అత్యధికంగా బిచ్చగాళ్లు ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా?
ఈ లెక్కల ప్రకారం... 81 వేల మందికి పైగా బిచ్చగాళ్లతో పశ్చిమ బెంగాల్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండగా
By: Tupaki Desk | 4 Oct 2023 12:30 AM GMTబిచ్చగాళ్ళు.. మిగిలిన చోట్లేమో కానీ సిటీస్ లో సిగ్నల్ దగ్గర మాత్రం వీరి సందడి ఎక్కువగానే ఉంటుందనే విషయం సిటీలతో పరిచయం ఉన్న ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. ఇక మిగిలిన ప్రాంతాల్లో అయితే ఎక్కువగా కూడళ్లలోనూ, మార్కెట్ లలోనూ, ప్రధానంగా గుళ్ల వద్ద కనిపిస్తుంటారు. వీరిలో కొంతమంది రిక్వస్ట్ గా అడిగితే, మరికొంతమంది అడుగుటలో డిమాండ్ వినిపిస్తుంటుంది. అయితే ప్రతీ బిచ్చగాడి వెనుకా ఒక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుందనేది మాత్రం వాస్తవం!
ఈ ఉపోద్ఘాతం సంగతి కాసేపు పక్కనపెడితే... అసలు ఈ బిచ్చగాళ్లు మనకు కనిపించే చోటే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది కానీ... వీరు మన దేశంలో ఎక్కువగా ఏ రాష్ట్రంలో ఉన్నారు అనే లెక్కలు తాజాగా తెరపైకి వచ్చాయి. అవును... దేశంలోని మొత్తం యాచకుల సంఖ్యపై కేంద్ర ప్రభుత్వం గతంలో ఓ ప్రకటన చేసింది. ఆ లెక్కలు మరోసారి వైరల్ అవుతున్నాయి.
ఈ లెక్కల ప్రకారం... దేశంలో మొత్తం 4 లక్షల మంది బిచ్చగాళ్ల ఉన్నారని కేంద్ర ప్రభుత్వ ఘణాంకాలు చెబుతున్నాయి. ఇందులో స్త్రీ పురుషుల నిష్పత్తి దాదాపు సమానంగా ఉందని చెబుతున్నారు. అంటే దేశంలో ఈ విషయంలో మాత్రం స్త్రీ, పురుషులిద్దరూ సమానంగా ఉన్నారన్నమాట. ఇదే క్రమంలో... బిచ్చగాళ్లలో పిల్లలు కూడా ఉండడం దారుణమైన విషయమనే చెప్పుకోవాలి.
ఈ లెక్కల ప్రకారం... 81 వేల మందికి పైగా బిచ్చగాళ్లతో పశ్చిమ బెంగాల్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉండగా.. 65 వేలకు పైగా బిచ్చగాళ్లతో ఉత్తరప్రదేశ్ లో రెండోస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఎక్కువమంది బిచ్చగాళ్లు ఉన్న రాష్ట్రాల్లో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఇక అంకెల విషయానికొస్తే... ఆంధ్రప్రదేశ్ లో 30,218.. బీహార్ 29,723.. మధ్యప్రదేశ్ 28,695.. రాజస్థాన్ 25,853 మంది బిక్షగాళ్లు ఉన్నారని కేంద్రప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కల్లో చండీగఢ్ లో కేవలం 121 మంది యాచకులు మాత్రమే ఉన్నారు. రాష్ట్రల పరిస్థితి ఇలా ఉంటే... కేంద్రపాలిత ప్రాంతల్లో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది!
ఈ లెక్కల ప్రకారం డామన్-డయ్యూలో 22 మంది బిచ్చగాళ్లు ఉండగా.. దాదర్ నగర్ హవేలీలో 19 మంది ఉన్నారు. ఇక లక్షద్వీప్ లో కేవలం ఇద్దరు బిచ్చగాళ్లు మాత్రమే ఉండటం గమనార్హం. కాగా... ఈ లెక్కలన్నీ 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ఆధారంగా ప్రకటించారు.
అయితే ఇలా వీరంతా బిచ్చగాళ్లుగా మరడానికి చాలా కారణాలే ఉన్నాయని చెబుతున్నారు. వీరిలో చాలా మంది ఉపాధి లేకపోవడం వల్ల బిచ్చగాళ్లుగా మారుతుంటే... వృద్ధాప్యంలో పిల్లలు ఆదరణ లేక మరికొంతమంది బిక్షాటన చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. మరోపక్క దేశంలో చాలా మంది అనాథ పిల్లలను బెగ్గింగ్ మాఫియా యాచక వృత్తిలోకి దించుతుందని అంటున్నారు!