చిక్కిపోతున్న చంద్రుడు.. అసలేం జరుగుతోంది?
ఈ ముడతలు ప్రాథమికంగా చంద్రుడి భౌగోళిక స్వరూపాన్నే మార్చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కొన్ని లక్షల సంవత్సరాల కాలంలో చందమామ దాదాపు 150 అడుగుల మేర చిక్కిపోయిన వైనాన్ని గుర్తించారు.
By: Tupaki Desk | 4 Feb 2024 11:30 AM GMTఅంతరిక్షంలో సదూరంలో ఉన్నా.. నిత్యం తన వెలుగులతో రాత్రిళ్లు చిమ్మచీకటి కాకుండా చూసే చందమామకు సంబంధించి తెలిసిన విషయాలు కొన్నే అయినా తెలియాల్సినవి మాత్రం బోలెడన్ని ఉన్నాయనే చెప్పాలి. తాజాగా అలాంటి సీక్రెట్ ఒకటి గుర్తించారు శాస్త్రవేత్తలు. అదేమంటే.. మన చందమామ చిక్కిపోతున్నాడు. ఈ విషయాన్ని తాజాగా గుర్తించారు. దీంతో.. ఎండిన ద్రాక్ష మీద వచ్చినట్లుగా చందమామ మీద ముడతల్ని గుర్తించారు. దీని కారణంగా చంద్రుడి మీద జనావాసాలు.. కాలనీలు ఏర్పాటు చేయాలన్న ఫ్యూచర్ ప్లాన్ కు ఈ పరిణామం మరిన్ని సవాళ్లను తెర మీదకు తీసుకొస్తుందన్న మాట వినిపిస్తోంది.
చంద్రుడి అంతర్భాగంలో శీతలీకరణ ప్రక్రియ ఫలితంగా జాబిల్లి కుంచించుకుపోతున్నట్లుగా తేల్చారు. ఈ క్రమంలో ఏర్పడే సంకోచాలతో ఎండిన ద్రాక్ష పండుపై వచ్చినట్లే చంద్రుడి ఉపరితలం పైనా ముడతలు పడుతున్నాయని.. ఈ ముడతలు ప్రాథమికంగా చంద్రుడి భౌగోళిక స్వరూపాన్నే మార్చేస్తున్నట్లుగా చెబుతున్నారు. కొన్ని లక్షల సంవత్సరాల కాలంలో చందమామ దాదాపు 150 అడుగుల మేర చిక్కిపోయిన వైనాన్ని గుర్తించారు.
చంద్రుడి లోపలి పొరలు చల్లబడుతున్న కొద్దీ పెళుసుగా ఉన్న చంద్రుడి ఉపరితలంపై పగుళ్లు.. గుట్టలు.. లోయలు లాంటివి ఏర్పడుతున్నాయి. కొన్ని పదుల మీటర్లు ఎత్తున ఉండే ఈ గుట్టలు చంద్రడి మారుతున్న స్వరూపానికి నిదర్శనంగా చెబుతున్నారు. ఈ అంశాలు వెలుగు చూడటం ద్వారా భవిష్యత్తులో చంద్రుడి మీద చేయాల్సిన ప్రాజెక్టులకు మరిన్ని సవాళ్లు ఎదుర్యే వీలుందంటున్నారు. ముడుచుకుపోవటం ద్వారా చంద్రకంపాల్ని ఎదుర్కోవాల్సి వస్తుందని.. అది వ్యోమగాములకు అదనపు సవాలుగా మారుతుందని చెబుతున్నారు. చంద్రుడి క్రియాశీల స్వభావానికి విరుద్దంగా దాని డైనమిక్ స్వభావాన్ని గుర్తించాల్సిన అవసరాన్ని ఈ పరిశోధనలు చేస్తున్న వారు చెబుతున్నారు. ఫ్యూచర్ లో లూనార్ మిషన్లతో పాటు చంద్రుడి మీద కాలనీల ఏర్పాటు గురించి చర్చలు జోరుగా సాగుతున్ వేళ.. అక్కడ చోటు చేసుకునే ప్రకంపనాలపై మరింత లోతైన పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.