Begin typing your search above and press return to search.

మాస్కోలో ఉగ్రదాడి.. సంగీత కచేరీలో కాల్పుల్లో 40 మంది మృతి!

అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రదాడి చోటు చేసుకుంది

By:  Tupaki Desk   |   23 March 2024 3:44 AM GMT
మాస్కోలో ఉగ్రదాడి.. సంగీత కచేరీలో కాల్పుల్లో 40 మంది మృతి!
X

అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో రష్యా రాజధాని మాస్కోలో ఉగ్రదాడి చోటు చేసుకుంది. ఒక సంగీత కచేరీలో చోటు చేసుకున్న దాడి భారీగా మరణాలతోపాటు.. పలువురు గాయపడేలా చేసింది. క్రాకస్ సిటీ కన్సర్ట్ హాల్ లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 40 మంది అక్కడికక్కడే మరణించగా.. మరో వంద మంది వరకు గాయాలబారిన పడ్డారు.

ప్రముఖ రష్యన్ రాక్ బ్యాండ్ ఫిక్ నిక్ సంగీత కచేరీలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఉగ్రదాడిలో మరణించిన వారి సంఖ్యను రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ ధ్రువీకరించింది. ప్రత్యక్ష సాక్ష్యుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం సంగీత కచేరీ జరుగుతున్న హాల్లోకి ప్రవేశించిన దుండగులు అక్కడే ఉన్న వారిపై కాల్పులు జరిపి బీభత్సాన్ని క్రియేట్ చేశారు. ‘‘అప్పటికి కార్యక్రమం పూర్తైంది. అందరూ బయటకు వెళ్లే హడావుడిలో ఉన్నారు. అలాంటి వేళలో ఒక్కసారిగా కాల్పులు మొదలయ్యాయి. దీంతో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది. దుండగులు జరిపిన కాల్పుల బారిన పడిన వారు కుప్పకూలిపోయారు. భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఈ క్రమంలో మరింత మందికి తూటాలు తగిలాయి’’ అని పేర్కొన్నారు.

దుండగులు జరిపిన కాల్పుల్లో అప్పటికప్పుడు ఏం చేయాలో తెలీక పరుగులు తీస్తే.. మరికొందరు మాత్రం వెంటనే సీట్ల మధ్య దాక్కొని తమ ప్రాణాల్ని కాపాడుకున్నారు. ఉగ్రదాడి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేప్టటారు. హాల్లో చిక్కుకున్న పలువురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స కోసం భారీగా అంబులెన్సుల్ని తీసుకొచ్చి సహాయక చర్యలు చేపట్టినట్లుగా అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉండగా హాల్లోకి ప్రవేశించిన దుండగులు కాల్పులు మాత్రమే కాదు బాంబులు విసిరినట్లుగా కూడా చెబుతున్నారు. ఈ కారణంతోనే బిల్డింగ్ మొత్తం మంటల్లో చిక్కుకున్నాయి. నల్లటి పొగలు వ్యాపించాయి. ఈ దాడిలో మొత్తం ఐదుగురు దుండగులు పాల్గొన్నట్లుగా చెబుతున్నారు. సీసీ కెమేరాల్లో దుండగులు ఆయుధాలతో హాల్లోకి ప్రవేశించిన ద్రశ్యాలు నమోదయ్యాయి. సీసీ పుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దాడికి పాల్పడిన వారిలో ొకరిని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ దాడిని తామే చేపట్టినట్లుగా ఇస్లామిక్ స్టేట్ ప్రకటించింది.

దాడి జరిగిన భవనంలో మంటలు చెలరేగి.. భారీగా పొగలు వ్యాపించిన వైనం దూరాన ఉన్న వారికి కూడా అర్థమయ్యే పరిస్థితి. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఉగ్రదాడిపై అమెరికా స్పందించింది. ఈ దాడి చాలా భయంకరంగా ఉన్నట్లుగా అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ కిర్బీ ప్రకటించారు. ఈ ఘటనపై ఇప్పుడే మాట్లాడలేమన్న ఆయన.. మరింత సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా చెప్పారు.

గడిచిన రెండు దశాబ్దాల్లో రష్యాలో జరిగిన అతి పెద్ద ఉగ్రదాడిగా చెబుతున్నారు. 2002లో చెచెన్ మిలిటెంట్లు మాస్కో థియేటర్లోకి ప్రవేశించి 800 మందిని బందీలుగా చేసుకుంటే.. రష్యా ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగిన వారిని విడిపించాయి. ఈ క్రమంలో 129 మంది బందీలు అమరులు కాగా.. 41 మంది మిలిటెంట్లు మరణించారు. 2004లో 30 మంది చెచెన్ సాయుధులు బెస్లాన్ లోని ఒక స్కూల్ ను తమ అధీనంలోకి తీసుకొని వందల సంఖ్యలో బందీలుగా చేసుకున్నారు. వారిని విడిపించే క్రమంలో దాదాపు 300 మంది మరణించారు. వారిలో అత్యధికం చిన్నారులే. ఈ ఘటన తర్వాత ఇదే అతి పెద్ద ఉగ్రదాడిగా చెప్పొచ్చు. ఇక్కడో అంశాన్ని ప్రస్తావించాలి. పుతిన్ దేశాధ్యక్షుడిగా మరోసారి ఎన్నికై సంబరాలు జరుపుకుంటున్న వేళ ఈ దాడి జరగటం గమనార్హం.