భారత్ కు ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ శుభవార్త!
భారత్ కు ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ.. మూడీస్ శుభవార్త చెప్పింది.
By: Tupaki Desk | 2 Sep 2023 10:14 AM GMTభారత్ కు ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ.. మూడీస్ శుభవార్త చెప్పింది. వృద్ధి రేటును అంచనా వేసి ఎప్పటికప్పుడు నివేదికలు, సర్వేలను విడుదల చేసే మూడీస్ భారత ఆర్థిక వృద్ధి రేటుపై గుడ్ న్యూస్ తెలిపింది.
2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను భారత వృద్ధి రేటును 6.2 శాతంగా మూడీస్ అంచనా వేసింది. గతంలో ఇది కేవలం 5.5 శాతమే కావడం గమనార్హం. తాజాగా ఈ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం పెరుగుతుందని మూడీస్ తెలపడం విశేషం. ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో.. సేవా రంగంలో వృద్ధి భారత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిందని మూడీస్ అభిప్రాయపడింది.
కాగా మూడీస్ ఆర్థిక వృద్ధి అంచనాల్లో చైనా కంటే భారత్ ముందంజలో నిలవడం విశేషం. గతంలో చైనా వృద్ధి రేటను 4.5 శాతంగా మూడీస్ పేర్కొంది. ఇప్పుడు దాన్ని కుదించింది. 4 శాతానికే పరిమితం చేసింది. చైనా ఆర్థిక వ్యవస్థకు వృద్ధిపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయని మూడీస్ పేర్కొంది. ఈ నేపథ్యంలో 2024కు ఆ దేశ వృద్ధిరేటు అంచనాలను తగ్గిస్తున్నట్లు మూడీస్ వెల్లడించింది.
ఈ ఏడాది తొలి అర్ధభాగంలో భారత్ సహా పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తమ అంచనాలకు మించి రాణించాయని మూడీస్ తెలిపింది. అయితే వచ్చే ఏడాది (2024)కు సంబంధించి మాత్రం భారత వృద్ధి రేటు అంచనాలను 6.5 శాతం నుంచి 6.1 శాతానికి కుదించింది. అధిక బేస్ రేట్ కారణంగా భారత్ వృద్ధి రేటును తగ్గించామని మూడీస్ పేర్కొంది.
మరోవైపు మూడీస్ మాత్రమే కాకుండా ఇతర ప్రపంచ స్థాయి ఆర్థిక సంస్థలు సైతం భారత వృద్ధిరేటుపై ఆశాజనకమైన నివేదికలను విడుదల చేశాయి. ఈ క్రమంలో డ్యూయిష్ బ్యాంక్ 20 బేసిస్ పాయింట్లను పెంచి భారత వృద్ధి రేటును ఈ ఏడాది 6.2 శాతంగా అంచనా వేసింది. అలాగే మరో ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ.. మోర్గాన్ స్టాన్లీ కూడా భారతదేశ జీడీపీ వృద్ధి అంచనాను 6.4 శాతానికి అప్ గ్రేడ్ చేసింది.
ఇంకోవైపు రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్బీఐ) సైతం భారత్ వృద్ధి రేటు ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో 6.5 శాతం ఉంటుందని అంచనా వేసింది. అయితే ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఈ వృద్ధిరేటు కొంచెం తగ్గి 6 శాతంగా ఉంటుందని పేర్కొంది.
మూడీస్ తాజా అంచనాలతో ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. పరిమాణంపరంగా అతిపెద్ద ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉన్న భారత్ మరికొన్ని ఏళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. ఇందుకు మూడీస్ తాజా అంచనాలు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.