Begin typing your search above and press return to search.

అంబటి సూక్తులు మోపిదేవికి వినిపిస్తాయా ?

ఈ నేపథ్యంలో మోపిదేవికి మొదటి నుంచి మిత్రుడిగా ఉన్న వారు అదే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మోపిదేవికి సూక్తులు చెప్పారు.

By:  Tupaki Desk   |   29 Aug 2024 12:30 AM GMT
అంబటి సూక్తులు మోపిదేవికి వినిపిస్తాయా ?
X

రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణ వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి వెళ్లాలని చూస్తున్నారు మీడియా కోడై కూస్తోంది. దానికి కాదు అని ఖండన ఏదీ మోపిదేవి వైపు నుంచి లేదు. మరో వైపు చూస్తే మోపిదేవి ఆల్ రేడీ సైకిలెక్కేసినట్లే అని కూడా ప్రచారం సాగుతోంది. ఆయన మొదట తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ మీదట వైసీపీకి రాజీనామా చేసి అపుడు చంద్రబాబుని కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు అని కూడా అంటున్నారు.

ఈ నేపథ్యంలో మోపిదేవికి మొదటి నుంచి మిత్రుడిగా ఉన్న వారు అదే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు మోపిదేవికి సూక్తులు చెప్పారు. హిత వచనాలు వల్లించారు. మోపిదేవి పార్టీని వీడతారు అని జరుగుతున్న ప్రచారం నేపధ్యంలో అంబటి స్పందించారు. జగన్ కి మోపిదేవి అత్యంత సన్నిహితుడు అని చెప్పారు. అంతే కాదు మోపిదేవి 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడినా ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి జగన్ మంత్రిగా తీసుకున్నారు అని కూడా గతాన్ని గుర్తు చేశారు.

అలాంటి మోపిదేవి పార్టీని వీడుతారు అని తాను అనుకోవడం లేదు అని అంబటి అంటున్నారు. ఒక వేళ అధికార పార్టీలో చేరడం అంటూ జరిగితే క్యారెక్టర్ కోల్పోయినట్లే అని కూడా అంబటి చెప్పారు. అధికారం ఎవరికైనా శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలని అన్నరు. పార్టీలు మారడం మంచి విధానం కాదని ఆయన వ్యాఖ్యానించారు.

సరే అంబటి నీతి వ్యాఖ్యాలు వల్లించారు. చెప్పాల్సింది మంచిగానే మిత్రుడికి చెప్పారు. కానీ మోపిదేవి ఢిల్లీ రూట్ లో ఉన్నారని రాజ్యసభ చైర్మన్ ని స్వయంగా కలసి రాజీనామా చేస్తారని ప్రచారం వెల్లువెత్తుతోంది. పైగా ఆయనకు ఎమ్మెల్సీ బాబు ఇస్తారని ఆయన కుమారుడికి రాజకీయ భవిష్యత్తు చూపిస్తారు అని కూడా ప్రచారం సాగింది. దానికి అంగీకరించే మోపిదేవి పార్టీ మారుతున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే మోపిదేవి రూట్ మార్చేశారు అని గట్టిగా వినిపిస్తోంది. ఆయన ఈ సమయంలో అంబటి మాటను వింటారు అనుకుంటే పొరపాటే.

అయితే వైసీపీ దింపుడు కళ్ళెం ఆశ అన్నట్లుగానే రాంబాబుతో ఈ విధంగా చెప్పించింది అని అంటున్నారు. నిజంగా పార్టీ మీద నాయకుల మీద శ్రద్ధ పెట్టాల్సి ఉంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తి, అది కూడా వైఎస్సార్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు అయిన మోపిదేవితో నేరుగానే హై కమాండ్ మాట్లాడితే బాగుండేది కదా అన్న చర్చ సాగుతోంది. ఏది ఏమైనా మోపిదేవి వైసీపీకి దూరం అయ్యారని వార్తలు అయితే వస్తున్నాయి.