Begin typing your search above and press return to search.

పాకిస్థాన్ క్రికెట్ స్టేడియంలలో దుస్థితి తాజా పరిస్థితి ఇది!

ఆ సంగతి అలా ఉంటే... పాకిస్థాన్ లోని స్టేడియంల పరిస్థితి అత్యంత అధ్వ్వాన్నంగా ఉందని పీసీబీ ఛైర్మన్ తాజాగా చెబుతుండటం గమనార్హం.

By:  Tupaki Desk   |   20 Aug 2024 9:30 PM GMT
పాకిస్థాన్  క్రికెట్ స్టేడియంలలో దుస్థితి తాజా పరిస్థితి ఇది!
X

వచ్చే ఏడాది పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న సంగతి తెలిసిందే. అయితే... ఈ ట్రోఫీలో మ్యాచ్ లను భారత్ ఎక్కడ ఆడుతుందనేది మాత్రం క్లారిటీ లేదు. పాక్ వెళ్లేది లేదని మాత్రం బీసీసీఐ ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. ఆ సంగతి అలా ఉంటే... పాకిస్థాన్ లోని స్టేడియంల పరిస్థితి అత్యంత అధ్వ్వాన్నంగా ఉందని పీసీబీ ఛైర్మన్ తాజాగా చెబుతుండటం గమనార్హం.

అవును... వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకూ పాకిస్థాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనున్న నేపథ్యంలో... అక్కడి క్రికెట్ స్టేడియాల్లో సదుపాయాలపై పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మోసిన్ నక్వీ దృష్టిసారించినట్లు చెబుతున్నారు. ఈ స్టేడియాలు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు చాలా దూరంగా ఉన్నట్లు గుర్తించారని అంటున్నారు.

తాజాగా లాహోర్ లోని గడాఫీ స్టేడియంన్ని సందర్శించిన మోసిన్ నక్వీ... మౌలిక సదుపాయాల కల్పన ఇప్పుడు అతిపెద్ద సవాలుగా నిలవనుందని అభిప్రాయపడ్డారు. దీన్ని మొత్తం పునర్నిర్మాణం చేపట్టాల్సిన ఉండొచ్చని తెలిపారు. ఇక్కడున్న స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాల్లో ఒక ప్రమాణాన్ని కూడా పూర్తిగా అందుకోలేవని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో... స్టేడియంలలో తగినన్నిసీట్లు లేవు, కనీసం బాత్రూమ్ లు కూడా లేవు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇక గడాఫీ స్టేడియంకు సమీపంలో ఓ హోటల్ కూడా నిర్మిస్తునట్లు చెప్పిన ఆయన.. ఇప్పటికే ఆ పనులు అయితే పూర్తయ్యాయని కానీ మొత్తం నిర్మాణాలు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదని చెప్పారు. పగలు రాత్రి టీమ్స్ పనిచేస్తున్నాయని అన్నారు.

ఎన్ని సమస్యలు ఉన్నా ప్రపంచంలోనే అత్యుత్తమ స్టేడియాలుగా వీటిని మారుస్తామనే నమ్మకం తమకుందని నక్వీ చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి ప్రాథమిక మౌలిక వసతులను కల్పించడమే తమ తొలి ప్రాధాన్యం అని వెల్లడించారు. దీంతో.. ఛాంపియన్ ట్రోఫీ నాటికి పాక్ లో స్టేడియాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయా లేదా అనేది చర్చనీయాంశం అవుతుంది.

కాగా... వచ్చే ఏడాది ఛాంపియన్ ట్రోఫీ పాక్ లో జరగనున్న సంగతి తెలిసిందే. దీనికోసం పీసీబీ ఎప్పుడో పనులను ప్రారంభించింది. స్టేడియాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఇప్పటికే సుమారు 17 బిలియన్ పాకిస్థాన్ రూపాయలను కేటాయించింది. ఇప్పుడు పీసీబీ ఛైర్మన్ మాత్రం స్టేడియాలలో మౌలిక వసతుల కల్పనే తమ తొలి ప్రధాన్యం అని అంటున్నారు!