రెండు రోజుల నెలసరి సెలవు ఇస్తున్నారు. కేరళ ప్రభుత్వం విద్యార్థినులకు మూడు రోజుల పీరియడ్‌ లీవ్‌ ను ఏడాది కిందట ప్రకటించింది. హైదరాబాద్‌ నల్సార్ లా యూనివర్శిటీ, అసోంలోని గుహవాటి విశ్వవిద్యాలయం, తేజ్‌ పూర్ విశ్వవిద్యాలయం, చండీగఢ్‌ లోని పంజాబ్‌ వర్సిటీ లు విద్యార్థినులకు నెలసరి సెలవులను వర్తింపజేస్తుండడం గమనార్హం.