Begin typing your search above and press return to search.

హర్యానాలో తాజా హింసతో మోనూ మనేసర్ కు లింకేంటి?

అందుకు భిన్నంగా హర్యానాలో తాజాగా చోటు చేసుకున్న అల్లర్లపై బోలెడన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి

By:  Tupaki Desk   |   2 Aug 2023 6:22 AM GMT
హర్యానాలో తాజా హింసతో మోనూ మనేసర్ కు లింకేంటి?
X

ఓవైపు మణిపూర్ లో దారుణాలు చోటు చేసుకోవటం.. యావత్ దేశం దానిపై తీవ్రంగా స్పందిస్తూ పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వేళ.. అందరి ఫోకస్ మణిపూర్ మీద ఉంటూ కేంద్రంలోని మోడీ సర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ.. అనూహ్యంగా దేశ రాజధానికి కూతవేటులో ఉండే హర్యానా రాష్ట్రంలో హింసాగ్ని రేగటం.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవటం షాకింగ్ గా మారింది.

మణిపూర్ మారణహోమంపై నిరసనలు వెల్లువెత్తుతున్న వేళ.. మరోచోట అలాంటి పరిస్థితులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. అందుకు భిన్నంగా హర్యానాలో తాజాగా చోటు చేసుకున్న అల్లర్లపై బోలెడన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అన్నింటికి మించి.. ఈ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసకు ఒక వ్యక్తి కారణమన్న ఆరోపణలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. సదరు వ్యక్తి మీద గతంలోనే తీవ్రమైన హత్యానేరారోపణలు ఉన్నాయి.

ఇలాంటి వేళ.. అతడిపై రాజ్యం చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? అతడెలా బయట తిరుగుతున్నాడు? వర్గాల మధ్య విద్వేషాలు పుట్టించేలా వ్యవహరించగలుగుతున్నాడు? అన్నది ప్రశ్న. ఇంతకూ అతడెవరంటే.. మోనూ మనేసర్. ఇతడి అసలు పేరు మోహిత్ యాదవ్. మీవాట్ లో ఆవుల సంరక్షణ దళాన్ని నడిపిస్తుంటాడు. ఆవుల అక్రమ తరలింపుపై అనేక వీడియోలు చేస్తూ.. పాపులర్ అయ్యాడు. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు.

2015లో హర్యానా ప్రభుత్వం ఆవుల సంరక్షణ చట్టాన్ని తీసుకొచ్చి.. దాని కింద ఏర్పాటు చేసిన జిల్లా టాస్క్ ఫోర్సులో సభ్యుడిగా ఎంపికయ్యాడు. సోషల్ మీడియాలో అతను పాపులర్. అతన్ని ఫాలో అయ్యే వారు వేలాదిగా ఉన్నారు. ముఫ్పై ఏళ్ల మోనూ మనేసర్ రాజస్థాన్ లోని బివానిలో ఇద్దరు మైనార్టీ యువకుల్ని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఉదంతంలో నిందితుడు. ఫిబ్రవరిలో జరిగిన ఈ ఉదంతం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కారణం.. ఇద్దరు యువకులు ఆవుల్నిఅక్రమంగా తరలిస్తున్నారన్న అనుమానంతో వారి మీద దాడి చేసి.. కిడ్నాప్ చేశాడు. అనంతరం వారిని హత్య చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

అయితే.. ఈ ఉదంతంతో తమకు సంబంధం లేదని భజరంగ్ దళ్ చెబుతోంది. తీవ్ర సంచలనంగా మారిన ఈ ఉదంతంలో మోనూ మనేసర్ ను అదుపులోకి తీసుకునేందుకు రాజస్థాన్ పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అతడు దొరకలేదన్న మాటలు చెప్పటం గమనార్హం. ఇక.. హర్యానాలో చోటు చేసుకున్న హింస విషయానికి వస్తే.. రాష్ట్రంలోని నుహ్ జిల్లాలో నిర్వహిస్తున్న ఊరేగింపునకు అతను హాజరవుతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ ర్యాలీలో పాల్గొనాల్సిందిగా మోనూ మనేసర్ సైతం ఒక వీడియోను పోస్టు చేశాడు. పెద్ద ఎత్తున జనం హాజరు కావాలని కోరాడు. అయితే.. సోషల్ మీడియాలో అతనికి బెదిరింపులు.. హెచ్చరికలు రావటంతో ర్యాలీలో పాల్గొనలేదు.

అయితే.. మోనూ మనేసర్ ర్యాలీకి వస్తున్నాడన్న ఉద్దేశంతో దీన్ని అడ్డుకునే ప్రయత్నం జరిగింది. సదరు ర్యాలీ మీద రాళ్ల దాడి చోటు చేసుకుంది. దీంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. హింసాత్మకంగా మారటంతో పాటు.. ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో భారీగా ఆస్తినష్టంతో పాటు నలుగురు మరణించారు. గురుగ్రామ్ లో రాత్రికి రాత్రి ఒక ప్రార్థనా స్థలాన్ని కాల్చిన ఉదంతంతో విషయం మరింత సీరియస్ గా మారింది.

ఇప్పటివరకు చోటు చేసుకున్న ఘర్షణల్లో నలుగురు మరణించగా.. 200 మందికి పైగా గాయపడినట్లుగా తెలుస్తోంది. నుహ్ జిల్లాలో ఎటు చూసినా విధ్వంసమే కనిపిస్తోంది. కార్లు.. ఇళ్లు.. మతపరమైన భవనాలకు నిప్పు పెట్టారు. ర్యాలీ కోసం దాదాపు 2500 మంది నుహ్ జిల్లాకు రాగా.. ఘర్షణల కారణంగా వారంతా ఆలయం వద్ద చిక్కుకుపోగా.. సాయంత్రం వారిని పోలీసులు రక్షించినట్లుగా చెబుతున్నారు. గురుగ్రామ్.. నుహ్ లలో 144 సెక్షన్ తో పాటు పారామిలిటరీ.. హర్యానా ఎస్ టీఎఫ్ బలగాల్ని మొహరించారు. అనంతరం నుహ్ జిల్లాలో కర్ఫ్యూను విధించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. మతఘర్షణలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఈ ఘర్షణలపై ఇరవై కేసులు నమోదయ్యాయి.