మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్... మోడీ పరిస్థితి ఇదే?
అవును... తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు వేళవుతోంది
By: Tupaki Desk | 25 Aug 2023 4:37 AM GMTఎన్నికలు సమీపిస్తున్న వేళ దేశవ్యాప్తంగా సర్వేల హడావిడి మొదలైపోయింది. ఇప్పటికే కర్ణాటక ఎన్నికల్లో కూడా సర్వే ఫలితాలు దాదాపుగా నిజం అవ్వడంతో.. ఆ ఉత్సాహాన్ని ఆయా సంస్థలు కంటిన్యూ చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఇండియా టుడే-సీఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడైంది.
కర్ణాటక ఎన్నికలు షాకిచ్చిన వేళ త్వరలో జరగబోయే అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కేంద్రంలోని అధికార పార్టీకి కీలకంగా మారనున్నాయని అంటున్నారు. ఆ రాష్ట్రాల్లోని ఫలితాలు కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ ను మరింత స్పష్టంగా చెబుతాయని అంటున్నారు. దీంతో కచ్చితంగా ఆక్కడ సత్తా చాటాలని ఎన్.డి.ఏ., ఇండియా కూటములు బలంగా భావిస్తున్నాయి.
అవును... తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు వేళవుతోంది. తెలంగాణలో బీఆరెస్స్ అధికారంలో ఉండగా... మధ్యప్రదేశ్ లో బీజేపీ... ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లల్లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. మిజోరం లో ఎం.ఎన్.ఎఫ్. అధికారంలో ఉంది.
దీంతో వచ్చే ఏడాది జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఈ అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్స్ గా భావిస్తోన్నాయి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ పరిస్థితుల మధ్య దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఉన్న లోక్ సభ స్థానాలకు ఇప్పటికప్పుడు ఎన్నికలను నిర్వహించాల్సి వస్తే.. పరిస్థితేమిటనేది చెప్పేలా... ఇండియా టుడే - సీఓటర్ నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడైంది.
ఈ సర్వే వివరాల ప్రకారం... ప్రధానమంత్రిగా మళ్లీ నరేంద్ర మోడీని మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారు! మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న ఈ పరిస్థితుల్లోనూ ఆయనకు ఆదరణ తగ్గలేదని ఈ సర్వే స్పష్టం చేసింది. సర్వేలో పాల్గొన్న వారిలో 52 శాతం మంది మూడోసారి ప్రధానిగా మోడీ రావాలని కోరుకుంటోన్నట్లు తెలిపింది.
అయితే గతంలో నిర్వహించిన సర్వేలో 72 శాతం మంది మోడీ పనితీరు పట్ల సంతృప్తిని వ్యక్తం చేయగా.. ఇప్పుడా సంఖ్య 63కు పడిపోయింది. అయినప్పటికీ అది బిగ్ నెంబరే కావడంతో... మరోసారి మోడీనే ప్రజలు కోరుకుంటున్నారని ఈ సర్వే తెలిపింది.
అంటే గతానికీ ఇప్పటికీ సుమారు 9శాతం మంది మోడీ అనుకూలతనుంచి మనసు మార్చుకున్నారన్నమాట. ఇది ఒక రకంగా ఇండియా కూటమికి గుడ్ న్యూస్ అనే చెప్పాలని అంటున్నారు పరిశీలకులు.
ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో మోడీని చూసే బీజేపీకి ఓటు వేస్తామని 44 శాతం మంది అభిప్రాయపడినట్లు మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ వెల్లడించింది. బీజేపీకి ఓటు వేయడానికి అభివృద్ధి, హిందుత్వమే కారణాలేనని తేల్చి చెప్పింది!
ఇదే క్రమంలో... 13 శాతం మంది మోడీ పనితీరుకు యావరేజ్ మార్కులు వేయగా.. మరో 22 శాతం మంది ఆయన పనితీరు అధ్వాన్నంగా ఉందని వెల్లడించారు.